విద్యతో పేదరిక నిర్మూలన సాధ్యం
విద్యతో పేదరిక నిర్మూలన సాధ్యం
Published Sun, Aug 21 2016 9:10 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM
ఏయూక్యాంపస్: విద్యతో పేదరిక నిర్మూలన సాధ్యపడుతుందని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఉదయం ఏయూ సోషల్‌వర్క్ విభాగంలో కష్ణాపుష్కరాలను పురస్కరించుకుని ఏర్పాటుచేసిన ‘పేదరికంపై గెలుపు’ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పేదరిక నిర్మూలన ముందుగా మన కుటుంబం, గ్రామం నుంచి ఆరంభం కావాల్సి ఉందన్నారు. నాణ్యమైన ఉన్నత విద్యను కల్పించే దిశగా ప్రభుత్వం పనిచేయాలన్నారు.రెక్టార్ ఆచార్య ఇ.ఏ నారాయణ మాట్లాడుతూ నేడు పేదరికాన్ని కొంత వరకు అధిగమించడం జరిగిందన్నారు. స్వచ్చంద సంస్థలు ఈ ప్రక్రియలో చురుకైన భూమిక పోషిస్తున్నాయన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ సమర్ధ నాయకత్వంతో దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పేదరికంపై విజయం సాధించడానికి మరింత పనిచేయాల్సి ఉందన్నారు. ఆర్ట్స్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ ఆచార్య కె.శ్రీరామ మూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లాల మధ్య అభివద్ధిలో అసమానతలు ఉన్నాయన్నారు. నేటికీ విజనగరం, శ్రీకాకుళం, అనంతపురం, కడప జిల్లాలో ఒక్క పరిశ్రమ స్థాపన జరగలేదన్నారు. ప్రాంతీయ అసమానతలు తొలగించి సమాన ప్రగతి సాధించడం ఎంతో అవసరమన్నారు. దీనిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాల్సి ఉందన్నారు. సోషల్‌వర్క్ విభాగాధిపతి ఆచార్య పి.అర్జున్‌మాట్లాడుతూ విద్య, ఆరోగ్యం, నీరు, ప్రాధమిక మౌళిక సదుపాయాలను కల్పించడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించడానికి బాటలు వేయడం సాధ్యపడుతుందన్నారు. సోషల్‌వర్క్ విభాగ ఆచార్యులు ఎస్.వి సుధాకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో పేదరికాన్ని అధిగమించి అభివద్ది చెందే విధానాన్ని ఉదాహరణలతో వివరించారు. సదస్సు సమన్వయకర్త ఆచార్య కె.విశ్వేస్వరరావు మాట్లాడుతూ స్వచ్చంద సంస్థలు భాగస్వామ్యంతో పేదరికాన్ని నిర్మూలించడం సాధ్యపడుతోందన్నారు. కార్యక్రమంలో 15 స్వచ్ఛంద సంస్థల నిర్మాహకులు, ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులు పెద్దంసఖ్యలో పాల్గొన్నారు.
Advertisement