బొమ్మలతో పాఠ్యాంశాల బోధన
1. 2 తరగతుల నుంచే సైన్స్ పరిచయం
శాస్త్రీయ దృక్పథం పెంచేందుకు శ్రీకారం
కాకినాడ రూరల్ :
దృశ్యం.. కంటి ద్వారా మెదడులోకి.. తద్వారా మనసులో నిక్షిప్తమయ్యే అద్భుత విశేషం. విన్న, చదివిన విషయం కన్నా చూసినది సుదీర్ఘకాలం గుర్తుంచుకుంటుంది మనసు. చూసిన బొమ్మని.. దాని విశేషాంశాలను మరచిపోదామనుకున్నా త్వరగా మరువలేము. ఈ సిద్ధాంతాన్ని అనుసరించి విద్యా శాఖ ప్రభుత్వ పాఠశాలల్లో నూతన పాఠ్య ప్రణాళిక రూపొందిస్తున్నది.
శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధికి అనుగుణంగా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్ప«థం పెంపొందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ చరిత్రలో మొదటిసారిగా 1, 2 తరగతుల్లో ‘మనం–మన పరిసరాలు’ శీర్షికతో పరిసరాల విజ్ఞానం పాఠ్యపుస్తకాలు ప్రవేశపెట్టింది. రాష్ట్ర విద్యాపరిశోధక శిక్షణ సంస్థ (ఎన్‌సీఈఆర్‌టీ) రూపొందించిన ఈ పుస్తకాల్లో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో పదాలు, బొమ్మలు పొం దుపరిచారు. ఉపాధ్యాయులు ఎక్కువగా మాటల ద్వారానే విద్యార్థులకు పరిసరాల విజ్ఞానాన్ని బోధించే రీతిలో పుస్తకాలు ఉన్నాయి. ఇప్పటికే 1, 2 తరగతుల్లో ఉన్న తెలుగు, ఆంగ్లం, గణితం పాఠ్యాంశాలతో పాటు పరిసరాల విజ్ఞానం మరో సబ్జెక్టుగా ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెట్టడంతో విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
అలోచనా విధానం పెంచేలా
పరిసరాల విజ్ఞానం పాఠ్యాంశాలు విద్యార్థుల జిజ్ఞాసను, విషయ పరిజ్ఞానం పెంచేలా, బోధనాంశం తెలుసుకోవాలన్న కుతూహలం పెరిగేలా ఉన్నాయి. పాఠ్యాంశాలను పరిశీలిస్తే.. ఒకటో తరగతిలో నేను–నా కుటుంబం, నేను–నాశరీరం, పూలు, పండ్లు కూరగాయలు, మన నేస్తాలు, తిందాం.. తిందాం, నేను– మాఇల్లు, వ్యక్తిగ పరిశుభ్రత, ఊరికి పోదాం, మా ఇంట్లో వస్తువులు, పగలు–రాత్రి అంశాలు ఉన్నాయి, 2వ తరగతిలో నేను– మా బంధువులు, చూద్దాం–చేద్దాం, రకరకాల చెట్లు, గాలి, నీళ్లు, జంతు ప్రపంచం, ఆహారం, ఇల్లు–వసతులు, ఇల్లు–పరిశుభ్రత, మా ఇరుగుపొరుగు, మా ఆటలు, రవాణా సాధనాలు, కాలాలు–జంతువులు అనే పాఠాలు ఉన్నాయి. వీటిని నేర్చుకోవటం ద్వారా విద్యార్థిలో కుటుంబం, సమాజం, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత ఆహార పద్ధతులు, జీవరాశులు తదితర అంశాలు అవగతమవుతాయి. పై తరగతుల్లో సులభంగా నేర్చుకునేందుకు ఇవి దోహదపడతాయని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రైవేటుకు దీటుగా..
ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీల్లో ఈ విధానం అమల్లో ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ తరహా బోధనా విధానం ఇప్పటి వరకు లేకపోవటంతో చాల వరకు విద్యార్థులు పై అంశాల గురించి పై తరగతుల్లో మాత్రమే నేర్చుకునే వారు. నూతనంగా ప్రవేశపెట్టిన పరిసరాల విజ్ఞానం పాఠ్యాంశాల ద్వారా విద్యార్థులు 1, 2 తరగతుల స్థాయిలోనే వీటి గురించి తెలుసుకునే చక్కని అవకాశం కల్పించినట్టయింది.
ప్రత్యక్షానుభవం కలిగించేలా
జాతీయ విద్యా ప్రణాళిక, విజ్ఞాన శాస్త్ర పాఠ్యప్రణాళిక రూపొందించేందుకు సజీవ ప్రపంచం, ఆహారం, సహజ వనరులు, వస్తువులు, అవి ఎలా పనిచేస్తాయి, కదిలే వస్తువులు, ప్రజల భావనల సహజ దృగ్విషయాల ఆధారంగా రూపొందించబడ్డాయి. పలు రకాల పద్ధతుల ద్వారా పాఠ్యాంశాలను తెలుసుకునే అవకాశం ఉంది.