ద్వారకాతిరుమలలోని విర్డ్ ఆస్పత్రి
సాక్షి, ద్వారకాతిరుమల: అసమాన వైద్య సేవలతో దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రీహేబిలిటేషన్ ఫర్ ది డిజేబుల్డ్ (విర్డ్). చిన్న తిరుపతిగా పేరొందిన పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల క్షేత్రంలో 2008లో ప్రారంభమైన ఈ ఆస్పత్రి అంతర్జాతీయ సౌకర్యాలను సమకూర్చుకుని దివ్యాంగులకు ఉచితంగా అత్యాధునిక వైద్య సేవలందిస్తోంది. పోలియో బాధితులతోపాటు ప్రమాదాల్లో గాయపడి అవయవాలు కోల్పోయిన వారు.. వెన్నెముక సంబంధ సమస్యలతో బాధపడుతున్న వారెందరో ఇక్కడ చికిత్స పొంది కోలుకున్నారు. వేగేశ్న ఆనందరాజు, అనంత కోటిరాజు ప్రధాన దాతృత్వంతో రూపుదిద్దుకున్న ఈ ఆస్పత్రి పలువురు దాతలు అందించిన రూ.16.05 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఏటా వస్తున్న వడ్డీ రూ.1.20 కోట్లతో వైద్య సేవలను విస్తృతం చేస్తోంది. దీనికి ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్థానం సహకారం అందిస్తోంది.
ప్రత్యేకతలివీ..
- పోలియో, సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్న దివ్యాంగులకు çపూర్తి ఉచితంగా వైద్య సేవలు
- కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ.లక్షలు ఖర్చయ్యే అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్సలను అతి తక్కువ ధరకే అందిస్తారు
- లింబ్ రీ–కనస్ట్రక్షన్ సిస్టమ్ ద్వారా పొట్టిగా ఉన్న కాళ్లను పొడవుగా చేయడం
- ఎముకల మధ్య ఖాళీ ఏర్పడితే రీ–లింబ్ సిస్టమ్ ద్వారా సరిచేయడం
- మోకాలు లేదా భుజంలో దెబ్బతిన్న లిగ్మెంట్స్‌ను సరిచేయడానికి ఆర్థోస్కోపీ కీహోల్ సర్జరీ
- ప్రముఖ ఆస్పత్రుల్లో సైతం విఫలమైన శస్త్ర చికిత్సలను సైతం ఇక్కడ విజయవంతంగా చేస్తున్నారు.
- ఆధునిక పరికరాలతో లాభాపేక్ష లేకుండా తక్కువ ఖర్చుతో శస్త్ర చికిత్సలు
- ఆస్పత్రిలోనే ఫార్మసీని నెలకొల్పి ఎమ్మార్పీపై 25 శాతం తక్కువ ధరలకు మందుల విక్రయం.
చెన్నైలో రూ.7 లక్షలైంది
నాలుగేళ్ల క్రితం ఎడమ కాలిపై కణుతులొచ్చాయి. నొప్పి ఎక్కువై నడవలేని పరిస్థితి. గుంటూరు ఆస్పత్రికి వెళితే ఎముక మద్య ఖాళీ ఏర్పడిందని సిమెంట్‌తో పూడ్చారు. ఇన్ఫెక్షన్ రావడంతో చెన్నై వెళ్లాను. అక్కడి వైద్యులు రూ.7 లక్షలు తీసుకుని చికిత్స చేశారు. ఫలితం లేకపోగా కాలు తీసేసే పరిస్థితి వచ్చింది. విర్డ్‌లో లింబ్ రీ–కనస్ట్రక్షన్ ఆపరేషన్ చేస్తున్నారని చెబితే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు బాగానే ఉంది.
– శీలం బాబు, విజయవాడ
చౌకగా శస్త్రచికిత్స
పదేళ్ల క్రితం మేడ పైనుంచి పడిపోవడంతో ఎడమ కాలి తుంటి కీలు విరిగిపోయింది. శస్త్రచికిత్స చేయించుకోగా కొన్నాళ్లు బాగానే ఉంది. ఏడాది నుంచి నడవలేకపోతున్నాను. ఏ ఆస్పత్రికెళ్లినా కాలు తీసేయాలన్నారు. కొందరు వైద్యులు రూ.5 లక్షలు ఇస్తే ఆపరేషన్ చేస్తామని, అది కూడా గ్యారంటీ లేదన్నారు. డాక్టర్ జగదీష్ నాకు ఉచితంగా ఆపరేషన్ చేశారు. పరికరాలకు రూ.1.20 లక్షలు ఖర్చయింది.
– నాగసుబ్బమ్మ, కడప
జీవితం ముగిసిందనుకున్నా..
చిన్నతనంలోనే పోలియో బారినపడ్డాను. 2003లో వెన్నెముక నుంచి నొప్పి మొదలైంది. ఏడాది క్రితం హైదరాబాద్, బెంగళూరు వైద్యులను సంప్రదించాను. ఆపరేషన్ చేయకపోతే శరీరంలోని అన్ని అవయవాలు చచ్చుబడతాయన్నారు. ఆపరేషన్‌కు రూ.15 లక్షలు అవుతుందని, అయినా గ్యారంటీ ఇవ్వలేమన్నారు. దీంతో నా జీవితం ముగిసిపోయిందనుకున్నా. విర్డ్ ఆస్పత్రిలో ఉచితంగా ఆపరేషన్ చేశారు.పరికారాలకు మాత్రం రూ.1.50 లక్షలు ఖర్చయింది.
– బి.శ్రీదేవి, నంద్యాల
పైసా తీసుకోకుండా..
రోడ్డు ప్రమాదంలో నా మోకాలిలోని ఏసీఎల్ తెగిపోయింది. విర్డ్ ఆసుపత్రిలో కీహోల్ సర్జరీ చేస్తున్నట్టు తెలిసి వచ్చాను. ఆరోగ్యశ్రీలో పైసా ఖర్చు లేకుండా ఇక్కడ కీహోల్ సర్జరీ చేశారు.
– పి.భవానీ శంకర్, రామన్నపాలెం, మొగల్తూరు మండలం
Comments
Please login to add a commentAdd a comment