medak DSP
-
స్టూడెంట్ పోలీస్తో దురాచారాలకు చెక్!
సాక్షి, మెదక్: మున్సిపాలిటీ: సమాజంలో దురాచారాలను పారదోలేందుకే స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. మెదక్ పట్టణంలోని వేంకటేశ్వర గార్డెన్లో స్టూడెంట్ పోలీస్ క్యాడెట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరైతే కష్టాల్లో ఉంటారో వారిని ఆదుకోవడం పోలీస్ శాఖ మొదటి కర్తవ్యమన్నారు. పోలీస్ శాఖకు కుల, మత, వర్ణ, వర్గ, ధనిక, పేద లింగ బేధం తేడా ఉండవని, అందరికి సమన్యాయం చేస్తూ పని చేసేదే వ్యవస్థ అని వివరించారు. ఈ వ్యవస్థలో స్టూడెంట్ పోలీస్ క్యాడెట్‌ను భాగస్వాములను చేస్తూ సమాజంలో పాతుకుపోయిన దురాచారాలను పారద్రోలే విధంగా వీరిని తయారు చేస్తామన్నారు. అలాగే పోలీస్ శాఖలో ఒక వినూత్న ప్రయోగానికి మెదక్ జిల్లా వేదికయ్యిందన్నారు. ఇప్పటి వరకు లా అండ్ ఆర్డర్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, ఎక్సైజ్ పోలీస్ ఇలా వివిధ రకాల పోలీసులను చూశామని, ఇప్పటి వరకు చూడని ఒక కొత్త పోలీస్‌ను మెదక్ జిల్లాలో చూడబోతున్నారని తెలిపారు. అతడే స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ అన్నారు. పోలీస్ శాఖపై ప్రజల్లో ఉన్న ప్రతికూల అంశాలకు సంబంధించి వారి దృక్పథంలో మార్పు తెచ్చేందుకు స్టూడెంట్ పోలీస్ క్యాడెట్‌ను రూపుదిద్దుతున్నామని చెప్పారు. ఇది పోలీస్, విద్యా శాఖ సంయుక్తంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం ఎంపిక చేసిన 440 మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ పొందిన పోలీస్ సిబ్బందితో ప్రతి శుక్ర, శనివారాల్లో శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి, విద్యాశాఖ నోడల్ అధికారి మధుమోహన్, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ, మెదక్ పట్టణ సీఐ వెంకటయ్య, ఎస్బీఎస్ఐ రాంబాబు, ఏఎస్ఐ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. -
లోపలేసి మూసేస్తా!
మెదక్ డీఎస్పీ నాగరాజు కస్సుబుస్సు సెల్ఫోన్లు లాక్కుని.. ఫొటోలు డిలీట్ దుర్భాషలాడుతూ విలేకరులపై వీరంగం కొండపాక: మెదక్ డీఎస్పీ నాగరాజు సహనం కోల్పోయి విలేకరులపై విరుచుకుపడ్డారు. విలేకరుల చేతిలో నుంచి సెల్ఫోన్లు లాకున్నారు. అందులోని డేటాను, ఫొటోలను డిలీట్ చేశారు. ఎక్కువ మాట్లాడితే సెల్లో వేస్తానంటూ బెదిరించారు. దొంగల్లా వస్తారా? అంటూ నానా దుర్భాషలాడారు. ఈ ఘటన శనివారం కొండపాక మండలం కుకునూర్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కుకునూర్‌పల్లి ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఉన్నతాధికారుల వేధింపులను భరించలేక ఈనెల 16న సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు శనివారం డీఐజీ అకున్ సబర్వాల్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి వచ్చారు. ఈ వార్తను కవర్ చేయడానికి స్థానిక విలేకరులు ఠాణాకు వెళ్లారు. అధికారులు సాక్షులను విచారిస్తున్న ఫొటోలను విలేకరులు చిత్రీకరించారు. వీరావేశంతో విలేకరుల వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చిన మెదక్ డీఎస్పీ నాగరాజు.. తన అనుమతి లేకుండా ఫొటోలు ఎలా తీస్తారంటూ చిందులేశారు. ఇలా చేసినందుకు లోపల కూర్చోబెడతానంటూ రెచ్చిపోయారు. తాము విలేకరులమని చెప్పినా విన్పించుకోలేదు. ‘మీరు దొంగలో.. విలేకరులో ఎలా తెలుస్తుంది?’ అంటూ పరుష పదజాలాన్ని ప్రయోగించారు. ఐడీ కార్డు చూపించినా కోపం తగ్గలేదు. విలేకరుల వద్ద ఫోన్లు లాక్కుని పోలీస్‌స్టేషన్‌లో విచారణకు సంబంధించిన ఫొటోలతో పాటు ఇతర ఫొటోలనూ డిలీట్ చేశారు. కేసు విచారణ విషయంలో పేపర్లో ఏమో బాగా రాశారట గదా అంటూ కన్నెర్ర చేస్తూ వెళ్లిపోయారు. లోపలేసినా వార్తలు పంపుతాం.. వరుస ఘటనలతో పోలీసులు సహనం కోల్పోయి విలేకరులపై విరుచుకు పడటం మంచిది కాదని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. డీఎస్పీ నాగరాజు విలేకరులను సెల్లో వేసి బంధించినా అక్కడి నుంచి వార్తలను పంపటమే తమ వృత్తి ధర్మమన్నారు. డీఎస్పీ అనుచిత ప్రవర్తనను ఖండిస్తున్నామన్నారు. జిల్లాలో విలేకరులపై పోలీసు దాడులు కొత్తకాదని, ఇప్పుడు మెదక్ డీఎస్పీ కూడా అలాగే వ్యవహరించారన్నారు. మరోసారి ఇలాంటి సంఘటన జరిగితే ఆందోళనకు సిద్ధమవుతామని విష్ణువర్ధన్‌రెడ్డి హెచ్చరించారు.