చినవెంకన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
వరపల్లి : ద్వారకాతిరుమలేశుని క్షేత్రం శనివారం భక్తులతో పోటెత్తింది. కిక్కిరిసిన భక్తులతో ఆలయ పరిసరాలు కళకళలాడాయి. ప్రసాదం, టికెట్ కౌంటర్లు, దర్శనం క్యూలైన్లు, కేశఖండన శాల ఇతర విభాగాలు భక్తులతో నిండిపోయాయి. దర్శనం క్యూలైన్లు పూర్తిగా నిండిపోవడంతో ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలో భక్తులు బారులు తీరారు. దాదాపు 20 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించినట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు. సాయంత్రం వరకు ఆలయంలో రద్దీ కొనసాగింది. దాదాపు 5 వేల మందికి పైగా భక్తులు స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించినట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు.
అలరించిన కోలాట భజనలు
శ్రీవారి ఆలయ పరిసరాల్లో తిరుమల తిరుపతి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట భజనలు ఆద్యంతం భక్తులను అలరించాయి. ముందుగా వారు స్వామి, అమ్మవార్లను దర్శించి పూజించారు. ఆ తరువాత ఆలయ ఆవరణలోను, శ్రీహరికళాతోరణ వేదికపైన భక్తిగీతాలను ఆలపిస్తూ కోలాట భజనలు జరిపారు.