ఏలూరు సిటీ : సబ్సిడీ సొమ్ము మళ్లింపుపై విచారణ జరిపి 48 గంటల్లో నివేదిక సమర్పించాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ అదనపు జేసీ ఎంహెచ్ షరీఫ్‌ను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురు ఫోన్ ద్వారా తెలిపిన సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.
–ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏడాది క్రితం తనకు రూ.లక్ష రుణం మంజూరు కాగా ఈ మొత్తాన్ని తన బ్యాంకు ఖాతాలో కాకుండా మునిసిపల్ ఉద్యోగి ఖాతాలో జమచేశారని నిడదవోలు మండలం పురుషోత్తపల్లి గ్రామానికి చెందిన సాలి జ్యోతి అనే మహిళ ఫిర్యాదు చేశారు. తనకు మంజూరైన సొమ్ములను ఇమ్మని అడిగితే మునిసిపల్ ఉద్యోగి ఖర్చయిపోయిందని చెబుతున్నారని, న్యాయం చేయాలని వేడుకున్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ సబ్సిడీ సొమ్ము ఎవరు మళ్లించారో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ఏజేసీ షరీఫ్‌కు ఆదేశించారు.
– దేవ సహకార సొసైటీలో సొమ్ము డిపాజిట్ చేస్తే తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని పెనుగొండ మండలం ములపర్రు గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
–తణుకు 25వ వార్డుకు చెందిన ఉంగరాల ముత్యాలరావు మాట్లాడుతూ కాపు రుణం సబ్సిడీ సొమ్ము ఏడాది నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంకు విడుదల చేయడం లేదని చెప్పగా ఎల్‌డీఎం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
–ఏలూరు వన్‌టౌన్‌లోని ఎస్‌బీఐ బ్యాంకులో తనకు జీరో బ్యాలెన్స్ ఖాతా ఉండగా హోల్డ్‌లో పెట్టారని ఏలూరు నుంచి మణిప్రియాంక ఫిర్యాదు చేశారు.
–తాను స్మార్ట్ పల్స్ సర్వే చేసినందుకు రావాల్సిన వేతన బకాయిలు ఇవ్వలేదని తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామానికి చెందిన గెడ్డం రాంబాబు కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. 2 గంటల్లోగా సొమ్ము చెల్లించాలని కొవ్వూరు ఆర్డీవోను ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఝాన్సీరాణి, ఎల్‌డీఎం ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలత, మైనార్టీ కార్పొరేషన్ అధికారి సుబ్రహ్మణ్యశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
వ్యాపారాలు చేసేందుకు రుణాలు
జిల్లాలో పేదలు వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలు అందిస్తామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్‌లో సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆయన సమీక్షించారు. 137 వృత్తుల్లో శిక్షణనిచ్చి సబ్సిడీ రుణాలను అందిస్తామని, దీంతో వ్యాపారం చేసుకుని ఎదగాలని సూచించారు. 2016–17లో 2 వేల మంది బీసీలకు రూ.20 కోట్ల సబ్సిడీ సొమ్ము అందించాలని లక్ష్యంగా నిర్ణయిస్తే 2017–18 ఆర్ధిక సంవత్సరంలో రూ.22 కోట్లు సబ్సిడీ అందించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. వ్యాపారం పెట్టకుండా సబ్సిడీ రుణాలు పొందే లబ్దిదారులపై చర్యలకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.
రూ.350 కోట్లతో క్రీడా ప్రణాళిక
జిల్లాలో 2017–18 ఆర్థిక సంవత్సరానికి రూ. 350 కోట్ల క్రీడా ప్రణాళికను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లాలో మంజూరైన క్రీడా ప్రాంగణాల నిర్మాణానికి తగు ప్రతిపాదనలను రాష్ట్ర క్రీడా సంస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించామని చెప్పారు. జలక్రీడలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు జంగారెడ్డిగూడెం సమీపంలోని ఎర్రకాలువ ప్రాంతాన్ని ఎంపిక చేశామన్నారు. రూ.8 కోట్ల వ్యయంతో నాలుగు క్రీడా వికాస కేంద్రాలు ప్రభుత్వం మంజూరు చేసిందని, నరసాపురం మండలం మొగల్తూరు, ఉంగుటూరు మండలం భీమడోలు, తణుకు, తాడేపల్లిగూడెంలో ఇండోర్ స్టేడియాలు నిర్మించనున్నట్టు చెప్పారు.
ఆధార్ అనుసంధానం చేయాలి
ఏలూరు సిటీ: జిల్లా జనాభా 39 లక్షల మంది ఉంటే 47,50,472 బ్యాంకు ఖాతాలున్నాయని ఈ ఖాతాలన్నీ ఆధార్‌తో అనుసంధానం చేస్తే నగదురహిత లావాదేవీలు సులభతరం అవుతాయని కలెక్టర్ భాస్కర్ అన్నారు. కలెక్టరేట్‌లో నగదురహిత లావాదేవీల అమలుతీరుపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఇప్పటివరకూ 24 లక్షల 324 ఖాతాలకు మాత్రమే ఆధార్ అనుసంధానమయ్యిందన్నారు. రెండు రోజుల్లో 400 ఆర్టీసీ బస్సుల్లో నగదురహిత టికెట్ ప్రయాణాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో 496 మద్యం దుకాణాలకు గాను 200 చోట్ల నగదురహిత లావాదేవీలు అమలు చేస్తున్నారన్నారు. 108 రైతుబజార్ దుకాణాల్లో కూడా నగదురహిత లావాదేవీల అమలు చేయాలన్నారు.