సిబ్బంది ఫుల్.. సౌకర్యాలు నిల్
సిబ్బంది ఫుల్.. సౌకర్యాలు నిల్
Published Thu, Aug 11 2016 8:11 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM
భోజనం లేక అస్వస్థతకు గురైన స్వీపర్
ఆసుపత్రిలో మంచాలు లేవు
సీతానగరం ఘాట్ వద్ద నామమాత్రంగా వైద్యశిబిరాలు
తాడేపల్లి రూరల్ : కృష్ణా పుష్కరాల్లో సేవలందించేందుకు వచ్చిన సిబ్బందికి కనీస సౌకర్యాలు కల్పించటంలో ప్రభుత్వం విఫలమైంది. అత్యవసర సదుపాయాలు లేకపోవటంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులను పెద్ద ఎత్తున నియమించారు. తాడేపల్లి పరిధిలోని సీతానగరం ఘాట్ వద్ద 3వేల మంది పోలీసులు, 2 వేల మంది పారిశుద్ధ్య సిబ్బంది, 500 మంది ఎన్‌సీసీ విద్యార్థులు ఉన్నారు. వీరంతా రెండు రోజుల క్రితమే ఘాట్ వద్దకు చేరుకున్నారు. అయితే వీరిలో అనేక మందికి బుధవారం మధ్యాహ్నం నుంచి భోజనం అందలేదు. ఈ నేపథ్యంలో భీమడోలుకు చెందిన పారిశుద్ధ్య కార్మికుడు మొండెం వెంకటేశ్వర్లు గురువారం ఉదయం విధులు నిర్వర్తిస్తుండగా అస్వస్థతకు గురయ్యాడు. ఘాట్‌లో ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో పరికరాలు, మందులు లేవు. ఆసుపత్రికి తరలించాలన్నా అంబులెన్స్ అందుబాటులో లేదు. వెంకటేశ్వర్లు పరిస్థితిని గమనించిన బంధువులు ఉండవల్లి సెంటర్ సమీపంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకెళ్లారు. వాహనంలో తీసుకెళ్లే సమయంలో అపస్మారక స్థితిలో ఉన్న వెంకటేశ్వర్ల కాలు కిందకి జారటంతో మరో గాయం తగిలింది. ఇన్ని అవస్థలు పడి పీహెచ్‌సీకి తీసుకెళితే అక్కడ బెడ్‌లు లేకపోవటంతో వీలైచైర్‌పైనే కూర్చోబెట్టి వైద్యం అందించారు. సీతానగరం ఘాట వద్ద ఏర్పాటు చేసిన రెండు వైద్యశిబిరాల్లో కనీస సౌకర్యాలు కనిపించలేదు. దీంతో వచ్చిన సిబ్బంది అట్టపెట్టెలు కింద వేసుకుని కూర్చొన్నారు.
Advertisement
Advertisement