మహా ‘అన్న’ ప్రసాదం | Implementation of Nithyananda Scheme In Dwarka Thirumala | Sakshi
Sakshi News home page

మహా ‘అన్న’ ప్రసాదం

Published Thu, Apr 21 2022 4:26 PM | Last Updated on Thu, Apr 21 2022 4:42 PM

Implementation of Nithyananda Scheme In Dwarka Thirumala - Sakshi

ద్వారకా తిరుమల: అన్నం పరబ్రహ్మ స్వరూపం.. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న.. అందుకే రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఒకటైన ద్వారకా తిరుమల చినవెంకన్న దేవస్థానం నిత్యాన్నదాన పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ క్షేత్రాన్ని నిత్యం వేలాది మంది భక్తులు సందర్శిస్తున్నారు. శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో 30 నుంచి 40 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు ఎంతో రుచికరమైన స్వామివారి అన్నప్రసాదం ఆకలిని తీరుస్తోంది. సాధారణ రోజుల్లో నిత్యం ఐదు వేల మందికి, శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో 10 నుంచి 15 వేల మంది భక్తులకు స్వామివారి అన్నప్రసాదాన్ని దేవస్థానం అందజేస్తోంది.

క్షేత్రంలో రాత్రి వేళ బస చేసే యాత్రికులకు, అలాగే కాలినడకన విచ్చేసే భక్తుల సౌకర్యార్థం రాత్రి వేళల్లో సైతం ఈ అన్నప్రసాద వితరణను జరుపుతున్నారు. శ్రీవారి దర్శనార్థం శని, ఆదివారాల్లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉండే భక్తులకు అల్పాహారాన్ని అందిస్తున్నారు. ఆకలితో వచ్చే వారికి లేదనకుండా అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు. అందుకే ఈ నిత్యాన్నదాన పథకానికి భక్తులు విరివిగా విరాళాలను అందజేస్తున్నారు. ఇప్పటి వరకు బ్యాంకులో జమచేసిన ఫిక్స్‌›డ్‌ డిపాజిట్లపై వచ్చే వడ్డీతో పాటు, ఒకరోజు అన్నదానం కోసం భక్తులు నెలపాటు చెల్లించే విరాళాలతో ఈ అన్నప్రసాద వితరణను జరుపుతున్నారు. 

మెనూ ఇది.. 
దేవస్థానం అధికారులు శ్రీవారి భక్తులకు ఒక మెనూ ప్రకారం స్వామివారి అన్నప్రసాదాన్ని అందజేస్తున్నారు. నిత్యం అన్నప్రసాద వితరణలో గూడాన్నం ప్రసాదాన్ని, అలాగే పప్పు, పచ్చడి, కూర, సాంబారు, మజ్జిగను అందిస్తున్నారు.

గుర్తింపు ఇలా.. 
రూ.3,65,000 చెల్లించే భక్తులను మహాన్నదాతలుగా, రూ.1,00,000 నుంచి 3,65,000 లోపు చెల్లించే వారిని మహారాజ పోషకులుగా, రూ.50 వేల నుంచి రూ.1,00,000 లోపు చెల్లించే వారిని రాజపోషకులుగా గుర్తిస్తున్నారు. అలాగే 2019 అక్టోబర్‌ వరకు రూ.1,116గా ఉన్న శాశ్వత విరాళాన్ని రూ.2,116లకు పెంచారు. ఈ విరాళాన్ని చెల్లించే వారిని శాశ్వత అన్నదాతలుగా గుర్తిస్తారు. 

పథకం వివరాలివీ.. 
     పథకం ప్రారంభం: 1994 డిసెంబర్‌ 8.
     ఇప్పటి వరకు బ్యాంకులో ఫిక్స్‌డ్‌ చేసిన డిపాజిట్‌ విరాళాలు:రూ. 62,80,68,338 
     వీటిపై వస్తున్న నెలసరి వడ్డీ:    28 లక్షలు. 
     ఒకరోజు అన్నదానం నిమిత్తం భక్తులు 
    రూ.216 చెల్లించడం ద్వారా నెలకు వస్తున్న విరాళాలు:    రూ.15 లక్షల నుంచి 20లక్షలు
     ఇప్పటి వరకు మహాన్నదాతలుగా గుర్తింపు పొందినవారు:    65 మంది.
     మహారాజ పోషకులుగా గుర్తింపు పొందిన వారు:    1,203 మంది.
     రాజ పోషకులుగా గుర్తింపు పొందిన వారు:    985 మంది
     శాశ్వత అన్నదాతలుగా గుర్తింపు పొందిన వారు:    1,80,000 మంది 

అన్నదానం జరుగు వేళలు..
సోమవారం నుంచి శుక్రవారం వరకు:
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు.
శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు. 
ప్రతిరోజూ రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు.

ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం 
శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టు దినదినాభివృద్ధి చెందుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం. కోవిడ్‌ సమయంలో ప్యాకెట్ల ద్వారా భక్తులకు స్వామివారి అన్న ప్రసాదాన్ని అందజేశాం. ట్రస్టు అభివృద్ధికి దాతలు విరివిగా విరాళాలను అందిస్తున్నారు. 
– వేండ్ర త్రినాథరావు, శ్రీవారి దేవస్థానం ఈఓ 

ఎంతో రుచిగా ఉంది 
స్వామివారి అన్నప్రసాదం ఎంతో రుచిగా ఉంది. ఏడాదిలో రెండు మూడు సార్లు శ్రీవారిని దర్శిస్తాను. క్షేత్రానికి వచ్చిన ప్రతిసారి అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తాను. అన్నదాన భవనంలో శుభ్రత కూడా బాగుంది. 
– మెండ్యాల సరస్వతి, ఆగిరిపల్లి, భక్తురాలు

సేవకు అవకాశం 
అన్నదాన భవనంలో అన్నప్రసాదాన్ని వడ్డించి, సేవ చేసుకునే భాగ్యాన్ని భక్తులకు కల్పించడం బాగుంది. ఆలయ కార్యాలయంలో పేరు నమోదు చేయించుకున్న తరువాత అధికారులు ఈ సేవకు అనుమతిచ్చారు. ఎంతో సంతోషంగా ఉంది. భోజనం కూడా బాగుంది.
– బద్దెం కుమారస్వామి, విశాఖపట్నం, భక్తుడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement