ఈ-పోస్‌..తుస్‌! | e poss fail | Sakshi
Sakshi News home page

ఈ-పోస్‌..తుస్‌!

Published Mon, Dec 12 2016 11:31 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 PM

ఈ-పోస్‌..తుస్‌!

ఈ-పోస్‌..తుస్‌!

-  జిల్లాకురాని యంత్రాలు
- దరఖాస్తులకు లభించని మోక్షం
- అవసరం 10 వేలు..వచ్చింది శూన్యం
- నత్తనడకన.. ‘నగదు రహితం’
- ప్రజలకు తప్పని నోటు కష్టాలు
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు:  కర్నూలుకు చెందిన రమేష్‌ నెలవారీ సరుకుల కోసం పాత బజారుకు వెళ్లాడు. అక్కడ సరుకులు మొత్తం తీసుకున్న తర్వాత బిల్లు చూస్తే రూ.2,300 అయ్యింది. బిల్లు చెల్లించేందుకు కార్డు తీసి స్వైప్‌ చేయమన్నాడు. అయితే, తమ వద్ద ఈ–పోస్‌ యంత్రం లేదని.... నగదు అదీ కొత్త నోట్లు ఇవ్వాలని షాపు యజమాని చెప్పారు. రోజంతా క్యూలో నిలబడి సంపాదించి రూ.2 వేల నోటుతో పాటు నూరు రూపాయల వంద నోట్లు కలిపి బిల్లు చెల్లించాడు రమేష్‌.  కుమారుడి పుట్టినరోజు సందర్భంగా దుస్తులు కొనుగోలు చేసిన విజయ్‌దీ ఇదే పరిస్థితే....
 
 జిల్లాలో సామాన్య వినియోగదారులు ఎదుర్కొంటున్న రోజువారీ కరెన్సీ కష్టాలకు ఇవి ఉదాహరణ. నోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలను పెంచాలని అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఈ–పోస్‌ యంత్రాల ద్వారా లావాదేవీలు నిర్వహించాలని వ్యాపార, వాణిజ్య వర్గాలకు ప్రభుత్వ పెద్దలు, అధికారులు చెబుతున్నప్పటికీ ఆశించిన ఫలితాలు ఉండటం లేదు. నగదు రహిత లావాదేవీలను నిర్వహించేందుకు తాము సిద్ధమని... ఇందుకోసం ఈ–పోస్‌ యంత్రాలు ఇవ్వాలని పలు వ్యాపార, వాణిజ్యవర్గాలు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాయి. అయితే, ఇప్పటివరకు వారికి యంత్రాలను మాత్రం సరఫరా చేయలేకపోయారు. ఫలితంగా రోజంతా ఏటీఎంల వద్ద క్యూలో నిలబడితే వచ్చిన రూ.2 వేల నోటును ఈ విధంగా ఖర్చు చేయాల్సి వస్తోందని సామాన్య ప్రజలు వాపోతున్నారు. 
 
అవసరం 10 వేలు...ఇచ్చింది సున్నా!
వాస్తవానికి జిల్లావ్యాప్తంగా ఉన్న వ్యాపార, వాణిజ్య సంస్థల్లో నగదు రహిత లావాదేవీలను నిర్వహించేందుకు వారితో జిల్లా యంత్రాంగం గత నెలలోనే సమావేశాన్ని నిర్వహించింది. ఈ–పోస్‌ యంత్రాలను ప్రతీ వ్యాపారి ఏర్పాటు చేసుకోవాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. ఇందుకు ఆయా వర్గాలు కూడా సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఇందుకు అనుగుణంగా గత నెల 20వ తేదీనే అనేక మంది ఈ–పోస్‌ యంత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే 22 రోజులు గడిచినప్పటికీ ఒక్క యంత్రం కూడా వీరికి చేరలేదు. ఎప్పుడు వస్తాయనే విషయాన్ని కూడా ఏ ఒక్కరూ నిర్దిష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో తప్పనిసరి పరిస్థితులల్లో నగదు.. అదీ కొత్త నోట్లు ఇస్తేనే సరుకులు ఇస్తున్నామని వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి. 
 
పనిచేయని ఏటీఎంలు..!
జిల్లావ్యాప్తంగా 475 ఏటీఎంలు ఉన్నాయి. ఇందులో సోమవారం పనిచేసిన ఏటీఎంలు కేవలం నాలుగంటే నాలుగే. ఇందులోనూ ఒక ఏటీఎం కేవలం రెండు గంటలపాటు మాత్రమే పనిచేసింది. అనంతరం నగదు అయిపోవడంతో గంటలకొద్దీ ఏటీఎంల ముందు నిలుచుకున్న ప్రజలు ఊసురోమని మరో ఏటీఎం వద్దకు పోవాల్సి వచ్చింది. ఇక కర్నూలు నగరంలో కేవలం రెండు ఏటీఎంలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ రెండింటి ద్వారానే నగర ప్రజలందరూ నగదు తీసుకోవాల్సి వస్తుండటంతో మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. ఇక క్యూలో గంటలకొలదీ నిల్చోలేని వృద్ధులు.... యువతను పిలిచి రూ.200 ఇస్తామంటూ ఏటీఎం కార్డును అప్పగించి ఒక పక్కన కూర్చోని వేచిచూశారు. ఈ విధంగా అనేక మంది యువకులు క్యూలో నిలబడి డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే, తమకు వచ్చే రూ.2 వేల లోనూ ఈ విధంగా రూ.200 పోగొట్టుకోవాల్సి వస్తోందని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద నగదు కష్టాలు జిల్లాలో రోజురోజుకీ పెరుగుతున్నాయే తప్ప ఏ మాత్రమూ తగ్గడం లేదు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement