సీఎస్‌పురం మండలం డీజీపేట చెరువుకట్ట అభివృద్ధి చేశామంటూ గురువారం ఎమ్మెల్యే బాబూరావు ఆవిష్కరించిన శిలాఫలకం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఎన్నికల నొటిఫికేషన్‌కు సమయం ఆసన్నం కావడంతో అధికార పార్టీ నేతలు ఓట్ల కోసం దిగజారుడు రాజకీయాలకు తెరలేపారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నా అభివృద్ధి పనుల జోలికి వెళ్లని చంద్రబాబు సర్కారు ఎన్నికల వేళ వేల కోట్ల రూపాయల పనులకు హడావుడిగా శంకుస్థాపనలు చేస్తోంది. గతంలో శంకుస్థాపనలు చేసిన పనులను పట్టించుకోని ప్రభుత్వం నేడో రేపో ఎన్నికలనగా అన్ని చేసేస్తామంటూ జనాన్ని మభ్యపెట్టే యత్నానికి దిగారు. మార్చి నెల మొదటి వారంలోనే జిల్లా వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల పనులకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు శంకుస్థాపనలు చేశారు. ఇది చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకునేందుకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లా కేంద్రంలో ఫలకాల జోరు..
ఒంగోలు నగర పరిధిలో రెండో డివిజన్ కేశవరాజుగుంటలో పోతురాజు కాలువ నుంచి న్యూ హైవే వరకు రూ.2.58 కోట్లతో రోడ్డు విస్తరణ పనులంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు రెండు రోజుల క్రితం శంకుస్థాపన చేశారు. ఐదేళ్లపాటు అధికార పార్టీ ఎమ్మెల్యేగా రోడ్డు అభివృద్ధి పనులు ఎందుకు గుర్తుకు రాలేదో ఆయనకే తెలియాలి. రెండో డివిజన్ పరిధిలోని ముక్తినూతలపాడు న్యూహైవే నుంచి ముదిగొండవాగు వరకు మరో రూ.1.07 కోట్లతో రోడ్డు పనులకు సైతం శంకుస్థాపనలు చేశారు. భాగ్యనగర్ 4వ లైను పదో అడ్డరోడ్డులో రూ.2 కోట్లతో కాపు సంక్షేమ భవన్‌కు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రూ.22.40 కోట్లతో కరువది నుంచి గుండాయపాలెం, కరవది నుంచి కొప్పోలు రోడ్డు విస్తరణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు.
24వ డివిజన్ సమైఖ్య నగర్‌లో రూ.30 లక్షలతో సామాజిక భవనానికి శంకుస్థాపన చేశారు. వెంగముక్కల పాలెంలో రూ.10 లక్షలతో కమ్యూనిటీ హాలుకు శంకుస్థాపన చేయగా వెంగముక్కలపాలెం జంక్షన్ నుంచి భగీరధ కెమికల్ ఫ్యాక్టరీ వరకు రూ.3 కోట్లతో నాలుగులైన్ల రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. మొత్తం పనులకు మార్చి 5, 6, 7 తేదీల్లో శంకుస్థాపనలు చేయడం గమనార్హం. ఐదేళ్లపాటు వీటి జోలికి వెళ్లని అధికార పార్టీ ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు పొందేందుకే అభివృద్ధి పనుల పేరుతో శంకుస్థాపనల తంతు చేపట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కనిగిరిలోనూ ఇదే తీరు..
కనిగిరిలోనూ అధికార పార్టీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు ఎన్నికల శంకుస్థాపనల జోరు సాగిస్తున్నారు. కనిగిరిలో రూ.189 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కనిగిరి తాగునీటి సమస్య ఎమ్మెల్యేకు ఐదేళ్ల పాలనా కాలం చివరిలో గుర్తుకు రావడం గమనార్హం. సీఎస్‌పురం మండలంలో ఆర్‌అండ్‌బీ నుంచి బోడావులదిన్నె వరకు రూ.43.93 లక్షలతో తారు రోడ్డు పనికి గురువారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఇదే మండలంలోనూ పెదరాజుపాలెం నుంచి ఎగువపల్లివరకు రూ.1.35 కోట్లతో తారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయగా కోనపల్లి నుంచి బోయమడుగులకు రూ.63 లక్షలతో రోడ్డు పనులకు ఎమ్మెల్యే గురువారం శంకుస్థాపన చేశారు.
డీజీ పేట నుంచి బొంతువారిపల్లి వరకు రూ.3.60 కోట్లతో తారు రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఇదే మండలంలో పలు సీసీ రోడ్లు నిర్మాణాలకు సైతం గత రెండు మూడు రోజుల క్రితం శంకుస్థాపనలు చేశారు. ఇదే మండలంలో బీసీ వసతి గృహ భవన నిర్మాణానికి నాలుగు సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే శంకుస్థాపన చేయగా ఈ కార్యక్రమానికి అప్పటి కేంద్ర మంత్రి సుజనా చౌదరి సైతం హాజరయ్యారు. కానీ ఇప్పటికీ ఆ భవనం నిర్మాణానికి నోచుకోక పోవడం గమనార్హం. పామూరు మండలంలో కంభాలదిన్నె నుంచి రేణుమడుగు వరకు రూ.4.29 కోట్లతో తారు రోడ్డు పనికి ఇటీవలే శంఖుస్థాపన చేయగా రూ.2.72 కోట్లుతో రజాసాహెబ్‌పేట తారు రోడ్డు పనికి, బోడవాడ నుండి అక్కంపేట వరకు రూ.3.05 కోట్లతో తారు రోడ్డు పనికి రూ.1.74 కోట్లతో రేగుచెట్లపల్లి తారు రోడ్డుకు ఎమ్మెల్యే ఇటీవలే శంకుస్థాపన చేశారు.
• అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ రూ.85 కోట్లతో గుండ్లకమ్మ నుంచి అద్దంకి పట్టణానికి నీరందించే పథకానికి ఇటీవలే శంకుస్థాపన చేశారు.
• దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలంలో మొగలిగుండాల రిజర్వాయర్‌కు మంత్రి శిద్దా రాఘవరావు ఇటీవలే శంకుస్థాపన చేశారు. దొనకొండ మండలంలోని వెంకటాపురంలో విద్యుత్ సబ్‌స్టేషన్‌కు, రాగమక్కపల్లిలో చిన్న తరహా పరిశ్రమలకు, దర్శిలో 1000 జీప్లస్2 గృహాలకు ఇటీవల మంత్రి శంఖుస్థాపనలు చేశారు. ఐదేళ్లపాటు వీటిని పట్టించుకోని అధికార పార్టీ ఎన్నికల సమయంలో శంకుస్థాపనలకు దిగడంపై విమర్శలు ఉన్నాయి.
• గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలం అనుమలపల్లిలో ఎమ్మెల్యే ముత్తముల అశోక్‌రెడ్డి 132/32 కేవి విద్యుత్ సబ్‌స్టేషన్‌కు గురువారం శంకుస్థాపన చేశారు. రెండు నెలలుగా ఈ విద్యుత్ సబ్ స్టేషన్ పనులు మొదలయ్యాయి. గురువారం ఎమ్మెల్యే శంఖుస్థాపన చేయడం గమనార్హం.
• పర్చూరు నియోజకవర్గంలో మార్చి 4న కారంచేడులో రూ.3.80 కోట్లతో మంచినీటి పథకానికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శంఖుస్థాపన చేశారు. ఫిబ్రవరి 25న రూ.11.45 కోట్లతో యద్దనపూడి మండలంలోని సూరవరపుపల్లి, అనంతవరం, వింజనం పాడు, చిలుకూరివారిపాలెం, యద్దనపూడి, వెన్నవరం గ్రామాల్లో కమ్యూనిటీహాళ్లు, పంచాయతీ భవనాలకు, సీసీ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. తొండివాగుపై బ్రిడ్జిలకు శంకుస్థాపనలు చేశారు. ఇంకొల్లులో రూ.40 లక్షలతో అన్నా క్యాంటీన్ కోసం ఇటీవలే శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఇంకొల్లు చెరువు వద్ద వాకింగ్ ట్రాక్ కోసం రూ.50 లక్షల పనికి శంకుస్థాపన చేశారు.
• కందుకూరు నియోజకవర్గంలో కందుకూరు పట్టణంలో రూ.2 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ వద్ద రూరల్ మండలంలో తాగునీటి సరఫరా కోసం నీటి పథకానికి ఎమ్మెల్యే పోతుల రామారావు శంఖుస్థాపన చేశారు. అలాగే రూ.37 లక్షలతో కందుకూరు పట్టణంలో డ్రైన్‌కు శంకుస్థాపన చేశారు. దీంతో పాటు పట్టణంలో షాదీఖాన కోసం శంకుస్థాపనలు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు.
అధికార పార్టీ హడావుడిపై విమర్శలు..
వాస్తవానికి గత ఐదేళ్లుగా చంద్రబాబు సర్కారు జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి పనులను గాలికి వదిలేసింది. కనిగిరి నిమ్జ్. దొనకొండ పారిశ్రామికవాడలకు ఎప్పుడో శంకుస్థాపనల శిలాఫలకాలు వేశారు. ఇప్పటికి వాటి ఊసులేదు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీరిస్తామన్నారు. ఐదేళ్లుగా ఈ హామీ నెరవేరలేదు. గుండ్లకమ్మ ప్రాజెక్టును దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పూర్తి చేయగా మిగిలి ఉన్న 5శాతం పనులను కూడా చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. మూడేళ్ల క్రితం జిల్లాకు ట్రిపుల్ ఐటీ మంజూరైనా ఇప్పటికి కనీసం భవనాలు ఏర్పాటు చేసి జిల్లాలో ట్రిపుల్ ఐటీని నడపలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో బాబు సర్కారు ఉండి పోయింది.
పాత హామీలను పక్కన పెడితే ఎన్నికల ఏడాదిని దృష్టిలో పెట్టుకుని రామాయపట్నం పోర్టు, ఏషియన్ పేపర్ పరిశ్రమలు నిర్మిస్తామంటూ ఇటీవలే ముఖ్యమంత్రి ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు. వాటి నిర్మాణం ఊసేలేదు. అవన్నీ పక్కనపెట్టి తీరా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న సమయంలో మరోమారు ప్రజలను మభ్యపెట్టేందుకు జిల్లాలో వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు హడావిడి చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment