తయారీదారులకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ పిలుపు
ఏలూరు అర్బన్: ‘సారా కేసుల్లో నేరస్తులుగా శిక్షణ అనుభవించి గౌరవం పోగొట్టుకున్నారు. మీ బిడ్డలకైనా సమాజంలో తలెత్తుకు తిరిగే అవకాశం ఇవ్వండి’ అని ఏలూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఈఎస్) వై.శ్రీనివాసచౌదరి హితవు పలి కారు. జంగారెడ్డిగూడెం, సిరివారిగూడెం, అంకంపాలెం, కామయ్యపాలెం, బొత్తప్పగూడెం, తాటాకులపాలెం, జీలుగుమిల్లి గ్రామాల్లో సారాబట్టీలపై శుక్రవారం ఆయన సిబ్బందితో దాడులు చేశారు. సారా తయారీ, రవాణా, అమ్మకందారుల కుటుంబ సభ్యుల తో సమావేశమయ్యారు.
దాడుల సమయంలో సారా తయారీ దారుల కుటుంబాల్లో చాలా మంది ఉన్నత చదువులు పూర్తిచేసినట్టు గుర్తించామని, వారి తల్లిదండ్రులు జైలు పాలైతే బిడ్డల భవిష్యత్ అంధకారమవుతుందని హెచ్చరించారు. సారా తయారీని వదిలేస్తే తమ ఉపాధి కోల్పోతుందని కుటుంబాలను ఎలా పోషించుకోవాలని పలువురు ఆయన వద్ద వాపోయారు. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని ఏకరువు పెట్టారు.
ప్రత్యామ్నాయ ఉపాధిపై ఆలోచన
సారా తయారీ, విక్రయదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాల్సిన ఆవశ్యకతపై డెప్యూటీ కమిషనర్ వైబీ భాస్కరరావు ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదించారని శ్రీనివాస చౌదరి చెప్పారు. త్వరలోనే బాధిత కుటుంబాల వారికి వివిధ వృత్తుల్లో ఉచితంగా శిక్షణ, బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిం చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే తమ వంతుగా ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది విరాళంగా అందజేసిన సొమ్ముతో బాధిత కుటుంబాలకు వంట సామగ్రి, నిత్యావసర సరుకులు అందించామని చెప్పారు. ఇటీవల పాఠశాల విద్యార్థులకు 20 వేల నోటు పుస్తకాలు, 7 వేల పలకలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఈఎస్, ఆర్.నాగేంద్రరావు ఏలూరు ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్, కేవీఎస్, కల్యాణ చక్రవర్తి, సిబ్బంది పాల్గొన్నారు.
సారా మానండి.. సహకరిస్తాం
Published Sat, Jul 16 2016 8:09 PM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM
Advertisement
Advertisement