పోలీస్ స్టేషన్ నుంచి పారిపోతుండగా ప్రమాదం
Published Mon, May 8 2017 12:19 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
– ట్రాక్టర్ ఢీకొని నిందితునికి తీవ్ర గాయాలు
– పోలీసుల అదుపులో ట్రాక్టర్ డ్రైవర్
– చికిత్స ఖర్చుల భారం మొత్తం అతనిపైనే
కర్నూలు: పోలీస్ స్టేషన్‌కు ఎవరు వస్తున్నారు.. వారి పనేంటి.. అనే విషయాలపై అక్కడ ఉండే సిబ్బంది నిత్యం పర్యవేక్షణ ఉండాలి. కానీ నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్‌లో దొంగలు పారిపోతున్నా పట్టించుకునే వారు కరువయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పంచాయితీలపై ఉన్న శ్రద్ధ స్టేషన్‌లకు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆదివారం తెల్లవారుజామున పోలీసుల కళ్లగప్పి స్టేషన్ నుంచి దొంగ పరారైన సంఘటన సంచలనంగా మారింది. శనివారం రాత్రి కొత్తబస్టాండు పరిసర ప్రాంతాల్లో నలుగు జేబు దొంగల(అనుమానితులు)ను నాల్గో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి వారిదైన శైలిలో ట్రీట్‌మెంటు ఇచ్చి విచారణ జరిపారు. అందులో ఒక నిందితుడు తెల్లవారుజామున పారిపోతూ పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అనంతపురం పట్టణానికి చెందిన శ్రీనివాసులు కుమారుడు ఈశ్వరయ్య (30) కొలిమిలో పని చేస్తూ జీవనం సాగించేవాడు. కొంతకాలంగా కర్నూలులోని బస్టాండు పరిసర ప్రాంతాల్లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. జేబు దొంగగా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకోగా స్టేషన్ నుంచి పారిపోయే ప్రయత్నంలో ప్రమాదానికి గురయ్యాడు.
నిడ్జూరు గ్రామానికి చెందిన ఏపీ 21 టీజడ్ 3773 ట్రాక్టర్ ఢీ కొనడంతో తలకు, మొహానికి తీవ్ర గాయాలకు గాలయ్యాయి. వెంటనే పోలీసులు అప్రమత్తమై అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు. ట్రాక్టర్ డ్రైవర్ సురేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. గాయాలకు గురైన ఈశ్వరయ్య దగ్గర ఆరుగురు పోలీసులు ఉండి వైద్య చికిత్సలు చేయిస్తున్నారు. అయితే ఈ విషయం బయటికి పొక్కకుండా పోలీసులు గోప్యంగా ఉంచారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఈశ్వరయ్యకు ప్రస్తుతం న్యూరో సర్జరీ వార్డులో చికిత్స చేస్తున్నారు.
ఖర్చుల భారమంతా ట్రాక్టర్ యజమాని కానీ, డ్రైవర్ కానీ భరిస్తేనే వదులుతామంటూ పోలీసులు ఇప్పటికే బేరం కుదుర్చుకున్నారు. పోలీసుల దెబ్బలు తాళలేకనే ఈశ్వరయ్య పారిపోతూ ప్రమాదానికి గురయ్యాడు. మూడు రోజుల క్రితం కూడా ఇదే స్టేషన్ నుంచి నరేష్ అనే దొంగ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. స్టేషన్‌లో సిబ్బంది నిఘా సక్రమంగా లేకపోవడం వల్లే తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. గుజిరి వ్యాపారి కర్ణ కోసం అనంతపురం నుంచి కర్నూలుకు వచ్చినట్లు ఈశ్వర్య తెలిపారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.
Advertisement