చరిత్రలో నిలిచేలా నిర్వహిస్తాం | Emerging in the history of handling | Sakshi
Sakshi News home page

చరిత్రలో నిలిచేలా నిర్వహిస్తాం

Published Sat, Oct 1 2016 12:39 AM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM

చరిత్రలో నిలిచేలా నిర్వహిస్తాం

చరిత్రలో నిలిచేలా నిర్వహిస్తాం

  • 11న జిల్లా ఆవిర్భావ వేడుకలు
  • 10వేల బైక్‌ల ర్యాలీతో అధికారులకు ఘనస్వాగతం
  • స్పీకర్‌ మధుసూదనాచారి
  • భూపాలపల్లి : జయశంకర్‌ జిల్లా ఆవిర్భావ వేడుకలను చరిత్రలో నిలిచేలా నిర్వహిస్తామని శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. పట్టణంలోని భారత్‌ ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం నిర్వహించిన జిల్లా ఆవిర్భావ వేడుకల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా ఏర్పాటులో భాగంగా ఈ నెల 11న భూపాలపల్లి పట్టణంలో 60 ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆయా కార్యాలయాల్లో పనిచేసేందుకు రానున్న ఉద్యోగులకు ఘనంగా స్వాగతం పలుకుతామని చెప్పారు. 10వేల బైక్‌లతో భారీ ర్యాలీ, పూలవర్షం, బాణసంచా, కోలాటాలు, నృత్యాలు, డప్పు చప్పుళ్లతో స్వాగత ర్యాలీ ఉంటుందని వివరించారు. ఉద్యోగులు దసరా రోజున విధులకు హాజరవుతున్నందున వారికి అల్పాహారం, మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తామని చెప్పారు. అన్ని సంఘాలు, పార్టీల నాయకులను ఆహ్వానించి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడబోతున్న జిల్లాల్లో ఎక్కడా లేనివిధంగా భూపాలపల్లిలో భవనాలు, సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. భవనాల ఏర్పాటుకు సింగరేణి యాజమాన్యం ఎంతగానో కృషి చేసిందని, ఇందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. అదేరోజున పట్టణంలోని సింగరేణి వర్క్‌షాప్‌ కూడలి వద్ద 7 అడుగుల ఆచార్య జయశంకర్‌ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు. ఆయా కార్యక్రమాలకు మంత్రి చందూలాల్, మంథని ఎమ్మెల్యే పుట్ట మధును ఆహ్వానిస్తామని చెప్పారు. జిల్లా ఆవిర్భావ వేడుకలకు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు అధికసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో భూపాలపల్లి నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ బండారి సంపూర్ణ రవి, జెడ్పీటీసీ సభ్యురాలు జర్పుల మీరాబాయి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు సిరికొండ ప్రశాంత్, వివిధ మండలాల నాయకులు మేకల సంపత్‌కుమార్, మందల రవీందర్‌రెడ్డి, మోడెం ఉమేష్‌గౌడ్, క్యాతరాజు సాంబమూర్తి, పైడిపెల్లి రమేష్, చెరకుతోట శ్రీరాములు, మారెల్ల సేనాపతి, గోవిందుల శ్యామ్‌ పాల్గొన్నారు.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement