చిన్నతిరుపతిలో.. చిరుత జాడలు
చిన్నతిరుపతిలో.. చిరుత జాడలు
Published Wed, Aug 9 2017 12:06 AM | Last Updated on Fri, Oct 5 2018 8:28 PM
స్థానికులు, భక్తుల భయాందోళనలు
అటవీ అధికారుల రాక, పులి సంచారంపై ఆరా
బోన్లు ఏర్పాటు చేసి పట్టుకుంటాం: రేంజ్ ఆఫీసర్
దేవరపల్లి: శ్రీవారి శేషాచలకొండ సమీప ప్రాంతంలో చిరుతపులి సంచారం స్థానికంగా తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది. దీంతో స్థానికులు, భక్తులు తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు. చిరుత సంచరిస్తున్న ఈ ప్రాంతంలో సెయింట్ గ్జేవియర్ పాఠశాల ఉండటంతో విద్యార్ధులు, ఉపాధ్యాయులు భీతిల్లుతున్నారు. జనసంచారం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో పులి జాడలు తీవ్ర అలజడిని రేపుతున్నాయి. చిరుత అడుగు జాడలను మంగళవారం గుర్తించిన స్థానికులు సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు అందించారు. ఇటీవల మండలంలోని తిరుమలంపాలెంలో కొందరు రైతులు పెట్టిన గుళికలు తిని చిరుతపులి మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ముందెన్నడు పులి జాడలు కనిపించని ఈ ప్రాంతంలో చిరుత మృతి అటవీశాఖ అధికారులను ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేసింది. ఇప్పుడు తాజా సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ పి.సూర్యప్రకాశరావు (ఏలూరు), డిప్యుటీ రేంజ్ ఆఫీసర్ సీహెచ్.శ్రీనివాసరావు (నల్లజర్ల), దూబచర్ల బీట్ ఆఫీసర్ మెహబూబ్, నల్లజర్ల బీట్ ఆఫీసర్లు బి.కోటేశ్వరరావు, డి.రాజేష్, వెంకటరామన్నగూడెం బీట్ ఆఫీసర్ ఎస్‌కే.సయ్యద్ బాజీలు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుత జాడలను క్షుణ్ణంగా పరిశీలించారు. పులి సంచారంపై స్థానికులను ఆరా తీశారు. వారంతా రాత్రి వరకు ఇక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా ఎం.వాసు, అవనిగడ్డ రమేష్, ఫాదర్ డేవిడ్ తదితరులు మాట్లాడుతూ గత కొద్దిరోజులుగా పులిజాడలు కనిపిస్తున్నాయని, సోమవారం రాత్రి వర్షం కురవడంతో అవి మరింత ఎక్కువగా కనిపించాయని అధికారులకు తెలిపారు. ఇప్పటి వరకు ఏవిధమైన ప్రాణహానీ కలగనప్పటికీ తమకు భయంగా ఉందని అధికారులకు చెప్పారు. దీంతో రేంజ్ ఆఫీసర్ సూర్యప్రకాశరావు మాట్లాడుతూ రాజమండ్రిలోని వైల్డ్ లైఫ్‌లో ఉన్న పులి బోన్లను తీసుకొచ్చి చిరుతను పట్టుకుంటామని తెలిపారు. అప్పటి వరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని, రాత్రి సమయాల్లో సిబ్బంది బీట్ నిర్వహిస్తారన్నారు.
పాదయాత్ర భక్తుల్లో గుబులు ః
అటవీ ప్రాంతమైన దూబచర్ల మీదుగానే నిత్యం వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు కాలినడకన శ్రీవారి క్షేత్రానికి వస్తుంటారు. ఇటీవల కాలంలో పాదయాత్ర భక్తుల సంఖ్య పెరిగింది. అయితే ఇప్పటి వరకు కలగని క్రూరమృగాల భయం ఇప్పుడు పాదయాత్ర భక్తుల్లో ఏర్పడింది. అటవీశాఖ అధికారులు తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
చిరుతలు.. ఇంకెన్నో.. ః
తిరుమలంపాలెంలో చిరుతపులి మృతి తరువాత అటవీశాఖ అధికారులు దానికి తోడుగా మరో పెద్ద చిరుత ఉంటుందని, అది కూడా ఈ ప్రాంతంలోనే సంచరించే అవకాశం ఉందని సూచన ప్రాయంగా చెప్పారు. ఇటీవల చిరుత అలజడులు కూడా అక్కడక్కడ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మంగళవారం శేషాచలకొండ సమీప ప్రాంతంలో కనిపించిన జాడలు పలు అనుమానాలను కలిగిస్తున్నాయి. పులి వేసిన అడుగులను కొలిచిన అధికారులు అది 46 నుంచి 48 సెంటీమీటర్లు పొడవు ఉంటుందని ధృవీకరించారు. దీన్ని బట్టి చూస్తే ఇది అంత పెద్ద చిరుత కాదని కొందరు అటవీ సిబ్బంది చెబుతున్నారు. అలాంటప్పుడు ఇటీవల చనిపోయిన చిరుతకు ఇది తోడు కాకపోవచ్చని, వాటి పిల్లలు అయ్యే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే తల్లి పులి ఏమైందని, అసలు ఇంకెన్ని చిరుతలు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయనేది సర్వత్రా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఏది ఏమైనా ఈ పులి భయాన్ని నివారించే దిశగా అధికారులు తగు రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Advertisement
Advertisement