
ఇళ్ల మద్యరణ రంగం
►జిల్లావాసుల ఆందోళనబాట
►అధికారుల తీరుపై కన్నెర్ర
►పలుచోట్ల నిరసనలు
►భీమవరంలో విద్యార్థుల రాస్తారోకో
►ఎక్సైజ్ సీఐని నిలదీసిన మహిళలు
ఏలూరు : ఇళ్ల మధ్య మద్యం దుకాణాల ఏర్పాటుపై సోమవారం జిల్లావాసులు కన్నెర్ర చేశారు. సర్కారు, అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. పలు చోట్ల మహిళలు దుకాణాల ఏర్పాటును అడ్డుకున్నారు. రోడ్లపై బైఠాయించి సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భీమవరం బైపాస్ రోడ్డులో ఆలయాల ఎదురుగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించాలంటూ మహిళలు ధర్నా చేపట్టారు. ఆ సమీపంలోనే సిద్ధార్థ ఐటీఐ కళాశాలకు ఎదురుగా ఏర్పాటు చేసిన మరో మద్యం దుకాణ కూడా తొలగించాలంటూ విద్యార్థులు రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ సీఐ కేబీఎల్ రామరాజు అక్కడికి చేరుకుని మహిళలతో చర్చించారు. చివరకు దేవాలయం ఎదురుగా ఉన్న మద్యం దుకాణాన్ని తొలగిస్తామని ఎక్సైజ్ సీఐ హామీ ఇవ్వడంతో మహిళలు ధర్నా విరమించారు.
విద్యార్థులు కూడా తమ కళాశాల ఎదురుగా ఉన్న దుకాణం తొలగించాలని ఎక్సైజ్ సీఐని పట్టుబట్టారు. ఆచంట మండలం కొడమంచిలిలోనూ మహిళలు నిరసన వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెం గ్రామంలోనూ సుమారు 150 మంది మహిళలు ఆందోళన చేశారు. పెంటపాడు మండలం కె.పెంటపాడు గ్రామంలో మూడు రోజులుగా స్థానికులు ఆందోళన చేస్తున్నారు. సోమవారం ఏలూరు కలెక్టరేట్‌లో జరిగిన మీ కోసం కార్యక్రమంలో ఫిర్యాదు చేయడానికి వచ్చారు. ఉండి బాలాజీరావుపేటలో ఇళ్ల మధ్య దుకాణం ఏర్పాటును వందమంది మహిళలు అడ్డుకున్నారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. నరసాపురం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో జరిగిన మీకోసం కార్యక్రమానికీ ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు పెట్టవద్దంటూ వినతులు వెల్లువెత్తాయి.
గతంలోనూ ఆందోళనలు
ఇరగవరం మండలం తూర్పువిప్పర్రు లో మద్యం షాపు వద్దంటూ ఇటీవల మహిళలు ఆందోళనలకు దిగారు. అత్తిలి మండలం గోగులమ్మపేటలోనూ గతంలో మహిళలు నిరసన వ్యక్తం చేశారు. పెరవలి మండలంలోనూ మూడురోజుల క్రితం ఆందోళనలు మిన్నంటాయి. మద్యం షాపులు తొలగించే వరకు పోరాటం చేస్తామని, ఒకవేళ తొలగించడానికి ప్రభుత్వం యత్నించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలకు సీపీఎం, ప్రజా సంఘాలు నాయకత్వం వహించాయి.