- మండల ఇంజినీరింగ్ అధికారిపై టీడీపీ నాయకుడి శివాలు
- ఇక్కడ ఎలా పని చేస్తావో చూస్తానంటూ వార్నింగ్
తన్నులు తింటావ్.. చర్మం ఊడదీస్తా..
Published Mon, Feb 6 2017 12:13 AM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM
రాజమహేంద్రవరం రూరల్ :
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు, అధికారులకు రక్షణ లేకుండా పోతోంది. పశ్చిమ గోదావరి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తహసీల్దార్ వనజాక్షిని జుట్టు పట్టుకొని దాడి చేయడం.. అంగ¯ŒSవాడీలపై దుర్భాషలాడుతూ విరుచుకుపడడం.. మొన్నటికి మొన్న అనంతపురం జిల్లా జల్లిపల్లిలో టీడీపీ సర్పంచ్ ఓ మహిళను ఎగిరెగిరి కాళ్లతో తన్నడం.. ఇలా అనేక దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకు తామేమీ తీసిపోకూడదనుకున్నారో ఏమో మరి! రాజమహేంద్రవరం రూరల్ మండలం శాటిలైట్ సిటీ గ్రామంలో.. మండల ఇంజినీరింగ్ అధికారిపై మండల టీడీపీ అధ్యక్షుడు ‘తన్నులు తింటావ్’ అంటూ విరుచుకుపడ్డాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం..
శాటిలైట్ సిటీ గ్రామంలో ఉపముఖ్యమంత్రి చినరాజప్ప చేతుల మీదుగా ఆర్‌టీసీ సిటీ బస్సులను ఆదివారం ప్రారంభించారు. అనంతరం అధికారులు, టీడీపీ నాయకులు కలిసి టిఫి¯ŒS చేస్తున్నారు. ఈలోగా పిడింగొయ్యి పంచాయతీ బుచ్చియ్యనగర్‌లో జనావాసాలు లేనిచోట ఇటీవల రూ.22 లక్షలతో నిర్మాణం చేపట్టిన సీసీ రోడ్డు విషయం చర్చకు వచ్చింది. దీనిపై మండల ఇంజినీరింగ్ అధికారి సూర్యనారాయణ తన పక్కనే ఉన్న మాజీ వైస్ ఎంపీపీ గంగిన హనుమంతరావుతో మాట్లాడుతూ, పంచాయతీ తీర్మానం లేకుండా, వర్కార్డర్ వస్తుందా? అని అడిగారు. హనుమంతరావు మాట్లాడుతూ, తీర్మానం లేకుండా ఎటువంటి పనులకూ వర్కార్డర్ రాదని బదులిచ్చారు. అదే సమయంలో అక్కడే ఉన్న మండల టీడీపీ అధ్యక్షుడు మార్ని వాసుదేవరావు ఒక్కసారిగా కోపోద్రిక్తుడై మండల ఇంజినీరింగ్ అధికారి సూర్యనారాయణపై విరుచుకుపడ్డాడు. ‘‘తన్నులు తింటావ్. చర్మం ఊడదీస్తా. ఇక్కడ ఎలా పని చేస్తావో చూస్తాను’’ అంటూ శివాలెత్తాడు. ‘‘కొట్టండి సారూ.. కొట్టేసుకోండి సారూ..’’ అంటూ బదులిచ్చారు. వాసుదేవరావు పక్కన ఉన్న ఆయన కుమారుడు కూడా మండల ఇంజినీరింగ్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా అక్కడే ఉన్న జన్మభూమి కమిటీ సభ్యులు, అధికారులు మిన్నకుండిపోయారు. కొంతసేపటి తరువాత ఇరువురికీ సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయితే వాసుదేవరావు దుర్భాషలాడడంతో మనస్తాపానికి గురైన మండల ఇంజినీరింగ్ అధికారి.. ఈ విషయాన్ని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి దృష్టికి, ఉద్యోగ సంఘ నాయకులు దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం. అనంతరం దీనిపై తగు నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.
Advertisement