మద్యం షాపు నిర్మాణం అడ్డగింత
♦ నిన్ను ఎన్నుకున్నాం..న్యాయం చేయండి
♦ ఎమ్మెల్యే దామచర ్లకు మహిళల మొర
ఒంగోలు క్రైం : ఒంగోలు నగరం ముంగమూరు రోడ్డులోని మర్రిచెట్టు సమీపంలో నిర్మాణంలో ఉన్న మద్యం షాపును స్థానిక మహిళలు శుక్రవారం అడ్డుకున్నారు. కొత్తగా ముంగమూరు రోడ్డులో ఓ మద్యం షాపును కేటాయించారు. దీంతో నూతనంగా షాపును దక్కించుకున్న మలినేని చెంచురామానాయుడు ఓ ఖాళీ స్థలాన్ని లీజుకు తీసుకొని షాపు కోసం నిర్మాణాన్ని చేపడుతున్నారు. అది గమనించిన సమీపంలోని అపార్టుమెంట్లలో నివాసం ఉంటున్న మహిళలు, పురుషులు మద్యం షాపు నిర్మాణాన్ని అడ్డుకున్నారు. కొంత సేపు షాపు యజమానికి, మహిళలకు వాగ్వాదం జరిగింది. అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం తెలుసుకున్న తాలూకా ఎస్సై యు.పాండురంగారావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఘర్షణను నిలువరించారు.
మద్యం షాపు నిర్మాణం చేపట్టిన యజమాని చెంచురామానాయుడుకు కూడా నచ్చజెప్పి నిర్మాణ పనులను నిలుపుదల చేశారు. అక్కడ నుంచి మహిళలు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు ఫోన్ చేశారు. దీంతో ఆయన మధ్యాహ్నం సమయంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడున్న మహిళలతో మాట్లాడారు.
మద్యం షాపు ఇక్కడ ఏర్పాటు చేయటం వల్ల కలిగే ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ లోగా ఓ మహిళ కలుగజేసుకొని ‘నిన్ను ఎంచుకున్నాం....ఇక్కడ మద్యం షాపు లేకుండా చేయాలి’ అని పదే పదే అనటంతో ఫోన్‌లో ఒంగోలు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం.భాస్కరరావుతో ఎమ్మెల్యే మాట్లాడారు. సమస్యను పరిష్కరించడంతో పాటు లెసైన్స్‌దారునికి కూడా న్యాయం చేస్తానని ఎస్‌ఈ భాస్కరరావు ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. అనంతరం మద్యం షాపు యజమానికి కూడా సమస్య పరిష్కారం అయ్యేంత వరకూ నిర్మాణం చేపట్టకూడదని హెచ్చరించారు. దీంతో మహిళలు శాంతించారు.