mla damacharla janardan
-
అవినీతికి అభివృద్ధి ముసుగు
‘ఒంగోలు నగరాన్ని నేనే అభివృద్ధి చేశా...’ అంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తరచూ డబ్బాలు కొట్టుకుంటుంటారు. కానీ ఉన్న డివైడర్లను కాస్తంత పొడిగించి, పార్కులకు రంగులేసి..ఇదే అభివృద్ధి అంటూ అరచేతిలో వైకుంఠం చూపారు. పనిలోపని అభివృద్ధి పేరు చెప్పుకొని భారీగా అవినీతికి పాల్పడుతూ జేబులు నింపుకున్నారు. ఎమ్మెల్యే, ఆయన అనుయాయులు కోట్ల రూపాయలు దండుకుని నగర పాలక సంస్థ ఖజానాకు గండికొట్టారు. సాక్షి, ఒంగోలు అర్బన్: వందల కోట్లు కేటాయించి ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేశామని బాజాలు కొట్టుకుంటున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అభివృద్ధి మాటున కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలకు అండగా నాటి కమిషనర్, టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాల అధికారులు చేతులు కలపడంతో అవినీతికి అభివృద్ధి ముసుగు వేసి నగరపాలక ఖజానాకు చేరవలసిన సొమ్మును తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు పంచుకున్నారు. నగరంలో బ్యూటిఫికేషన్ పేరుతో ప్రధాన రహదారుల్లోని సెంటర్ డివైడర్లలో అడ్వర్టైజ్మెంట్ ప్రకటనలు వేసేందుకు స్థానిక ఎమ్మెల్యే సమీప బంధువుకు సంబంధించిన ప్రైవేటు ఏజెన్సీకి నిబంధనలకు విరుద్ధంగా సెంటర్ డివైడర్లను అప్పగించారు. బూట్ (బిల్ట్ ఆపరేటివ్ ట్రాన్స్ఫర్) పద్ధతిన అప్పగించి అక్రమాలకు తెరతీశారు. బూట్ పద్ధతి అంటే కాంట్రాక్టు తీసుకున్న ఏజెన్సీ నిర్మాణాలు చేసుకుని దానిని పరిరక్షిస్తూ పచ్చదనంతో పాటు పరిశుభ్రత పాటిస్తూ యాడ్స్‌ను వేసుకుని ఏజెన్సీ ఆదాయం పొందాలి. అదికూడా నిబంధనల ప్రకారం మొదట 3 సంవత్సరాలు మాత్రమే ఏజెన్సీకి ఇవ్వాలి. అనంతరం నగరపాలక టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులు ఏజెన్సీ డివైడర్ల మెయింటెన్స్ విషయంలో సంతృప్తి వెలిబుచ్చితే తిరిగి మరో 3 సంవత్సరాలు రెన్యువల్ చేయాలి. అయితే ఎమ్మెల్యే బంధువు కావడంతో నగరపాలక అధికారులు అత్యుత్సాహంతో ఏకంగా 9 సంవత్సరాలు లీజు కేటాయించి ప్రతి మూడు సంవత్సరాలకు రెన్యువల్ చేసేలా అనుమతులు ఇచ్చారు. ఆదాయం లేకపోగా ఖజానాకు గండి డివైడర్లకు సంబంధించి సదరు ఏజెన్సీకి 2014లో లీజుకు ఇస్తే ఇంత వరకు ఒక్క రూపాయి కూడా నగరపాలక సంస్థకు దక్కకపోగా నగరపాలక నిధుల నుంచి డివైడర్లలో మొక్కలకు సుమారు రూ.20 లక్షలు, డివైడర్లకు రంగులు వేసేందుకు మరో రూ.50 లక్షలు కేటాయించి పనులు చేశారు. సదరు ఏజెన్సీ మాత్రం లాలీపాప్‌లో యాడ్ ప్రకటన ఇస్తే వేలల్లో వసూలు చేసుకుంటూ కోట్లు దండుకుంటున్నారు. ఏజెన్సీకి లీజుకు ఇచ్చి ఇప్పటికి మూడేళ్లు దాటినా ఇంత వరకు రెన్యువల్ చేయకుండా ఖజానాకు గండి కొడుతున్నారు. ఎక్కడైనా డివైడర్లు పగిలిపోయినా ఏజెన్సీ పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒంగోలు పర్యటన ఉన్నప్పుడు ప్రతిసారి డివైడర్లకు రంగులు వేస్తూ ఓఎంసీ అధికారులు లక్షల్లో బిల్లులు చేసుకున్నారు. డివైడర్లలో లాలీపాప్‌లు మాత్రమే ఏర్పాటు చేసి యాడ్స్ ప్రచురించాల్సిన ఏజెన్సీ డివైడర్లలోని విద్యుత్ స్తంభాలకు సైతం బోర్డులు ఏర్పాటు చేసి వ్యాపారం కొనసాగిస్తున్నారు. అటు స్థానిక ఎమ్మెల్యే ఇటు నగరపాలక అధికారులు కుమ్మక్కై వాటాలు పంచుకుని నగరపాలక ఖజానాకు రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి గండికొట్టారు. అక్రమ సంపాదనే ధ్యేయంగా నగరాభివృద్ధికి చెందాల్సిన ఆదాయాన్ని జేబుల్లో వేసుకున్నారు. గతంలో వైఎస్సార్ సీపీ అధినేత ఒంగోలు పర్యటన సందర్భంగా లాలీపాప్ల్లో యాడ్స్ వస్తే ఎమ్మెల్యే దామచర్ల ఆదేశాలతో నగరపాలక అధికారులు వాటిని తొలగించి నానా బీభత్సం చేసిన విషయం తెలిసిందే. లాలీపాప్‌ల ఆక్రమణ.. పన్నుల వసూలు నిల్: టెండర్ ద్వారా లాలీపాప్‌లు ఏజెన్సీకి అప్పగించినా గజిట్ షరతులు ప్రకారం ఎంక్రోచ్మెంట్ టాక్స్ (ఆక్రమణ పన్ను) విధించి టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు వసూలు చేయాలి. అయితే డివైడర్లలోని లాలీపాప్ యాడ్స్‌కు సంబంధించి చదరపు మీటరుకు రూ.100 నుంచి రూ.200 వరకు వసూలు చేయాలి. అయితే గడిచిన నాలుగేళ్లలో ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు. ప్రకటనలు, ఆక్రమణ పన్నులు ఎమ్మెల్యే, ఓఎంసీ అధికారుల జేబుల్లోకే.. కార్పొరేషన్ చట్టం ప్రకారం నగరంలోని వ్యాపార కేంద్రాలు రోడ్డు ముఖంగా ఏర్పాటు చేసుకున్న ప్రకటనల బోర్డులకు సంబంధించి ప్రకటన పన్నులు టౌన్‌ప్లానింగ్ అధికారులు వసూలు చేయాలి. వాటికి కూడా చదరపు మీటర్ల లెక్కన పన్నులు విధించాల్సి ఉంటుంది. అయితే నగరంలో వేలాదిగా వ్యాపార కేంద్రాలు ఉంటే కేవలం వందల్లోనే ప్రకటన పన్నులు వసూలు చేస్తున్నారు. వ్యాపార కేంద్రాలతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుని ఎమ్మెల్యే అండదండలు ఉండటం, వాటాలు కేటాయిస్తూ నగరపాలక ఆదాయానికి గండి కొడుతున్నారు. నిజంగా ప్రకటన పన్నులను కచ్చితంగా అమలు చేస్తే ఏడాదికి కోట్లలో ఆదాయం వస్తుంది. నగరంలో ఆక్రమణ పన్నులకు సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయి. ఏ పన్ను విధించాలన్నా ఎమ్మెల్యే హుకుం జారీ చేయాలి. ఆయన అనుమతి లేకుండా నగరపాలక అధికారులు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి. వేలల్లో ఉన్న ఆక్రమణలకు సంబంధించిన పన్నులు వందల్లో వేస్తూ ఇష్టానుసారంగా కొలతలు చూపిస్తూ ఖజానాకు చిల్లు పెడుతూ జేబులు నింపుకుంటున్నారు. ఫిబ్రవరి, మార్చి నెలలు వస్తే టౌన్‌ప్లానింగ్ విభాగానికి కాసుల పంట కురుస్తోంది. వచ్చిన ఆదాయంలో ఎమ్మెల్యే వాటాను ఆయనకు పంపాల్సిందే. కొంచెం నిర్మించి ఎక్కువ ఆదాయం వైపుగా.. సెంటర్ డివైడర్లు నిర్మించుకుని లాలీపాప్‌లు ఏర్పాటు చేసుకునే ఏజెన్సీకి లడ్డూలాగా నగరంలోని డివైడర్లు దొరికాయి. దాదాపుగా గతంలోనే నిర్మించిన డివైడర్లను కొంత మేరకు పొడిగించడమే తప్ప మొత్తం డివైడర్లు నిర్మించే అవసరం లేకుండా పోయింది. చర్చి సెంటర్ నుంచి నెల్లూరు బస్టాండ్ వరకు బాలినేని హయాంలోనే డివైడర్ నిర్మించారు. అక్కడి నుంచి బైపాస్ రోడ్డు వరకు మాత్రమే నిర్మించారు. చర్చి సెంటర్ నుంచి ఎస్బీఐ కూడలి వరకు పాత డివైడర్లు ఉన్నాయి. అక్కడి నుంచి రైల్వే స్టేషన్ వరకు మాత్రమే కొత్తగా నిర్మించారు. అద్దంకి బస్టాండ్ నుంచి కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ వరకు గతంలోనే డివైడర్లు ఉన్నాయి. అద్దంకి బస్టాండ్ నుంచి గుంటూరు రోడ్డులో పోతురాజు కాలువ వరకు పాత డివైడర్లే. అక్కడి నుంచి బైపాస్ వరకు మాత్రమే కొత్తగా నిర్మించారు. పాత డివైడర్లు కొంత మేరకు మరమ్మతులు చేశారు. నగరంలోని డివైడర్లలో సుమారు 400 నుంచి 500 లాలీపాప్‌లు ఏర్పాటు చేసి యథేచ్ఛగా ప్రకటనలు వేస్తూ సదరు ఎమ్మెల్యే బంధువుకు చెందిన ఏజెన్సీ కోట్లాది రూపాయలు దండుకుంటోంది. మామూళ్ల మత్తులో ఉన్న నగరపాలక అధికారులు ఎమ్మెల్యే బంధువు కావడంతో ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. అయితే నగరవాసులు మాత్రం ఎమ్మెల్యే బినామీ వ్యాపారం అని అనడం గమనార్హం. కమిషనర్ చెప్పమంటే చెప్తా.. టౌన్‌ప్లానింగ్ ఏసీపీ కేవీ ప్రకటనల పన్నులు, ఆక్రమణ పన్నులకు సంబంధించి వివరణ అడిగేందుకు వెళ్లగానే టౌన్‌ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ) కనీసం విషయం కూడా తెలుసుకోకుండా ఏ వివరణ అయినా కమిషనర్ చెప్పమంటే చెప్తా లేకుంటే లేదంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. టౌన్‌ప్లానింగ్ విభాగానికి సంబంధించిన అంశం అని చెప్పినా ఏ అంశం అయినా కమిషనర్ మాత్రమే చెప్తారు అని వివరణ ఇవ్వడం గమనార్హం. -
ఎన్నికలొస్తున్నాయ్.. త్వరగా పని కానిచ్చేయండి!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఎన్నికల నొటిఫికేషన్‌కు సమయం ఆసన్నం కావడంతో అధికార పార్టీ నేతలు ఓట్ల కోసం దిగజారుడు రాజకీయాలకు తెరలేపారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నా అభివృద్ధి పనుల జోలికి వెళ్లని చంద్రబాబు సర్కారు ఎన్నికల వేళ వేల కోట్ల రూపాయల పనులకు హడావుడిగా శంకుస్థాపనలు చేస్తోంది. గతంలో శంకుస్థాపనలు చేసిన పనులను పట్టించుకోని ప్రభుత్వం నేడో రేపో ఎన్నికలనగా అన్ని చేసేస్తామంటూ జనాన్ని మభ్యపెట్టే యత్నానికి దిగారు. మార్చి నెల మొదటి వారంలోనే జిల్లా వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల పనులకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు శంకుస్థాపనలు చేశారు. ఇది చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకునేందుకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఫలకాల జోరు.. ఒంగోలు నగర పరిధిలో రెండో డివిజన్ కేశవరాజుగుంటలో పోతురాజు కాలువ నుంచి న్యూ హైవే వరకు రూ.2.58 కోట్లతో రోడ్డు విస్తరణ పనులంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు రెండు రోజుల క్రితం శంకుస్థాపన చేశారు. ఐదేళ్లపాటు అధికార పార్టీ ఎమ్మెల్యేగా రోడ్డు అభివృద్ధి పనులు ఎందుకు గుర్తుకు రాలేదో ఆయనకే తెలియాలి. రెండో డివిజన్ పరిధిలోని ముక్తినూతలపాడు న్యూహైవే నుంచి ముదిగొండవాగు వరకు మరో రూ.1.07 కోట్లతో రోడ్డు పనులకు సైతం శంకుస్థాపనలు చేశారు. భాగ్యనగర్ 4వ లైను పదో అడ్డరోడ్డులో రూ.2 కోట్లతో కాపు సంక్షేమ భవన్‌కు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రూ.22.40 కోట్లతో కరువది నుంచి గుండాయపాలెం, కరవది నుంచి కొప్పోలు రోడ్డు విస్తరణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. 24వ డివిజన్ సమైఖ్య నగర్లో రూ.30 లక్షలతో సామాజిక భవనానికి శంకుస్థాపన చేశారు. వెంగముక్కల పాలెంలో రూ.10 లక్షలతో కమ్యూనిటీ హాలుకు శంకుస్థాపన చేయగా వెంగముక్కలపాలెం జంక్షన్ నుంచి భగీరధ కెమికల్ ఫ్యాక్టరీ వరకు రూ.3 కోట్లతో నాలుగులైన్ల రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. మొత్తం పనులకు మార్చి 5, 6, 7 తేదీల్లో శంకుస్థాపనలు చేయడం గమనార్హం. ఐదేళ్లపాటు వీటి జోలికి వెళ్లని అధికార పార్టీ ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు పొందేందుకే అభివృద్ధి పనుల పేరుతో శంకుస్థాపనల తంతు చేపట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనిగిరిలోనూ ఇదే తీరు.. కనిగిరిలోనూ అధికార పార్టీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు ఎన్నికల శంకుస్థాపనల జోరు సాగిస్తున్నారు. కనిగిరిలో రూ.189 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కనిగిరి తాగునీటి సమస్య ఎమ్మెల్యేకు ఐదేళ్ల పాలనా కాలం చివరిలో గుర్తుకు రావడం గమనార్హం. సీఎస్‌పురం మండలంలో ఆర్అండ్బీ నుంచి బోడావులదిన్నె వరకు రూ.43.93 లక్షలతో తారు రోడ్డు పనికి గురువారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఇదే మండలంలోనూ పెదరాజుపాలెం నుంచి ఎగువపల్లివరకు రూ.1.35 కోట్లతో తారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయగా కోనపల్లి నుంచి బోయమడుగులకు రూ.63 లక్షలతో రోడ్డు పనులకు ఎమ్మెల్యే గురువారం శంకుస్థాపన చేశారు. డీజీ పేట నుంచి బొంతువారిపల్లి వరకు రూ.3.60 కోట్లతో తారు రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఇదే మండలంలో పలు సీసీ రోడ్లు నిర్మాణాలకు సైతం గత రెండు మూడు రోజుల క్రితం శంకుస్థాపనలు చేశారు. ఇదే మండలంలో బీసీ వసతి గృహ భవన నిర్మాణానికి నాలుగు సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే శంకుస్థాపన చేయగా ఈ కార్యక్రమానికి అప్పటి కేంద్ర మంత్రి సుజనా చౌదరి సైతం హాజరయ్యారు. కానీ ఇప్పటికీ ఆ భవనం నిర్మాణానికి నోచుకోక పోవడం గమనార్హం. పామూరు మండలంలో కంభాలదిన్నె నుంచి రేణుమడుగు వరకు రూ.4.29 కోట్లతో తారు రోడ్డు పనికి ఇటీవలే శంఖుస్థాపన చేయగా రూ.2.72 కోట్లుతో రజాసాహెబ్‌పేట తారు రోడ్డు పనికి, బోడవాడ నుండి అక్కంపేట వరకు రూ.3.05 కోట్లతో తారు రోడ్డు పనికి రూ.1.74 కోట్లతో రేగుచెట్లపల్లి తారు రోడ్డుకు ఎమ్మెల్యే ఇటీవలే శంకుస్థాపన చేశారు. • అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ రూ.85 కోట్లతో గుండ్లకమ్మ నుంచి అద్దంకి పట్టణానికి నీరందించే పథకానికి ఇటీవలే శంకుస్థాపన చేశారు. • దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలంలో మొగలిగుండాల రిజర్వాయర్‌కు మంత్రి శిద్దా రాఘవరావు ఇటీవలే శంకుస్థాపన చేశారు. దొనకొండ మండలంలోని వెంకటాపురంలో విద్యుత్ సబ్‌స్టేషన్‌కు, రాగమక్కపల్లిలో చిన్న తరహా పరిశ్రమలకు, దర్శిలో 1000 జీప్లస్2 గృహాలకు ఇటీవల మంత్రి శంఖుస్థాపనలు చేశారు. ఐదేళ్లపాటు వీటిని పట్టించుకోని అధికార పార్టీ ఎన్నికల సమయంలో శంకుస్థాపనలకు దిగడంపై విమర్శలు ఉన్నాయి. • గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలం అనుమలపల్లిలో ఎమ్మెల్యే ముత్తముల అశోక్‌రెడ్డి 132/32 కేవి విద్యుత్ సబ్‌స్టేషన్‌కు గురువారం శంకుస్థాపన చేశారు. రెండు నెలలుగా ఈ విద్యుత్ సబ్ స్టేషన్ పనులు మొదలయ్యాయి. గురువారం ఎమ్మెల్యే శంఖుస్థాపన చేయడం గమనార్హం. • పర్చూరు నియోజకవర్గంలో మార్చి 4న కారంచేడులో రూ.3.80 కోట్లతో మంచినీటి పథకానికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శంఖుస్థాపన చేశారు. ఫిబ్రవరి 25న రూ.11.45 కోట్లతో యద్దనపూడి మండలంలోని సూరవరపుపల్లి, అనంతవరం, వింజనం పాడు, చిలుకూరివారిపాలెం, యద్దనపూడి, వెన్నవరం గ్రామాల్లో కమ్యూనిటీహాళ్లు, పంచాయతీ భవనాలకు, సీసీ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. తొండివాగుపై బ్రిడ్జిలకు శంకుస్థాపనలు చేశారు. ఇంకొల్లులో రూ.40 లక్షలతో అన్నా క్యాంటీన్ కోసం ఇటీవలే శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఇంకొల్లు చెరువు వద్ద వాకింగ్ ట్రాక్ కోసం రూ.50 లక్షల పనికి శంకుస్థాపన చేశారు. • కందుకూరు నియోజకవర్గంలో కందుకూరు పట్టణంలో రూ.2 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ వద్ద రూరల్ మండలంలో తాగునీటి సరఫరా కోసం నీటి పథకానికి ఎమ్మెల్యే పోతుల రామారావు శంఖుస్థాపన చేశారు. అలాగే రూ.37 లక్షలతో కందుకూరు పట్టణంలో డ్రైన్‌కు శంకుస్థాపన చేశారు. దీంతో పాటు పట్టణంలో షాదీఖాన కోసం శంకుస్థాపనలు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. అధికార పార్టీ హడావుడిపై విమర్శలు.. వాస్తవానికి గత ఐదేళ్లుగా చంద్రబాబు సర్కారు జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి పనులను గాలికి వదిలేసింది. కనిగిరి నిమ్జ్. దొనకొండ పారిశ్రామికవాడలకు ఎప్పుడో శంకుస్థాపనల శిలాఫలకాలు వేశారు. ఇప్పటికి వాటి ఊసులేదు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీరిస్తామన్నారు. ఐదేళ్లుగా ఈ హామీ నెరవేరలేదు. గుండ్లకమ్మ ప్రాజెక్టును దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పూర్తి చేయగా మిగిలి ఉన్న 5శాతం పనులను కూడా చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. మూడేళ్ల క్రితం జిల్లాకు ట్రిపుల్ ఐటీ మంజూరైనా ఇప్పటికి కనీసం భవనాలు ఏర్పాటు చేసి జిల్లాలో ట్రిపుల్ ఐటీని నడపలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో బాబు సర్కారు ఉండి పోయింది. పాత హామీలను పక్కన పెడితే ఎన్నికల ఏడాదిని దృష్టిలో పెట్టుకుని రామాయపట్నం పోర్టు, ఏషియన్ పేపర్ పరిశ్రమలు నిర్మిస్తామంటూ ఇటీవలే ముఖ్యమంత్రి ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు. వాటి నిర్మాణం ఊసేలేదు. అవన్నీ పక్కనపెట్టి తీరా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న సమయంలో మరోమారు ప్రజలను మభ్యపెట్టేందుకు జిల్లాలో వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు హడావిడి చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ప్రకాశంలో పూజా సందడి
ఒంగోలు (ప్రకాశం): స్థానిక గుంటూరు రోడ్డులో నూతనంగా నిర్మించిన రవిప్రియ మాల్ అండ్ మల్టీప్లెక్స్‌ను ప్రముఖ సినీనటి పూజాహెగ్డే బుధవారం ప్రారంభించారు. పూజాహెగ్డేతో పాటు మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి, మాల్ చైర్మన్ కంది రవిశంకర్, అతని కుటుంబ సభ్యులు కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. తొలుత మాల్ అండ్ మల్టీప్లెక్స్ ముందువైపు ఏర్పాటుచేసిన వాటర్ ఫౌంటైన్‌ను పూజాహెగ్డే ప్రారంభించారు. అనంతరం ప్రధాన భవనాన్ని మంత్రి శిద్దా రాఘవరావు, గ్రౌండ్‌ఫ్లోర్‌లోని మాక్స్షాపింగ్ మాల్, ఫుడ్‌కోర్టును ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు, కేఎఫ్‌సీ సెంటర్‌ను మాజీ మంత్రి మానుగుంట మహీధరరెడ్డి, క్రీమ్స్టోన్ను మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు ప్రారంభించారు. తదుపరి మొదటి అంతస్తులో 65 అడుగుల భారీ స్క్రీన్‌తో నిర్మితమైన స్క్రీన్–1 థియేటర్‌ను బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించగా, స్క్రీన్–2ను ఎమ్మెల్సీ కరణం బలరాం, స్క్రీన్–3ని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రారంభించారు. కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గేమ్‌జోన్‌ను ప్రారంభించారు. అభిమానులను చూస్తుంటే ఆనందంగా ఉంది : పూజాహెగ్డే పూజా హెగ్డే రాకతో రెండు గంటల ముందు నుంచే ఆ ప్రాంతానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. మాల్ ఎదురుగా రోడ్డు పక్కన, డివైడర్లపై బారులుదీరి ఆమెను చూసేందుకు, ఫొటోలు తీసేందుకు ఉత్సాహం చూపారు. భారీ బందోబస్తు మధ్య డప్పులతో పూజా హెగ్డేకు స్వాగతం పలికారు. మాల్ ప్రారంభం అనంతరం పూజాహెగ్డే మాట్లాడుతూ అభిమానులను చూస్తుంటే తనకెంతో ఆనందంగా ఉందన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన రవిశంకర్ గ్రూప్ వారికి కృతజ్ఞతలు ప్రకటించారు. త్వరలోనే తాను నటించిన అరవింద సమేత విడుదలవుతుందని, ఆదరించాలని కోరారు. కేవలం కేకలు కాకుండా ఈలలు వేసి అభిమానాన్ని చాటాలంటూ యువతలో ఉత్సాహాన్ని నింపారు. లవ్యూ సోమచ్ అంటూ గాలిలోకి ముద్దులు విసిరి కుర్రకారును గిలిగింతలు పెట్టారు. ఐదేళ్ల క్రితమే మాల్ నిర్మించాలనుకున్నాం : చైర్మన్ రవిశంకర్ ఐదేళ్ల క్రితం 2013లోనే ఒంగోలులో మాల్ అండ్ మల్టీప్లెక్స్ నిర్మించాలని తాము భావించినట్లు రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ వెల్లడించారు. అది ఇప్పటికి కార్యరూపం దాల్చిందని పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్రాండ్లు అయిన మ్యాక్స్, కేఎఫ్‌సీ, క్రీమ్‌స్టోన్, పిజ్జాహట్లు, థియేటర్లతో పాటు పిల్లలకు అవసరమైన గేమ్‌జోన్ వంటి వాటిని మాల్లో ఏర్పాటు చేశామన్నారు. అన్నింటినీ సరసమైన ధరలకే అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రస్తుతం తాను, తన గ్రూప్ ఉన్నతంగా ఉండటానికి ఒంగోలు, పరిసర ప్రాంతాల ప్రజల ఆశీర్వాదమే కారణమన్నారు. అందుకే ఈ మల్టీప్లెక్స్‌ను ఒంగోలు ప్రజలకు అంకితమిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయత కలిగిన కార్నివాల్స్ సినిమా గ్రూప్ స్క్రీన్లు మూడింటిని సినిమాలకు ఏర్పాటు చేశామన్నారు. మాల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కంది సాయినాథ్ మాట్లాడుతూ 65 అడుగుల పూర్తిస్థాయి స్క్రీన్‌పై సినిమా చూడటం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కేవలం ఒంగోలు ప్రేక్షకులకే సాధ్యమన్నారు. హైదరాబాద్‌లోని ఐమాక్స్‌లో సైతం కొన్ని సినిమాలను మాత్రమే పూర్తిస్థాయి స్క్రీన్‌పై చూడటం సాధ్యపడుతుందన్నారు. కార్యక్రమంలో రవిశంకర్ గ్రూప్ డైరెక్టర్లు ప్రియదర్శిని, విష్ణుమోహన్, విజయసాయి పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మద్యం షాపు నిర్మాణం అడ్డగింత
♦ నిన్ను ఎన్నుకున్నాం..న్యాయం చేయండి ♦ ఎమ్మెల్యే దామచర ్లకు మహిళల మొర ఒంగోలు క్రైం : ఒంగోలు నగరం ముంగమూరు రోడ్డులోని మర్రిచెట్టు సమీపంలో నిర్మాణంలో ఉన్న మద్యం షాపును స్థానిక మహిళలు శుక్రవారం అడ్డుకున్నారు. కొత్తగా ముంగమూరు రోడ్డులో ఓ మద్యం షాపును కేటాయించారు. దీంతో నూతనంగా షాపును దక్కించుకున్న మలినేని చెంచురామానాయుడు ఓ ఖాళీ స్థలాన్ని లీజుకు తీసుకొని షాపు కోసం నిర్మాణాన్ని చేపడుతున్నారు. అది గమనించిన సమీపంలోని అపార్టుమెంట్లలో నివాసం ఉంటున్న మహిళలు, పురుషులు మద్యం షాపు నిర్మాణాన్ని అడ్డుకున్నారు. కొంత సేపు షాపు యజమానికి, మహిళలకు వాగ్వాదం జరిగింది. అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం తెలుసుకున్న తాలూకా ఎస్సై యు.పాండురంగారావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఘర్షణను నిలువరించారు. మద్యం షాపు నిర్మాణం చేపట్టిన యజమాని చెంచురామానాయుడుకు కూడా నచ్చజెప్పి నిర్మాణ పనులను నిలుపుదల చేశారు. అక్కడ నుంచి మహిళలు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు ఫోన్ చేశారు. దీంతో ఆయన మధ్యాహ్నం సమయంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడున్న మహిళలతో మాట్లాడారు. మద్యం షాపు ఇక్కడ ఏర్పాటు చేయటం వల్ల కలిగే ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ లోగా ఓ మహిళ కలుగజేసుకొని ‘నిన్ను ఎంచుకున్నాం....ఇక్కడ మద్యం షాపు లేకుండా చేయాలి’ అని పదే పదే అనటంతో ఫోన్లో ఒంగోలు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం.భాస్కరరావుతో ఎమ్మెల్యే మాట్లాడారు. సమస్యను పరిష్కరించడంతో పాటు లెసైన్స్దారునికి కూడా న్యాయం చేస్తానని ఎస్ఈ భాస్కరరావు ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. అనంతరం మద్యం షాపు యజమానికి కూడా సమస్య పరిష్కారం అయ్యేంత వరకూ నిర్మాణం చేపట్టకూడదని హెచ్చరించారు. దీంతో మహిళలు శాంతించారు.