నగరానికి ఎఫిడ్రిన్ మత్తు | Ephidrin drug production increasing in hyderabad | Sakshi
Sakshi News home page

నగరానికి ఎఫిడ్రిన్ మత్తు

Published Tue, Aug 2 2016 10:21 PM | Last Updated on Fri, May 25 2018 2:29 PM

నగరానికి ఎఫిడ్రిన్ మత్తు - Sakshi

నగరానికి ఎఫిడ్రిన్ మత్తు

సాక్షి, సిటీబ్యూరో: రాజధాని నగరం నియంత్రణ పదార్థాల జాబితాలోకి వచ్చే ఇంటర్మీడియరీ ప్రొడక్ట్‌ ఎఫిడ్రిన్‌ ఉత్పత్తి, స్మగ్లింగ్‌కు అడ్డాగా మారుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వనస్థలిపురం ఆటోనగర్‌లోని ఓ లాడ్జిపై జూన్‌ 2న దాడులు నిర్వహించిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు రూ.5 కోట్ల విలువైన 50 కేజీల ఎఫిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా సోమవారం శంషాబాద్‌ విమానాశ్రయంలో దక్షిణాఫ్రికా వెళ్తున్న ఓ యువకుడి నుంచి 12 కేజీల సరుకును పట్టుకున్నారు. ఇలాంటి ముఠాలు ఇటీవల నగరంలో తరచూ పట్టుబడుతుండటంతో ఈ మాదకద్రవ్యాన్ని నగర శివార్లలోని బల్క్‌ డ్రగ్‌ ఇండస్ట్రీస్, ఖాయిలా పడ్డ పరిశ్రమల్లో ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలోనూ దీని ఉత్పత్తి జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.

సముద్రమార్గంలో సరఫరా...
ఎఫిడ్రిన్‌ సముద్రమార్గంలోనే ఎక్కువగా విదేశాలకు అక్రమ రవాణా అవుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. కంటైనర్లలో ఇతర సరుకుల మధ్య దాచి, దేశం దాటిస్తున్నట్లు సమాచారం. గతంలో పట్టుబడిన ఎఫిడ్రిన్‌ కర్ణాటకలో తయారై హైదరాబాద్‌ మీదుగా ముంబైకి తరలిస్తుండగా పట్టుకున్నారు. ఆటోనగర్‌లో డీఆర్‌ఐ స్వాధీనం చేసుకున్న కేసులోనూ ‘సరుకు’ చెన్నైకి చేరాల్సి ఉంది. వివిధ ప్రాంతాల్లో తయారైన సరుకును ఓడ రేవులు ఉన్న ప్రాంతాలకు తరలించి, కంటైనర్ల ద్వారా దేశాలు దాటించేందుకు అనేక ముఠాలు వ్యవస్థీకృతంగా పని చేస్తున్నట్లు డీఆర్‌ఐ అనుమానిస్తోంది. గతంలో పట్టుబడిన నిందితుల విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలు, లింకులు సైతం ఇందుకు బలాన్నిస్తున్నాయి. సోమవారం చిక్కిన యువకుడు ఏకంగా విమానంలోనే దేశం దాటించేందుకు యత్నించడం గమనార్హం.

లింక్‌ సిస్టమ్‌లో...
ఆగ్నేయాసియా, సౌదీ దేశాల్లో గిరాకీ ఉన్న ఎఫిడ్రిన్‌ తయారీ, అక్రమ రవాణా అంతా లింక్‌ సిస్టమ్‌లో జరిగిపోతోంది. సోమవారం  ఉదంతాన్నే తీసుకుంటే ఆటోనగర్‌లోని లాడ్జి వద్దకు వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి 50 కేజీ ఎఫిడ్రిన్‌ను కార్టన్‌ బాక్సుల్లో పార్శిల్‌ చేసి తీసుకువచ్చి పట్టుబడిన ఇరువురికీ అందించాడు. వారు దానిని చెన్నై తీసుకువెళ్లి మరో వ్యక్తికి అప్పగించాలి. తమకు ‘సరుకు’ ఇచ్చిన వారి వివరాలు, తాము ఇవ్వబోతున్న వారి వివరాలు కానీ ఈ దళారులకు తెలీదు. కేవలం ‘పై నుంచి’ వచ్చే ఆదేశాలు, సూచనలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది. ఇలా లింక్‌ సిస్టంలో దందా చేయడం ద్వారా ఎవరు పట్టుబడినా... చైన్‌ అక్కడితో తెగిపోయి సూత్రధారులు సేఫ్‌గా ఉండిపోతున్నారని డీఆర్‌ఐ అధికారులు పేర్కొంటున్నారు.

రూ. వేల నుంచి రూ.లక్షల్లోకి...
మనదేశంలో అంతగా డిమాండ్‌ లేని ఈ మాదకద్రవ్యం ధర కేవలం రూ.వేలల్లోనే ఉండటంతో పట్టుబడిన ప్రతి ముఠా దగ్గరా కేజీల లెక్కల స్వాధీనమవుతోంది. అయితే దళారుల చేతులు మారే సరికి దీని ధర రూ.లక్షల్లోకి  చేరుతోంది. ఇక్కడ రహస్యంగా తయారవుతున్న ఈ కెమికల్‌ కాంపౌండ్‌ను (వివిధ రసాయనాల మిశ్రమం) అక్కడి ముఠాలు వివిధ ప్రాంతాలకు చెందిన దళారులకు కిలో రూ.20 వేల నుంచి రూ.25 వేలకు విక్రయిస్తారు. వీరి చేతుల్లోంచి డ్రగ్‌ స్మగ్లింగ్‌ ముఠాలకు చేరేసరికి కేజీ ధర రూ.50 వేల నుంచి రూ.74 వేలకు చేరుతోంది. వారి నుంచి ఓడరేవు ప్రాంతాల్లోని  డ్రగ్‌ మాఫియా వద్దకు వెళ్తే రూ. లక్ష నుంచి రూ.5 లక్షల వరకు పలుకుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో కేజీ రూ.కోట్లను తాకుతోంది. అవసరాన్ని బట్టి, చేతులు మారిన ముఠాల సంఖ్య పెరిగికొద్దీ ఈ డ్రగ్‌ ధర పెరుగుతూనే ఉంటోంది.

నేరుగా వాడటం కుదరదు...
ఎఫిడ్రిన్‌ను ఇంటర్మీడియరీ ఫార్మా ప్రొడక్ట్‌గా పిలుస్తారు. సూడో ఎఫిడ్రిన్‌ను  సిములెంట్‌గా వినియోగిస్తారు. ఇది నేరుగా మాదకద్రవ్యం కాదు. బల్క్‌ డ్రగ్‌ ఇండస్ట్రీస్‌లో డిడక్షన్‌ అనే రసాయన ప్రక్రియ ద్వారా యాంఫిడమైన్, మెటా యాంఫిడమైన్‌గా మారుస్తారు. వీటిని మాత్రమే మాదకద్రవ్యాలుగా వినియోగిస్తారు. గతంలో కేవలం ఈ రెండూ మాత్రమే నియంత్రణ పదార్థాలుగా ఉండేవి. ఆపై ఎఫిడ్రిన్‌ను సైతం ఈ జాబితాలో చేర్చారు. దేశంలోని అనేక దివాళా తీసిన, సెకండ్‌ గ్రేడ్, లైసెన్స్‌లేని బల్క్‌ డ్రగ్‌ కంపెనీలు వీటిని తయారు చేస్తున్నాయి. దీనిని రాష్ట్రంలో వినియోగించిన దాఖలాలు అధికారికంగా లేనప్పటికీ...  ఆగ్నేయాసియా, సౌదీ దేశాలకు అక్రమంగా పెద్ద ఎత్తున రవాణా అవుతోంది.

గతంలో చిక్కిన కేసులివీ...
► 2009లో డీఆర్‌ఐ అధికారులు హైదరాబాద్‌తోపాటు కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో ఏకకాలంలో దాడులు నిర్వహించి 400 కేజీల ఎఫిడ్రిన్‌ను పట్టుకున్నారు.
► సైబరాబాద్‌ పోలీసులు 2010లో ఓ సినీ నిర్మాతతో పాటు అతడి అనుచరుడినీ అరెస్టు చేసి 25 కేజీల సరుకు స్వాధీనం చేసుకున్నారు.
►  డీఆర్‌ఐ అధికారులు 2012లో ఏపీ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఇద్దరి నుంచి 65 కేజీల ఎఫిడ్రిన్‌ స్వాధీనం చేసుకున్నారు.
► 2014లో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, సైబరాబాద్‌ పోలీసులు చౌటుప్పల్, హయత్‌నగర్‌ల్లో  దాడుల్లో 300 కేజీల ఎఫిడ్రిన్‌ స్వాధీనమైంది.
► 2015లో దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు లిబర్టీ చౌరస్తా వద్ద పట్టుకున్న ముఠా నుంచి ఎల్‌ఎస్‌డీతో పాటు ఎఫిడ్రిన్‌ స్వాధీనం చేసుకున్నారు.
► డీఆర్‌ఐ అధికారులు గత జూన్‌ 2న ఆటోనగర్‌లో, సోమవారం శంషాబాద్‌ విమానాశ్రయంలో ఎఫిడ్రిన్‌ స్వాధీనం చేసుకున్నారు.
► రాజధానిలో ఈ మాదకద్రవ్యాలను తయారు చేస్తున్న ఆరోపణలపై గతంలో మూడు సంస్థలను డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు సీజ్‌ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement