కార్మికుల కడుపు కొట్టొద్దు
కార్మికుల కడుపు కొట్టొద్దు
Published Mon, Jul 3 2017 11:35 PM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM
– సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
– ఈఎస్‌ఐ, పీఎఫ్ తదితర సౌకర్యాలు కల్పించాలి
– సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డిమాండ్
- కలెక్టరేట్ ఎదుట మహాధర్నాకు భారీగా తరలివచ్చిన కార్మికులు
కర్నూలు (న్యూసిటీ) : ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను సవరించి కార్మికులు కడుపుకొట్టొద్దని సీఐయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామాంజనేయులు ప్రభుత్వాలకు సూచించారు. కార్మికుల డిమాండ్లపై ఆయూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నాగరాజు అధ్యక్షత వహించిన ఈ ధర్నాకు జిల్లాలోని అసంఘటిత రంగ, ఆశ, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ కార్మికులందరికీ కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ, పెన్షన్ తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.నిర్మలమ్మ మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వివిధ ప్రభుత్వ పథకాల్లో పనిచేసే కార్మికులు సరైన వేతనం అందక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ఇస్కాన్ సంస్థకు కట్టబెడితే సహించమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.నాగేశ్వరరావు మాట్లాడుతూ హమాలీ, ట్రాన్స్‌పోర్ట్, బీడీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి హౌసింగ్‌డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ఉద్యోగులును తీసి వేస్తున్నారని మండిపడ్డారు.
బెల్టుషాపులను ఎత్తివేస్తామని చెప్పి వీధికో మందు దుకాణం పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఆటో డ్రైవర్లపై దాడులను ఆర్‌టీఏ, పోలీసు, ఆర్‌టీసీ అధికారుల దాడులను ఆపాలని మోటర్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాన్ డిమాండ్ చేశారు. అనంతరం కార్మికులు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత డీఆర్‌ఓ గంగాధర్‌గౌడ్‌ను కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ధర్నాలో సీఐటీయూ నాయకులు గౌస్‌దేశాయ్, పుల్లారెడ్డి, సుబ్బయ్య, రాముడు, గోపాల్, రాజశేఖర్, అంజిబాబు, అంగన్‌వాడీ వర్కర్ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి షబానా, ఆశా వర్కర్ల యూనియన్ నాయకుడు చంద్రుడు, సుధాకరప్ప, విజయ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement