గోడకూలి వృద్ధురాలి మృతి
మోత్కూరు
భారీ వర్షాలకు ఓ వృద్ధురాలు బలైంది. ఈ ఘటన మోత్కూరు మండలం బొడ్డుగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సప్పిడి మణెమ్మ(85)కు కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. మణెమ్మ మాత్రం గ్రామంలోనే శిథిలావస్థకు చేరిన ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. నాలుగురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇంటిగోడలు నాని శుక్రవారం కూలిపోయాయి. దీంతో ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న మణెమ్మ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికులు గుర్తించి మృతదేహాన్ని వెలికితీశారు. ఇరుగుపొరుగు వారు గమనించి కుమారుడికి, అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్ జి.దశరథ, డిప్యూటీ తహసీల్దార్ ఎం.కృష్ణ సందర్శించి పరిశీలించారు. ఆమె మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తంచేశారు.