చిన్న తిరుపతిలో ఉద్యోగుల సామూహిక సెలవు
చిన్న తిరుపతిగా పేరొందిన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో ఉద్యోగుల సస్పెన్షన్ వివాదం ముదురుతోంది. జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజుకు వ్యతిరేకంగా ధర్నా చేశారంటూ ఏఈవో సహా నలుగురు ఉద్యోగులను ఈవో సస్పెండ్ చేశారు. ఈవోకు మద్దతుగా అందరూ ధర్నా చేస్తే కేవలం ఐదుగురిని సస్పెండ్ చేయడం ఏంటని ఉద్యోగులు మండిపడ్డారు. అయితే.. సస్పెన్షన్ వెనుక కుల రాజకీయాలు ఉన్నాయంటూ కొత్త వాదన ఒకటి వస్తోంది.
ధర్నాలో దాదాపు వంద మందికి పైగా పాల్గొన్నారని, కానీ కేవలం కాపులనే టార్గెట్ చేస్తూ వారినే సస్పెండ్ చేశారని కాపు సంఘాలు మండిపడుతున్నాయి. ద్వారకా తిరుమలలో ధర్నా చేయాలని నిర్ణయించాయి. సస్పెన్షన్ వ్యవహారాన్ని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు దృష్టికి ఉద్యోగ సంఘాల నాయకులు తీసుకెళ్లారు. సస్పెన్షన్ ఎత్తివేయకపోతే రేపటి నుంచి ధర్నాలు చేస్తామని దేవాదాయ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.