
పశ్చిమగోదావరి ,ద్వారకాతిరుమల: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ వేళలు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే శని, ఆదివారాలు, పర్వదినాల్లో మార్పు చేసేందుకు ఆలయ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆలయ ఈఓ దంతులూరి పెద్దిరాజు ఆలయ అర్చకులతో, అధికారులతో విస్తృత చర్చలు జరిపారు. శ్రీవారి క్షేత్రానికి శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటోంది. పాదయాత్రగా క్షేత్రానికి చేరుకునే భక్తులు శుక్రవారం రాత్రికేఆలయానికి స్వామివారి దర్శనార్థం చేరుకుంటున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాన్ని అందించే క్రమంలో శని, ఆదివారాలు, పర్వదినాల్లో అధికారులు శ్రీవారి దర్శన వేళల్లో మార్పు చేయనున్నారు.
ప్రస్తుతం తెల్లవారుజామున4 గంటలకు శ్రీవారి ఆలయ ద్వారాలను తెరచి, అర్చనాది కార్యక్రమాలు సుప్రభాత సేవలను నిర్వహిస్తున్నారు. ఆ తరువాత స్వామివారికి అలంకారాలు జరిపి, ఉదయం 6 గంటల నుంచి భక్తులకు చినవెంకన్న దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. అయితే ఈ సమయానికే స్వామివారి దర్శనార్ధం భక్తులు అధిక సంఖ్యలో బారులు తీరడంతో పాటు, క్యూలైన్లు నిండిపోతున్నాయి. దీన్నిగమనించిన ఆలయ అధికారులు తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయ ద్వారాలను తెరచి, భక్తులకు 5.30 గంటలకే దర్శనాన్ని కల్పించేలా చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా స్వామివారికి జరిగే నిత్యార్జిత కల్యాణం ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోనున్నారు. శని, ఆదివారాలు, పర్వదినాల్లో జరుగనున్న ఈ ఆలయ వేళల మార్పులపై, అలాగే నిత్యార్జిత కల్యాణ వేళలపై దేవస్థానం చైర్మన్ ఎస్వీ.సుధాకరరావు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment