excise superintendent
-
అవినీతిలో 'సూపర్'టెండెంట్
సాక్షి, హైదరాబాద్/నిజామాబాద్: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతికిరణ్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్ నేతృత్వంలోని అధికారుల బృందం నిజామాబాద్ సుభాష్‌నగర్‌లోని ఇంట్లో సోదాలు నిర్వహించిన అనంతరం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో జ్యోతికిరణ్‌ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా పనిచేసిన జ్యోతికిరణ్ రెండు నెలల క్రితమే నిజామాబాద్ జిల్లాకు బదిలీపై వచ్చారు. హైదరాబాద్‌లో పనిచేస్తుండగా పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందడటంతో ఏసీబీ అధికారులు ఆయనపై ఆదాయానికి మించి ఆస్తుల కేసును నమోదు చేశారు. ఈ మేరకు న్యాయస్థానం నుంచి సెర్చ్ వారెంట్ తీసుకున్న ఏసీబీ అధికారులు నిజామాబాద్‌తో పాటు, హైదరాబాద్ బాగ్ అంబర్‌పేటలో ఆయన నివాసాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. అలాగే ఆయన సన్నిహితులైన ముగ్గురు వ్యక్తుల ఇళ్లల్లోనూ, నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలోనూ సోదాలు కొనసాగాయి. మార్కెట్ విలువ రూ.4 కోట్లకుపైనే.. జ్యోతికిరణ్ నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో దాడులు చేసి ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, నగదు, నగలు, ఇతరత్రా వాటిని స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ డీజీ పూర్ణచందర్రావు తెలిపారు. ఈ మొత్తం ఆస్తుల విలువ రూ.1.30 కోట్లు కాగా, మార్కెట్ విలువ ప్రకారం రూ.4 కోట్లకుపైగా ఉంటుందని ఏసీబీ డీజీ తెలిపారు. దాడుల తర్వాత జ్యోతికిరణ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. ఏసీబీ గుర్తించిన ఆస్తులివీ.. ► జహీరాబాద్‌లోని న్యాకల్ మండలంలో రూ.18.7 లక్షల విలువైన 30 ఎకరాల వ్యవసాయ భూమి. ∙హైదరాబాద్ బాగ్ అంబర్‌పేట్‌లో రూ.30.60 లక్షల విలువైన ఇళ్లు. ∙నల్లకుంటలోని సింగ్మేకర్ అపార్ట్మెంట్ రూ.14 లక్షల విలువైన ఫ్లాట్ ► ఘట్కేసర్లో రూ.2.14 లక్షల విలువైన రెండు ప్లాట్లు ∙హయత్‌నగర్ తుర్కయాంజల్‌లో రూ.1.60 లక్షల విలువైన ఒక ప్లాట్. ∙బీబీనగర్, పోచంపల్లి దేశ్‌ముఖ్‌లో రూ.13.30 లక్షల విలువైన 11 ఓపెన్ ప్లాట్లు. ► భూదాన్ పోచంపల్లిలోని దుర్గా ఎస్టేట్‌లో రూ.1.20 లక్షల విలువైన రెండు ప్లాట్లు ∙రూ.13.91 లక్షల విలువ గల బంగారు అభరణాలు.. ► బ్యాంక్ ఖాతాలో రూ.10.13 లక్షల నగదు ► రూ.9.65 లక్షల విలువైన ఇన్సూరెన్స్ పాలసీలు ► రూ.8.41 లక్షల విలువ గల మారుతీ స్విఫ్ట్ డిజైర్ కారు. ► రూ.1.20 లక్షల విలువైన రెండు ద్విచక్ర వాహనాలు ► రూ.5 లక్షల విలువున్న పురాతనమైన అలంకార వస్తువులు -
ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్ జ్యోతికిరణ్ ఇళ్లపై అవినీతి నిరోధకశాఖ అధికారులు దాడి చేశారు. జ్యోతి కిరణ్‌పై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం నిజామాబాద్, హైదరాబాద్ బాగ్ అంబర్‌పేట డీడీ కాలనీలోని నివాసంతో పాటు మరో నాలుగు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఇప్పటివరకు జహీరాబాద్‌లో 30 ఎకరాల వ్యవసాయ భూమి, రంగారెడ్డి జిల్లాలో 14 ప్లాట్స్, హైదరాబాద్‌లో రెండు ఫ్లాట్లు, 75 తులాల బంగారం, అరకిలో వెండి స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. రూ. 2 కోట్ల వరకు అక్రమ ఆస్తులు గుర్తించామన్నారు. సోదాలు కొనసాగుతున్నాయి -
ఎక్సైజ్ సూపరింటెండ్‌పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు
హైదరాబాద్: వనపర్తి జిల్లా ఎక్సైస్ సూపరింటెండెంట్ నవీన్ నాయక్ పై హెచ్చార్సీ లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. తనపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డ నవీన్ నాయక్ పై చర్యలు తీసుకోవాలంటూ పెద్దగూడెం తండాకు చెందిన వెంకటమ్మ హెచ్చార్సీని ఆశ్రయించింది. సారాయి తయారు చేస్తున్నావంటూ తనని వేధింపులకి గురిచేస్తున్నాడంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. -
సారా మానండి.. సహకరిస్తాం
తయారీదారులకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ పిలుపు ఏలూరు అర్బన్: ‘సారా కేసుల్లో నేరస్తులుగా శిక్షణ అనుభవించి గౌరవం పోగొట్టుకున్నారు. మీ బిడ్డలకైనా సమాజంలో తలెత్తుకు తిరిగే అవకాశం ఇవ్వండి’ అని ఏలూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఈఎస్) వై.శ్రీనివాసచౌదరి హితవు పలి కారు. జంగారెడ్డిగూడెం, సిరివారిగూడెం, అంకంపాలెం, కామయ్యపాలెం, బొత్తప్పగూడెం, తాటాకులపాలెం, జీలుగుమిల్లి గ్రామాల్లో సారాబట్టీలపై శుక్రవారం ఆయన సిబ్బందితో దాడులు చేశారు. సారా తయారీ, రవాణా, అమ్మకందారుల కుటుంబ సభ్యుల తో సమావేశమయ్యారు. దాడుల సమయంలో సారా తయారీ దారుల కుటుంబాల్లో చాలా మంది ఉన్నత చదువులు పూర్తిచేసినట్టు గుర్తించామని, వారి తల్లిదండ్రులు జైలు పాలైతే బిడ్డల భవిష్యత్ అంధకారమవుతుందని హెచ్చరించారు. సారా తయారీని వదిలేస్తే తమ ఉపాధి కోల్పోతుందని కుటుంబాలను ఎలా పోషించుకోవాలని పలువురు ఆయన వద్ద వాపోయారు. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని ఏకరువు పెట్టారు. ప్రత్యామ్నాయ ఉపాధిపై ఆలోచన సారా తయారీ, విక్రయదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాల్సిన ఆవశ్యకతపై డెప్యూటీ కమిషనర్ వైబీ భాస్కరరావు ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదించారని శ్రీనివాస చౌదరి చెప్పారు. త్వరలోనే బాధిత కుటుంబాల వారికి వివిధ వృత్తుల్లో ఉచితంగా శిక్షణ, బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిం చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే తమ వంతుగా ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది విరాళంగా అందజేసిన సొమ్ముతో బాధిత కుటుంబాలకు వంట సామగ్రి, నిత్యావసర సరుకులు అందించామని చెప్పారు. ఇటీవల పాఠశాల విద్యార్థులకు 20 వేల నోటు పుస్తకాలు, 7 వేల పలకలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్, ఆర్.నాగేంద్రరావు ఏలూరు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్, కేవీఎస్, కల్యాణ చక్రవర్తి, సిబ్బంది పాల్గొన్నారు. -
మద్యం షాపు నిర్మాణం అడ్డగింత
♦ నిన్ను ఎన్నుకున్నాం..న్యాయం చేయండి ♦ ఎమ్మెల్యే దామచర ్లకు మహిళల మొర ఒంగోలు క్రైం : ఒంగోలు నగరం ముంగమూరు రోడ్డులోని మర్రిచెట్టు సమీపంలో నిర్మాణంలో ఉన్న మద్యం షాపును స్థానిక మహిళలు శుక్రవారం అడ్డుకున్నారు. కొత్తగా ముంగమూరు రోడ్డులో ఓ మద్యం షాపును కేటాయించారు. దీంతో నూతనంగా షాపును దక్కించుకున్న మలినేని చెంచురామానాయుడు ఓ ఖాళీ స్థలాన్ని లీజుకు తీసుకొని షాపు కోసం నిర్మాణాన్ని చేపడుతున్నారు. అది గమనించిన సమీపంలోని అపార్టుమెంట్లలో నివాసం ఉంటున్న మహిళలు, పురుషులు మద్యం షాపు నిర్మాణాన్ని అడ్డుకున్నారు. కొంత సేపు షాపు యజమానికి, మహిళలకు వాగ్వాదం జరిగింది. అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం తెలుసుకున్న తాలూకా ఎస్సై యు.పాండురంగారావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఘర్షణను నిలువరించారు. మద్యం షాపు నిర్మాణం చేపట్టిన యజమాని చెంచురామానాయుడుకు కూడా నచ్చజెప్పి నిర్మాణ పనులను నిలుపుదల చేశారు. అక్కడ నుంచి మహిళలు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు ఫోన్ చేశారు. దీంతో ఆయన మధ్యాహ్నం సమయంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడున్న మహిళలతో మాట్లాడారు. మద్యం షాపు ఇక్కడ ఏర్పాటు చేయటం వల్ల కలిగే ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ లోగా ఓ మహిళ కలుగజేసుకొని ‘నిన్ను ఎంచుకున్నాం....ఇక్కడ మద్యం షాపు లేకుండా చేయాలి’ అని పదే పదే అనటంతో ఫోన్లో ఒంగోలు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం.భాస్కరరావుతో ఎమ్మెల్యే మాట్లాడారు. సమస్యను పరిష్కరించడంతో పాటు లెసైన్స్దారునికి కూడా న్యాయం చేస్తానని ఎస్ఈ భాస్కరరావు ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. అనంతరం మద్యం షాపు యజమానికి కూడా సమస్య పరిష్కారం అయ్యేంత వరకూ నిర్మాణం చేపట్టకూడదని హెచ్చరించారు. దీంతో మహిళలు శాంతించారు. -
తీస్తున్న కొద్దీ మద్యం
అలమండ(జామి), న్యూస్‌లైన్ : వెతుకుతున్నకొద్దీ మద్యం బాటిళ్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. మండలంలోని అలమండ విజయసీతారామరాజు చెరువు గర్భంలో సుమారు 1500గోవా మద్యం బాటిళ్లను గజ ఈతగాళ్లు, ఎక్సైజ్ సిబ్బంది గురువారం వెలికి తీసిన విషయం విదితమే. శుక్రవారం కూడా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీధర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లు చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం మరో 150 మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. మొత్తం 1,650 బాటిళ్లు బయటపడినట్లు అసిస్టెంట్ సూపరింటెండెంట్ కె.వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. చేపల పెంపకం కోసం చెరువును లీజుకు తీసుకున్న వ్యక్తిపైన, మరికొంతమందిపైన కేసులు నమోదు చేస్తున్నట్లు వివరించారు. గతంలో ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురు వ్యక్తులను కూడా విచారణ జరుపుతున్నామని తెలిపారు. రాజానవానిపాలెంలో.. వ్యవసాయ బావిలో... కొత్తవలస : మండలంలోని కొత్తవలస మేజర్ పంచాయతీ శివారు రాజానవానిపాలెంలో ఎం.అప్పలనాయుడుకు చెందిన మామిడితోటలో గోవా మద్యం ఉన్నట్లు స్థానిక ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం గుర్తించారు. ఈ ప్రాంతంలోని వ్యవసాయ బావిలో మద్యం సీసాలు ఉన్నాయని, కొంతమంది అప్పుడప్పుడు వీటిని తీసుకుని తాగుతున్నారని ఆ నోటా ఈ నోటా వినిపించడంతో ఎక్సైజ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ బావిలో సుమారు పది అడుగుల లోతు మేరకు నీరు ఉంది. ముందుగా ఎస్.కోట ఎక్సైజ్ కానిస్టేబుల్ జైరామ్‌నాయుడు బావిలో దిగి మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. తొలుత ఆయన ఆరు మద్యం సీసాలను బయటకు తీశారు. దీంతో రెండు కిరోసిన్ ఇంజిన్లు రప్పించి నీరు పైకి తోడించారు. బాటిళ్లకు ఉన్న పై కప్పు రంగును బట్టి, అలమండ చెరువులో దొరికిన మద్యం.. ఈ మద్యం ఒక్కటేనని ఎక్సైజ్ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. శుక్రవారం రాత్రి 8 గంటల వరకూ బావిలోఉన్న నీటిని తోడారు. ఇంకా నీరు ఉండడంతో అప్పటికి విరమించుకున్నారు. శనివారం ఉదయం మళ్లీ ప్రారంభించనున్నారు. అలాగే మండలంలోని చినమన్నిపాలెం సమీపంలో ఉన్న చెరువులో కూడా ఇటువంటి మద్యం బాటిళ్లు ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. సమీపంలో ఉన్న చెరువుల గట్టు వద్ద ఖాళీ మద్యం బాటిళ్లు గుట్టలుగుట్టలుగా పడి ఉండడం ఈ అనుమానాలకు మరింత ఊతమిస్తోంది. విజయనగరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పి.శ్రీధర్, ఏఈఎస్ కె.వెంకటరామిరెడ్డి, కొత్తవలస ఎక్సైజ్ సీఐ రాఘవయ్య, టాస్కుఫోర్స్ సూపరింటెండెంట్ ఆచారి, ఎన్ఫోర్స్మెంట్ సీఐ శ్రీధర్, ఫ్లయింగ్ స్క్వాడ్ ఏఎస్సై సయ్యద్ జియాఉద్దీన్, వీఆర్వో రాధాకృష్ణ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు.