china venkanna
-
చినవెంకన్న ఆలయ వేళల్లో మార్పులు !
పశ్చిమగోదావరి ,ద్వారకాతిరుమల: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ వేళలు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే శని, ఆదివారాలు, పర్వదినాల్లో మార్పు చేసేందుకు ఆలయ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆలయ ఈఓ దంతులూరి పెద్దిరాజు ఆలయ అర్చకులతో, అధికారులతో విస్తృత చర్చలు జరిపారు. శ్రీవారి క్షేత్రానికి శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటోంది. పాదయాత్రగా క్షేత్రానికి చేరుకునే భక్తులు శుక్రవారం రాత్రికేఆలయానికి స్వామివారి దర్శనార్థం చేరుకుంటున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాన్ని అందించే క్రమంలో శని, ఆదివారాలు, పర్వదినాల్లో అధికారులు శ్రీవారి దర్శన వేళల్లో మార్పు చేయనున్నారు. ప్రస్తుతం తెల్లవారుజామున4 గంటలకు శ్రీవారి ఆలయ ద్వారాలను తెరచి, అర్చనాది కార్యక్రమాలు సుప్రభాత సేవలను నిర్వహిస్తున్నారు. ఆ తరువాత స్వామివారికి అలంకారాలు జరిపి, ఉదయం 6 గంటల నుంచి భక్తులకు చినవెంకన్న దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. అయితే ఈ సమయానికే స్వామివారి దర్శనార్ధం భక్తులు అధిక సంఖ్యలో బారులు తీరడంతో పాటు, క్యూలైన్లు నిండిపోతున్నాయి. దీన్నిగమనించిన ఆలయ అధికారులు తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయ ద్వారాలను తెరచి, భక్తులకు 5.30 గంటలకే దర్శనాన్ని కల్పించేలా చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా స్వామివారికి జరిగే నిత్యార్జిత కల్యాణం ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోనున్నారు. శని, ఆదివారాలు, పర్వదినాల్లో జరుగనున్న ఈ ఆలయ వేళల మార్పులపై, అలాగే నిత్యార్జిత కల్యాణ వేళలపై దేవస్థానం చైర్మన్ ఎస్వీ.సుధాకరరావు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
నేత్ర పర్వం.. శ్రీవారి రథోత్సవం
ద్వారకాతిరుమల : సమ్మోహిత రూపంతో భక్తులకు అభయహస్తమిస్తూ చినవెంకన్న ఉభయదేవేరులతో రథవాహనంపై తిరువీధుల్లో విహరించారు. ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి శ్రీవారి రథరంగ డోలోత్సవం కనుల పండువగా నిర్వహించారు. రథంపై శ్రీదేవి, భూదేవిలతో స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీహరి కళాతోరణంలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. వైభవోపేతంగా రథరంగ డోలోత్సవం శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం జరిగిన మరుసటి రోజు రథోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తోంది. బ్రహ్మోత్సవాల సమయంలో రథవాహనం ద్వారా భక్తులు స్వామికి సేవచేసుకునే అవకాశం లభించింది. బుధవారం రాత్రి ఆలయంలో ఉభయ దేవేరులతో శ్రీవారిని తొళక్కం వాహనంపై ఉంచి పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం రథంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై కల్యాణమూర్తులను ఉంచి హారతులిచ్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, విచిత్ర వేషధారణలు, డప్పువాయిద్యాలు, కోలాటభజనలతో శ్రీవారి రథం క్షేత్ర పురవీధుల్లో తిరుగాడింది. ఆలయ ఫౌండర్ ట్రస్టీ ఎస్వీపీజే గోపాలరావు, ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు దంపతులు రథానికి బలిహరణ సమర్పించిన అనంతరం రథయాత్ర ప్రారంభమైంది. ఈఓ త్రినాథరావు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. మురళీకృష్ణుడిగా మురళీకృష్ణుడి అలంకారంలో చినవెంకన్న బుధవారం భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి ఆలయంలో జరుగుతున్న వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలు సందర్భంగా స్వామివారు రోజుకో అలంకారంలో భక్తులను కటాక్షిస్తున్నారు. ఈ క్రమంలో స్వామివారు పిల్లనగ్రోవి ధరించి, గోవులను సంరక్షించే మురళీకృష్ణుడిగా భక్తులకు కనువిందు చేశారు. బ్రహ్మోత్సవాల్లో నేడు ఉదయం 10 గంటలకు భక్తి రంజని ఉదయం 10.30 గంటలకు అపబృదోత్సవం మధ్యాహ్నం 3 గంటల నుంచి వేద సదస్సు సాయంత్రం 5 గంటలకు కూచిపూడి నృత్య ప్రదర్శనలు రాత్రి 7 గంటల నుంచి పూర్ణాహుతి, మౌనబలి, ధ్వజారోహణ రాత్రి 8 గంటల నుంచి బుర్రకథ ప్రదర్శన రాత్రి 8 గంటల నుంచి అశ్వవాహనంపై గ్రామోత్సవం -
కనుల పండువగా వసంతోత్సవం
ద్వారకా తిరుమల : చిన వెంకన్న ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు మంగళవారం జరిగిన విశేష కార్యక్రమాలతో ముగిశాయి. ఉదయం ఆలయంలో చూరో్ణత్సవం, వసంతోత్సవం కార్యక్రమాలను అర్చకులు వేద మంత్రోచ్ఛరణలతో ఘనంగా నిర్వహించారు. శ్రీవారి వసంతోత్సవం తిరువీధుల్లో ఘనంగా జరిపారు. రాత్రి ఆలయ ఆవరణలో స్వామివారికి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీ పుష్ప యాగోత్సవాన్ని ఆలయ అర్చకులు, పండితులు వైభవోపేతంగా నిర్వహించారు. వసంతోత్సవం ఇలా.. ఆలయ కల్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఉంచి ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. అనంతరం అర్చనాది కార్యక్రమాలు జరిపారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్లకు వసంతాలను సమర్పించారు. అర్చకులు శ్రీ స్వామివారిని కీర్తిస్తూ వడ్లను దంచారు. అనంతరం భక్తులకు వసంతాలను వేడుకగా చల్లారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి సతీమణి భాగ్యలక్ష్మి కల్యాణ మూర్తులకు వసంతాలు సమర్పించారు. ఎంతో వేడుకగా జరిగిన ఈ ఉత్సవం భక్తులను అలరించింది. నేత్రపర్వంగా ద్వాదశ కోవెల ప్రదక్షిణలు దేవాలయ ప్రాంగణంలో ఉభయ దేవేరులతో శ్రీనివాసమూర్తికి 12 ప్రదక్షిణలు, 12 సేవా కాలాలు, 12 రకాల పిండి వంటలతో నివేదన కార్యక్రమాలు రాత్రి కనుల పండువగా జరిపారు. ఈ ద్వాదశ కోవెల ప్రదక్షిణలో అర్చకులు, పండితులు, భక్తులు, అధికారులు పాల్గొన్నారు. ఒక్కో ప్రదక్షిణతో ఒక్కో సేవాకాలాన్ని నిర్వహించారు. అలాగే ఒక్కో ప్రదక్షిణకు ఒక్కో పిండివంటను ఆరగింపుచేసి స్వామికి హారతులనిచ్చారు. వీణా, వేణువు, మృదంగం, గానం, నృత్యం, శృతి, శ్మ్రుతి, ద్రవిడ వేదం, బేరి, కాహలము, గంటారావం, నిశ్వబ్దం వెరసి 12 సేవలు, 12 ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం స్వామివారి పవళింపుసేవా మందిరాన్ని సుగంధ భరిత పుష్పమాలికలతో అలంకరించారు. తరువాత శ్రీపుష్పయాగోత్సవాన్ని వేద మంత్రోచ్ఛరణలతో అర్చకులు, పండితులు వైభవంగా జరిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. -
భక్తలోకానికి బ్రహ్మోత్సవం
ద్వారకాతిరుమల వేడుకలకు సిద్ధం ద్వారకా తిరుమల : భక్తలోకానికి మంగళవారం పర్వదినం. దివ్యమంగళ స్వరూపుడు, ద్వారకాతిరుమలలో వేంచేసిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాలకు సిద్ధమయ్యాడు. ఈ ఉత్సవాలు మంగళవారం నుంచి ఈనెల 18వరకూ అంగరంగవైభవంగా జరగనున్నాయి. ఉత్సవాలకు ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విద్యుద్దీపాలతో ఆలయం శోభాయమానంగా దర్శనమిస్తోంది. ఆలయ గోపురాలు విద్యుత్‌కాంతులతో మిరుమిట్లు గొలుపుతున్నాయి. ఆలయ ప్రాంగణంలోని పలు ప్రాంతాల్లో అధికారులు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవ సమయంలో ప్రతిరోజూ రాత్రి, పగటి వేళల్లో శ్రీవారికి తిరువీధుల్లో జరుగనున్న వివిధ వాహన సేవలు జరగనన్నాయి. దీనికోసం వాహనాలను సిబ్బంది ముస్తాబు చేస్తున్నారు. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని శ్రీహరి కళాతోరణంలో సాంస్కతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు. దీనికోసం వేదికను సుందరీకరించారు. మంగళవారం శ్రీవారు, అమ్మవార్లను పెండ్లికుమారుడు, పెండ్లికుమార్తెలుగా ముస్తాబు చేయడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. స్వామివారు రోజుకో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారని వివరించారు. బ్రహ్మోత్సవాల్లో నేడు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు భజనలు ఉదయం 10 గంటల నుంచి శ్రీవారిని పెళ్లికొడుకుగానూ, అమ్మవార్లను పెళ్లికుమార్తెలుగానూ చేస్తారు. ఉదయం 9.30 నుంచి 11.30 వరకు అన్నమాచార్య సంకీర్తనలు ఆలాపన. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు సంగీత కచేరి సాయంత్రం 6 గంటల నుంచి కూచిపూడి నృత్య ప్రదర్శన రాత్రి 7 గంటల నుంచి కూచిపూడి నృత్య ప్రదర్శన , అన్నమాచార్య కీర్తనల ఆలాపన రాత్రి 7 గంటల నుంచి గజవాహనంపై శ్రీవారి తిరువీధిసేవ. -
నిత్య అన్నదాన ట్రస్ట్‌కు రూ.లక్ష విరాళం
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల చినవెంకన్న నిత్యాన్నదాన ట్రస్టుకు ఒక భక్తుడు సోమవారం రూ.1,00,116 లను విరాళంగా అందించాడు. తాడేపల్లిగూడెంకు చెందిన వడ్డి రఘురామ్, సుధ దంపతులు శ్రీవారిని, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం అన్నదాన కార్యాలయంలో ఈ విరాళాన్ని జమ చేశారు. దాతలకు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు బాండ్‌ను అందజేశారు.