పదిలో వందశాతం ఉత్తీర్ణతకు కృషి
– జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాథరెడ్డి
నంద్యాలరూరల్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాథరెడ్డి తెలిపారు. శుక్రవారం కానాల మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని హైస్కూల్ కొట్టాల వద్ద ఉన్న శ్రీ పోశంపాపిరెడ్డి పూదోట సంస్కృతోన్నత పాఠశాలను డీఈఓ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక విద్యా విధానానికి అనుగుణంగా విదా్యర్థులకు బోధన చేస్తున్న పాఠశాల అధ్యక్షుడు జగదీశ్వరరెడ్డి, కరస్పాండెంట్ విజయశేఖర్‌రెడ్డిలను అభినందించారు. వరుసగా ఐదో సంవత్సరం కూడా పదవ తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు డీఈఓను సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ఏఓ రమణారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.