స్వలాభాపేక్షే | election promices not done to prakasam district | Sakshi
Sakshi News home page

స్వలాభాపేక్షే

Published Wed, Mar 22 2017 3:25 PM | Last Updated on Tue, Aug 14 2018 4:44 PM

స్వలాభాపేక్షే - Sakshi

స్వలాభాపేక్షే

► జిల్లా అభివృద్ధి గాలికి...
► జనం బాధలు పట్టించుకోని టీడీపీ నేతలు
► బాబు ఇచ్చిన హామీలకే బడ్జెట్‌లో నిధులు కరువు
► వెలిగొండకు మొక్కుబడి విదిలింపులు
► రామాయపట్నం పోర్టు,నిమ్జ్‌ ఊసే మరిచిన బాబు
► వందలాది హామీలు గాలికి..
► నోరు మెదపని జిల్లా నేతలు


జిల్లాకు ఇచ్చిన ఏ ఒక్క హామీకి తాజా బడ్జెట్‌లో చంద్రబాబు నిధులు కేటాయించకపోయినా జిల్లా అధికార పార్టీ నేతలు నోరు మెదపడం లేదు. వెలిగొండ పూర్తి చేసేది మేమే... అదిగో నిమ్జ్‌... ఇదిగో దొనకొండ... కనుచూపు మేరలో రామాయపట్నం పోర్టు, లక్షల కోట్ల పెట్టుబడులు,లక్షలాది మందికి ఉద్యోగాలు... అంటూ ఇన్నాళ్లు ఊదరగొట్టిన అధికార పార్టీ నేతలు ఇప్పుడు మౌనం దాల్చారు. జిల్లాకు సంబంధించిన ఏ ఒక్క అభివృద్ధి పనికి చంద్రబాబు నిధులు కేటాయించకపోయినా ఇక్కడి టీడీపీ నేతలు బాబును అడిగే పరిస్థితి లేదు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపుల్లేకపోవడంతో జిల్లా అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది. కనీసం వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి గుక్కెడు నీళ్లయినా ఇస్తారనుకుంటే ఆ ప్రాజెక్టుకు కూడా మెయింటెనెన్స్‌ ఖర్చులు తప్ప పనులు ముందుకు సాగేందుకు నిధులివ్వలేదు. అయినా అధికార పార్టీ నేతలు నోరు మెదపకపోవడంపై జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ క్షేత్రస్థాయి కేడర్‌ సైతం జిల్లా అధికార పార్టీ ప్రజాప్రతినిధుల తీరును తప్పుబడుతున్నారు. నేతలు స్వలాభాపేక్షతో సొంత పనుల కోసం పాకులాడటం తప్ప జిల్లా అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల నాటి నుంచి నేటి వరకు జిల్లాకు సంబంధించి చంద్రబాబు వందలాది హామీలిచ్చారు. ప్రధానంగా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానంటూ ప్రగల్భాలు పలికారు. మూడేళ్ల పాలన ముగుస్తున్నా... ప్రాజెక్టు పనులు ముందుకు సాగే పరిస్థితి లేదు. తాజా బడ్జెట్‌లో రూ.200 కోట్లు మాత్రమే కేటాయించటంలో ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి. ఈ ప్రాజెక్టు పైనే జిల్లా వాసులు ఆశలు పెట్టుకొని ఉన్నారు. తాగు, సాగునీరు అందించేందుకు ఏకైక మార్గం వెలిగొండ ప్రాజెక్టు. కానీ నిధుల్లేకపోవడంతో ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

ఇక జిల్లాను పారిశ్రామికంగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి పదే పదే చెబుతూ వస్తున్నారు. కనిగిరిలో దాదాపు లక్ష కోట్లతో నిమ్జ్‌ ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తామంటూ బాబు పలుమార్లు ప్రకటించారు. ఆయన మాటలు చూసి జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సైతం నిమ్‌్జను పూర్తి చేసినంతగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికీ భూసేకరణ కూడా పూర్తి కాలేదు. తాజా బడ్జెట్‌లో నిమ్స్‌ కు నిధుల కేటాయింపుల్లేవు. చంద్రబాబు దాని ఊసే మరిచారు. దొనకొండ పారిశ్రామికవాడదీ ఇదే పరిస్థితి. ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివస్తున్నాయని,  ఉద్యోగాలు లభిస్తున్నాయని ప్రభుత్వం ప్రచారం చేసింది. మూడేళ్ల పాలనలో దొనకొండకు ఏ ఒక్క పరిశ్రమ తరలిరాలేదు, వస్తుందన్న ఆశ కూడా లేదు.

రామాయపట్నం పోర్టు సంగతిని అధికార పార్టీ నేతలు దాదాపు పక్కనపెట్టారు. ఆది నుంచి జిల్లా అభివృద్ధి కోసం రామాయపట్నం పోర్టును నిర్మించాలన్న డిమాండ్‌ ఉంది. కానీ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆలోచనలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం నెల్లూరు జిల్లాలోని దుగరాజుపట్నం పోర్టుకే ప్రాధాన్యతనిచ్చారు. అయితే ఇటీవల దుగరాజుపట్నం పోర్టు నిర్మాణానికి ప్రతికూలతలు ఎదురయ్యాయి. అక్కడ పోర్టు నిర్మాణం సరికాదంటూ కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. ఈ దశలో గట్టిగా ప్రయత్నిస్తే రామాయపట్నం పోర్టు వచ్చే అవకాశం ఉంది. కానీ తాజా బడ్జెట్‌లో బాబు పోర్టు ఊసే ఎత్తలేదు. పోర్టు ఉంటేనే పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉంటుందని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం దాని సంగతి ఆటకెక్కించింది.

► జిల్లాలో తీరప్రాంతంతో పాటు కర్నూలు, కడపను కలిపే ప్రధాన రహదారులను రూ.50 వేల కోట్లతో నిర్మించనున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. అవి ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి.
► హైదరాబాద్‌ స్థాయిలో ఒంగోలులో శిల్పారామం అన్నారు. దాని ఊసే లేదు. వెటర్నరీ యూనివర్సిటీ, మైనింగ్‌ యూనివర్సిటీ  ఇస్తామని ఇచ్చిన హామీ ఇచ్చినా బడ్జెట్‌లో దాని ప్రస్తావన లేదు.
►తాళ్లూరు మండలంలో మొగలిగుండాల రిజర్వాయర్‌ పూర్తి చేసి తాళ్లూరు, మద్దిపాడు, అద్దంకి, చీమకుర్తిలకు దీని ద్వారా తాగు, సాగు నీరు ఇచ్చే ప్రతిపాదనను సర్కారు పట్టించుకోలేదు.
► బల్లికురవలోని భవనాశి రిజర్వాయర్, యర్రం చినపోలిరెడ్డి రిజర్వాయర్‌ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా నిధుల కేటాయింపుల్లేవు.
► గిద్దలూరు పట్టణానికి దూపాడు ప్రాజెక్టు నుంచి రూ.350 కోట్లతో పనులు పూర్తి చేసి నీళ్లిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.  నల్లమల అడవుల్లోని బైరేనిగుండాలు ద్వారా గిద్దలూరు పరిధిలోని 14 గ్రామాలకు నీళ్లిస్తామన్నారు. దాని సంగతీ పట్టించుకోలేదు.
► సోమశిల ఉత్తర కాలువ రాళ్లపాడు ప్రాజెక్టు వరకు తవ్వాల్సి ఉంది. తద్వారా ప్రాజెక్టు రాళ్లపాడుకు నీళ్లిస్తామన్నారు. రామాయపట్నం పోర్టు, రాళ్లపాడు ఎడమ కాలువ పొడిగింపు పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా నిధులివ్వలేదు.

కొండపిలోని సంగమేశ్వరం ప్రాజెక్టును రూ.50.50 కోట్లతో పూర్తి చేసి తద్వారా 9,500 ఎకరాలకు సాగు నీరు, 4 మండలాల పరిధిలో తాగునీరు అందిస్తామన్నారు. కానీ నిధుల కేటాయింపుల్లేవు. ఇవి కాకుండా జిల్లావ్యాప్తంగా రోడ్లు, తాగునీటి పథకాలు, చిన్న పరిశ్రమలు అంటూ అటు ప్రభుత్వం, జిల్లా అధికార పార్టీ నేతలు వందలాది హామీలు గుప్పించారు. కానీ ఏ ఒక్కదానికీ బడ్జెట్‌లో సర్కారు పైసా నిధులు కేటాయించలేదు. అయినా జిల్లా నేతలు ఏ మాత్రం స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా వ్యక్తిగత స్వార్థాన్ని పక్కనపెట్టి టీడీపీ నేతలు జిల్లా అభివృద్ధికి నిధుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement