భక్తలోకానికి బ్రహ్మోత్సవం
భక్తలోకానికి బ్రహ్మోత్సవం
Published Mon, Oct 10 2016 9:43 PM | Last Updated on Mon, Sep 4 2017 4:54 PM
ద్వారకాతిరుమల వేడుకలకు సిద్ధం
ద్వారకా తిరుమల :
భక్తలోకానికి మంగళవారం పర్వదినం. దివ్యమంగళ స్వరూపుడు, ద్వారకాతిరుమలలో వేంచేసిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాలకు సిద్ధమయ్యాడు. ఈ ఉత్సవాలు మంగళవారం నుంచి ఈనెల 18వరకూ అంగరంగవైభవంగా జరగనున్నాయి. ఉత్సవాలకు ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విద్యుద్దీపాలతో ఆలయం శోభాయమానంగా దర్శనమిస్తోంది. ఆలయ గోపురాలు విద్యుత్‌కాంతులతో మిరుమిట్లు గొలుపుతున్నాయి. ఆలయ ప్రాంగణంలోని పలు ప్రాంతాల్లో అధికారులు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవ సమయంలో ప్రతిరోజూ రాత్రి, పగటి వేళల్లో శ్రీవారికి తిరువీధుల్లో జరుగనున్న వివిధ వాహన సేవలు జరగనన్నాయి. దీనికోసం వాహనాలను సిబ్బంది ముస్తాబు చేస్తున్నారు. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని శ్రీహరి కళాతోరణంలో సాంస్కతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు. దీనికోసం వేదికను సుందరీకరించారు. మంగళవారం శ్రీవారు, అమ్మవార్లను పెండ్లికుమారుడు, పెండ్లికుమార్తెలుగా ముస్తాబు చేయడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. స్వామివారు రోజుకో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారని వివరించారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు
ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు భజనలు
ఉదయం 10 గంటల నుంచి శ్రీవారిని పెళ్లికొడుకుగానూ, అమ్మవార్లను పెళ్లికుమార్తెలుగానూ చేస్తారు.
ఉదయం 9.30 నుంచి 11.30 వరకు అన్నమాచార్య సంకీర్తనలు ఆలాపన.
సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు సంగీత కచేరి
సాయంత్రం 6 గంటల నుంచి కూచిపూడి నృత్య ప్రదర్శన
రాత్రి 7 గంటల నుంచి కూచిపూడి నృత్య ప్రదర్శన , అన్నమాచార్య కీర్తనల ఆలాపన
రాత్రి 7 గంటల నుంచి గజవాహనంపై శ్రీవారి తిరువీధిసేవ.
Advertisement