chinna tirupati
-
మహా ‘అన్న’ ప్రసాదం
ద్వారకా తిరుమల: అన్నం పరబ్రహ్మ స్వరూపం.. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న.. అందుకే రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఒకటైన ద్వారకా తిరుమల చినవెంకన్న దేవస్థానం నిత్యాన్నదాన పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ క్షేత్రాన్ని నిత్యం వేలాది మంది భక్తులు సందర్శిస్తున్నారు. శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో 30 నుంచి 40 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు ఎంతో రుచికరమైన స్వామివారి అన్నప్రసాదం ఆకలిని తీరుస్తోంది. సాధారణ రోజుల్లో నిత్యం ఐదు వేల మందికి, శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో 10 నుంచి 15 వేల మంది భక్తులకు స్వామివారి అన్నప్రసాదాన్ని దేవస్థానం అందజేస్తోంది. క్షేత్రంలో రాత్రి వేళ బస చేసే యాత్రికులకు, అలాగే కాలినడకన విచ్చేసే భక్తుల సౌకర్యార్థం రాత్రి వేళల్లో సైతం ఈ అన్నప్రసాద వితరణను జరుపుతున్నారు. శ్రీవారి దర్శనార్థం శని, ఆదివారాల్లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉండే భక్తులకు అల్పాహారాన్ని అందిస్తున్నారు. ఆకలితో వచ్చే వారికి లేదనకుండా అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు. అందుకే ఈ నిత్యాన్నదాన పథకానికి భక్తులు విరివిగా విరాళాలను అందజేస్తున్నారు. ఇప్పటి వరకు బ్యాంకులో జమచేసిన ఫిక్స్›డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీతో పాటు, ఒకరోజు అన్నదానం కోసం భక్తులు నెలపాటు చెల్లించే విరాళాలతో ఈ అన్నప్రసాద వితరణను జరుపుతున్నారు. మెనూ ఇది.. దేవస్థానం అధికారులు శ్రీవారి భక్తులకు ఒక మెనూ ప్రకారం స్వామివారి అన్నప్రసాదాన్ని అందజేస్తున్నారు. నిత్యం అన్నప్రసాద వితరణలో గూడాన్నం ప్రసాదాన్ని, అలాగే పప్పు, పచ్చడి, కూర, సాంబారు, మజ్జిగను అందిస్తున్నారు. గుర్తింపు ఇలా.. రూ.3,65,000 చెల్లించే భక్తులను మహాన్నదాతలుగా, రూ.1,00,000 నుంచి 3,65,000 లోపు చెల్లించే వారిని మహారాజ పోషకులుగా, రూ.50 వేల నుంచి రూ.1,00,000 లోపు చెల్లించే వారిని రాజపోషకులుగా గుర్తిస్తున్నారు. అలాగే 2019 అక్టోబర్ వరకు రూ.1,116గా ఉన్న శాశ్వత విరాళాన్ని రూ.2,116లకు పెంచారు. ఈ విరాళాన్ని చెల్లించే వారిని శాశ్వత అన్నదాతలుగా గుర్తిస్తారు. పథకం వివరాలివీ.. పథకం ప్రారంభం: 1994 డిసెంబర్ 8. ఇప్పటి వరకు బ్యాంకులో ఫిక్స్డ్ చేసిన డిపాజిట్ విరాళాలు:రూ. 62,80,68,338 వీటిపై వస్తున్న నెలసరి వడ్డీ: 28 లక్షలు. ఒకరోజు అన్నదానం నిమిత్తం భక్తులు రూ.216 చెల్లించడం ద్వారా నెలకు వస్తున్న విరాళాలు: రూ.15 లక్షల నుంచి 20లక్షలు ఇప్పటి వరకు మహాన్నదాతలుగా గుర్తింపు పొందినవారు: 65 మంది. మహారాజ పోషకులుగా గుర్తింపు పొందిన వారు: 1,203 మంది. రాజ పోషకులుగా గుర్తింపు పొందిన వారు: 985 మంది శాశ్వత అన్నదాతలుగా గుర్తింపు పొందిన వారు: 1,80,000 మంది అన్నదానం జరుగు వేళలు.. సోమవారం నుంచి శుక్రవారం వరకు: ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు. ప్రతిరోజూ రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టు దినదినాభివృద్ధి చెందుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం. కోవిడ్ సమయంలో ప్యాకెట్ల ద్వారా భక్తులకు స్వామివారి అన్న ప్రసాదాన్ని అందజేశాం. ట్రస్టు అభివృద్ధికి దాతలు విరివిగా విరాళాలను అందిస్తున్నారు. – వేండ్ర త్రినాథరావు, శ్రీవారి దేవస్థానం ఈఓ ఎంతో రుచిగా ఉంది స్వామివారి అన్నప్రసాదం ఎంతో రుచిగా ఉంది. ఏడాదిలో రెండు మూడు సార్లు శ్రీవారిని దర్శిస్తాను. క్షేత్రానికి వచ్చిన ప్రతిసారి అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తాను. అన్నదాన భవనంలో శుభ్రత కూడా బాగుంది. – మెండ్యాల సరస్వతి, ఆగిరిపల్లి, భక్తురాలు సేవకు అవకాశం అన్నదాన భవనంలో అన్నప్రసాదాన్ని వడ్డించి, సేవ చేసుకునే భాగ్యాన్ని భక్తులకు కల్పించడం బాగుంది. ఆలయ కార్యాలయంలో పేరు నమోదు చేయించుకున్న తరువాత అధికారులు ఈ సేవకు అనుమతిచ్చారు. ఎంతో సంతోషంగా ఉంది. భోజనం కూడా బాగుంది. – బద్దెం కుమారస్వామి, విశాఖపట్నం, భక్తుడు -
‘దివ్యంగా’ నడిపిస్తారు
సాక్షి, ద్వారకాతిరుమల: అసమాన వైద్య సేవలతో దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రీహేబిలిటేషన్ ఫర్ ది డిజేబుల్డ్ (విర్డ్). చిన్న తిరుపతిగా పేరొందిన పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల క్షేత్రంలో 2008లో ప్రారంభమైన ఈ ఆస్పత్రి అంతర్జాతీయ సౌకర్యాలను సమకూర్చుకుని దివ్యాంగులకు ఉచితంగా అత్యాధునిక వైద్య సేవలందిస్తోంది. పోలియో బాధితులతోపాటు ప్రమాదాల్లో గాయపడి అవయవాలు కోల్పోయిన వారు.. వెన్నెముక సంబంధ సమస్యలతో బాధపడుతున్న వారెందరో ఇక్కడ చికిత్స పొంది కోలుకున్నారు. వేగేశ్న ఆనందరాజు, అనంత కోటిరాజు ప్రధాన దాతృత్వంతో రూపుదిద్దుకున్న ఈ ఆస్పత్రి పలువురు దాతలు అందించిన రూ.16.05 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై ఏటా వస్తున్న వడ్డీ రూ.1.20 కోట్లతో వైద్య సేవలను విస్తృతం చేస్తోంది. దీనికి ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్థానం సహకారం అందిస్తోంది. ప్రత్యేకతలివీ.. పోలియో, సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్న దివ్యాంగులకు çపూర్తి ఉచితంగా వైద్య సేవలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ.లక్షలు ఖర్చయ్యే అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్సలను అతి తక్కువ ధరకే అందిస్తారు లింబ్ రీ–కనస్ట్రక్షన్ సిస్టమ్ ద్వారా పొట్టిగా ఉన్న కాళ్లను పొడవుగా చేయడం ఎముకల మధ్య ఖాళీ ఏర్పడితే రీ–లింబ్ సిస్టమ్ ద్వారా సరిచేయడం మోకాలు లేదా భుజంలో దెబ్బతిన్న లిగ్మెంట్స్ను సరిచేయడానికి ఆర్థోస్కోపీ కీహోల్ సర్జరీ ప్రముఖ ఆస్పత్రుల్లో సైతం విఫలమైన శస్త్ర చికిత్సలను సైతం ఇక్కడ విజయవంతంగా చేస్తున్నారు. ఆధునిక పరికరాలతో లాభాపేక్ష లేకుండా తక్కువ ఖర్చుతో శస్త్ర చికిత్సలు ఆస్పత్రిలోనే ఫార్మసీని నెలకొల్పి ఎమ్మార్పీపై 25 శాతం తక్కువ ధరలకు మందుల విక్రయం. చెన్నైలో రూ.7 లక్షలైంది నాలుగేళ్ల క్రితం ఎడమ కాలిపై కణుతులొచ్చాయి. నొప్పి ఎక్కువై నడవలేని పరిస్థితి. గుంటూరు ఆస్పత్రికి వెళితే ఎముక మద్య ఖాళీ ఏర్పడిందని సిమెంట్‌తో పూడ్చారు. ఇన్ఫెక్షన్ రావడంతో చెన్నై వెళ్లాను. అక్కడి వైద్యులు రూ.7 లక్షలు తీసుకుని చికిత్స చేశారు. ఫలితం లేకపోగా కాలు తీసేసే పరిస్థితి వచ్చింది. విర్డ్‌లో లింబ్ రీ–కనస్ట్రక్షన్ ఆపరేషన్ చేస్తున్నారని చెబితే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు బాగానే ఉంది. – శీలం బాబు, విజయవాడ చౌకగా శస్త్రచికిత్స పదేళ్ల క్రితం మేడ పైనుంచి పడిపోవడంతో ఎడమ కాలి తుంటి కీలు విరిగిపోయింది. శస్త్రచికిత్స చేయించుకోగా కొన్నాళ్లు బాగానే ఉంది. ఏడాది నుంచి నడవలేకపోతున్నాను. ఏ ఆస్పత్రికెళ్లినా కాలు తీసేయాలన్నారు. కొందరు వైద్యులు రూ.5 లక్షలు ఇస్తే ఆపరేషన్ చేస్తామని, అది కూడా గ్యారంటీ లేదన్నారు. డాక్టర్ జగదీష్ నాకు ఉచితంగా ఆపరేషన్ చేశారు. పరికరాలకు రూ.1.20 లక్షలు ఖర్చయింది. – నాగసుబ్బమ్మ, కడప జీవితం ముగిసిందనుకున్నా.. చిన్నతనంలోనే పోలియో బారినపడ్డాను. 2003లో వెన్నెముక నుంచి నొప్పి మొదలైంది. ఏడాది క్రితం హైదరాబాద్, బెంగళూరు వైద్యులను సంప్రదించాను. ఆపరేషన్ చేయకపోతే శరీరంలోని అన్ని అవయవాలు చచ్చుబడతాయన్నారు. ఆపరేషన్‌కు రూ.15 లక్షలు అవుతుందని, అయినా గ్యారంటీ ఇవ్వలేమన్నారు. దీంతో నా జీవితం ముగిసిపోయిందనుకున్నా. విర్డ్ ఆస్పత్రిలో ఉచితంగా ఆపరేషన్ చేశారు.పరికారాలకు మాత్రం రూ.1.50 లక్షలు ఖర్చయింది. – బి.శ్రీదేవి, నంద్యాల పైసా తీసుకోకుండా.. రోడ్డు ప్రమాదంలో నా మోకాలిలోని ఏసీఎల్ తెగిపోయింది. విర్డ్ ఆసుపత్రిలో కీహోల్ సర్జరీ చేస్తున్నట్టు తెలిసి వచ్చాను. ఆరోగ్యశ్రీలో పైసా ఖర్చు లేకుండా ఇక్కడ కీహోల్ సర్జరీ చేశారు. – పి.భవానీ శంకర్, రామన్నపాలెం, మొగల్తూరు మండలం -
చినవెంకన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
వరపల్లి : ద్వారకాతిరుమలేశుని క్షేత్రం శనివారం భక్తులతో పోటెత్తింది. కిక్కిరిసిన భక్తులతో ఆలయ పరిసరాలు కళకళలాడాయి. ప్రసాదం, టికెట్ కౌంటర్లు, దర్శనం క్యూలైన్లు, కేశఖండన శాల ఇతర విభాగాలు భక్తులతో నిండిపోయాయి. దర్శనం క్యూలైన్లు పూర్తిగా నిండిపోవడంతో ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలో భక్తులు బారులు తీరారు. దాదాపు 20 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించినట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు. సాయంత్రం వరకు ఆలయంలో రద్దీ కొనసాగింది. దాదాపు 5 వేల మందికి పైగా భక్తులు స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించినట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలరించిన కోలాట భజనలు శ్రీవారి ఆలయ పరిసరాల్లో తిరుమల తిరుపతి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట భజనలు ఆద్యంతం భక్తులను అలరించాయి. ముందుగా వారు స్వామి, అమ్మవార్లను దర్శించి పూజించారు. ఆ తరువాత ఆలయ ఆవరణలోను, శ్రీహరికళాతోరణ వేదికపైన భక్తిగీతాలను ఆలపిస్తూ కోలాట భజనలు జరిపారు. -
చిన్నతిరుపతిలో.. చిరుత జాడలు
స్థానికులు, భక్తుల భయాందోళనలు అటవీ అధికారుల రాక, పులి సంచారంపై ఆరా బోన్లు ఏర్పాటు చేసి పట్టుకుంటాం: రేంజ్ ఆఫీసర్ దేవరపల్లి: శ్రీవారి శేషాచలకొండ సమీప ప్రాంతంలో చిరుతపులి సంచారం స్థానికంగా తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది. దీంతో స్థానికులు, భక్తులు తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు. చిరుత సంచరిస్తున్న ఈ ప్రాంతంలో సెయింట్ గ్జేవియర్ పాఠశాల ఉండటంతో విద్యార్ధులు, ఉపాధ్యాయులు భీతిల్లుతున్నారు. జనసంచారం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో పులి జాడలు తీవ్ర అలజడిని రేపుతున్నాయి. చిరుత అడుగు జాడలను మంగళవారం గుర్తించిన స్థానికులు సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు అందించారు. ఇటీవల మండలంలోని తిరుమలంపాలెంలో కొందరు రైతులు పెట్టిన గుళికలు తిని చిరుతపులి మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ముందెన్నడు పులి జాడలు కనిపించని ఈ ప్రాంతంలో చిరుత మృతి అటవీశాఖ అధికారులను ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేసింది. ఇప్పుడు తాజా సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ పి.సూర్యప్రకాశరావు (ఏలూరు), డిప్యుటీ రేంజ్ ఆఫీసర్ సీహెచ్.శ్రీనివాసరావు (నల్లజర్ల), దూబచర్ల బీట్ ఆఫీసర్ మెహబూబ్, నల్లజర్ల బీట్ ఆఫీసర్లు బి.కోటేశ్వరరావు, డి.రాజేష్, వెంకటరామన్నగూడెం బీట్ ఆఫీసర్ ఎస్కే.సయ్యద్ బాజీలు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుత జాడలను క్షుణ్ణంగా పరిశీలించారు. పులి సంచారంపై స్థానికులను ఆరా తీశారు. వారంతా రాత్రి వరకు ఇక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా ఎం.వాసు, అవనిగడ్డ రమేష్, ఫాదర్ డేవిడ్ తదితరులు మాట్లాడుతూ గత కొద్దిరోజులుగా పులిజాడలు కనిపిస్తున్నాయని, సోమవారం రాత్రి వర్షం కురవడంతో అవి మరింత ఎక్కువగా కనిపించాయని అధికారులకు తెలిపారు. ఇప్పటి వరకు ఏవిధమైన ప్రాణహానీ కలగనప్పటికీ తమకు భయంగా ఉందని అధికారులకు చెప్పారు. దీంతో రేంజ్ ఆఫీసర్ సూర్యప్రకాశరావు మాట్లాడుతూ రాజమండ్రిలోని వైల్డ్ లైఫ్‌లో ఉన్న పులి బోన్లను తీసుకొచ్చి చిరుతను పట్టుకుంటామని తెలిపారు. అప్పటి వరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని, రాత్రి సమయాల్లో సిబ్బంది బీట్ నిర్వహిస్తారన్నారు. పాదయాత్ర భక్తుల్లో గుబులు ః అటవీ ప్రాంతమైన దూబచర్ల మీదుగానే నిత్యం వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు కాలినడకన శ్రీవారి క్షేత్రానికి వస్తుంటారు. ఇటీవల కాలంలో పాదయాత్ర భక్తుల సంఖ్య పెరిగింది. అయితే ఇప్పటి వరకు కలగని క్రూరమృగాల భయం ఇప్పుడు పాదయాత్ర భక్తుల్లో ఏర్పడింది. అటవీశాఖ అధికారులు తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. చిరుతలు.. ఇంకెన్నో.. ః తిరుమలంపాలెంలో చిరుతపులి మృతి తరువాత అటవీశాఖ అధికారులు దానికి తోడుగా మరో పెద్ద చిరుత ఉంటుందని, అది కూడా ఈ ప్రాంతంలోనే సంచరించే అవకాశం ఉందని సూచన ప్రాయంగా చెప్పారు. ఇటీవల చిరుత అలజడులు కూడా అక్కడక్కడ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మంగళవారం శేషాచలకొండ సమీప ప్రాంతంలో కనిపించిన జాడలు పలు అనుమానాలను కలిగిస్తున్నాయి. పులి వేసిన అడుగులను కొలిచిన అధికారులు అది 46 నుంచి 48 సెంటీమీటర్లు పొడవు ఉంటుందని ధృవీకరించారు. దీన్ని బట్టి చూస్తే ఇది అంత పెద్ద చిరుత కాదని కొందరు అటవీ సిబ్బంది చెబుతున్నారు. అలాంటప్పుడు ఇటీవల చనిపోయిన చిరుతకు ఇది తోడు కాకపోవచ్చని, వాటి పిల్లలు అయ్యే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే తల్లి పులి ఏమైందని, అసలు ఇంకెన్ని చిరుతలు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయనేది సర్వత్రా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఏది ఏమైనా ఈ పులి భయాన్ని నివారించే దిశగా అధికారులు తగు రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
చిన్న తిరుపతిలో ఉద్యోగుల సామూహిక సెలవు
-
చిన్న తిరుపతిలో ఉద్యోగుల సామూహిక సెలవు
చిన్న తిరుపతిగా పేరొందిన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో ఉద్యోగుల సస్పెన్షన్ వివాదం ముదురుతోంది. జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజుకు వ్యతిరేకంగా ధర్నా చేశారంటూ ఏఈవో సహా నలుగురు ఉద్యోగులను ఈవో సస్పెండ్ చేశారు. ఈవోకు మద్దతుగా అందరూ ధర్నా చేస్తే కేవలం ఐదుగురిని సస్పెండ్ చేయడం ఏంటని ఉద్యోగులు మండిపడ్డారు. అయితే.. సస్పెన్షన్ వెనుక కుల రాజకీయాలు ఉన్నాయంటూ కొత్త వాదన ఒకటి వస్తోంది. ధర్నాలో దాదాపు వంద మందికి పైగా పాల్గొన్నారని, కానీ కేవలం కాపులనే టార్గెట్ చేస్తూ వారినే సస్పెండ్ చేశారని కాపు సంఘాలు మండిపడుతున్నాయి. ద్వారకా తిరుమలలో ధర్నా చేయాలని నిర్ణయించాయి. సస్పెన్షన్ వ్యవహారాన్ని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు దృష్టికి ఉద్యోగ సంఘాల నాయకులు తీసుకెళ్లారు. సస్పెన్షన్ ఎత్తివేయకపోతే రేపటి నుంచి ధర్నాలు చేస్తామని దేవాదాయ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.