చేనేత రంగాన్ని ప్రోత్సహించాలి
Published Tue, Aug 2 2016 11:55 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
గద్వాల : వ్యవసాయం తరువాత అంతటి ప్రాధాన్యత కలిగిన చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని గద్వాల చేనేత సహకార సంఘం చైర్మన్ రామలింగేశ్వర కాంళ్లే కోరారు. మంగళవారం స్థానిక మార్కండేయస్వామి ఆలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం గద్వాలలో పాలమూరు జిల్లా చేనేత మహా సమ్మేళనం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వాలు సైతం చేనేత రంగంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఉత్పాదక రంగంలో వ్యవసాయానికి ఇస్తున్న సబ్సిడీలు, రాయితీలు, రుణాలు తదితరవి చేనేతకు సైతం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులను చేనేత కళాకారులుగా గుర్తించాలని కోరారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి చేనేత కార్మికులు మహా సమ్మేళనానికి తరలిస్తున్నారని వివరించారు. ఆభఃదివారం ఉదయం 10 గంటలకు స్థానిక రాఘవేంద్ర కాలనీలో నిర్వహించే మహా సమ్మేళనానికి జెడ్పీచైర్మన్ భాస్కర్, ఎమ్మెల్యే డీకే అరుణ, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ చైర్‌పర్సన్ విమలక్క, పలువురు సంఘ సంస్కర్తలు హాజరవుతున్నారన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి కార్మికులు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. అనంతరం పాలమూరు జిల్లా చేనేత మహా సమ్మేళనం కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో చేనేత సహకార సంఘం నాయకులు సత్యమ్మ, ఆదినారాయణ, నర్సింహ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement