వెలిగొండ.. అంచనాల కొండ | Estimates in the Wellgunda project range | Sakshi
Sakshi News home page

వెలిగొండ.. అంచనాల కొండ

Published Thu, Aug 3 2017 1:21 AM | Last Updated on Sun, Sep 17 2017 5:05 PM

వెలిగొండ.. అంచనాల కొండ

వెలిగొండ.. అంచనాల కొండ

ఒంగోలు : వెలిగొండ ప్రాజెక్ట్‌ పరిధిలో అంచనాలు పెంచుకొనే విషయంలో ప్రభుత్వం చూపించే శ్రద్ధ పనులు పూర్తి చేయడంలో చూపించడం లేదు. 2017 నాటికే పనులు పూర్తిచేసి జిల్లా వాసులకు సాగు, తాగునీరందిస్తామని ప్రకటించిన చంద్రబాబు సర్కారు ఇప్పుడు మాటమార్చి 2018 నాటికి నీరంటోంది.  పనుల  తీరుచూస్తే మరో పదేళ్లకు కూడా ప్రాజెక్టు పూర్తయ్యేలా కనిపించడంలేదు. ప్రాజెక్టు అంచనాలను  భారీగా పెంచుకొని ఆర్థిక లబ్ధి పొందేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 2013–14 ప్రారంభంలో రూ.5,150 కోట్ల అంచనాలతో ప్రాజెక్టును ప్రారంభించారు. తాజాగా ఈ అంచనాలను రూ.7,784 కోట్లకు పెంచుతూ ప్రాజెక్టు అధికారులు ప్రభుత్వానికి ఫిబ్రవరిలో ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే అంచనాలను పెంచుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నేడో, రేపో ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలుపనుంది.

భారీగా పెంచుకున్న అంచనాలు..
ప్యాకేజీ–1 నుంచి ప్యాకేజీ–6 వరకు వివిధ రకాల పనుల అంచనాల విలువ కోట్లాది రూపాయలు పెరిగిపోయింది. ప్యాకేజీ–1లో టన్నెల్‌–1 పనులు గత అంచనాల కంటే రూ.306.39 కోట్లు అదనంగా పెంచారు. ప్యాకేజీ–2లో తీగలేరు ఫీడర్‌ కెనాల్‌ పనులు రూ.433.5 కోట్ల మేర పెంచారు. ప్యాకేజీ–3 పరిధిలోని గొట్టిపడియ అంచనాలను రూ.100 కోట్లు పెరిగాయి.ప్యాకేజీ–4 పరిధిలోని తూర్పు ప్రధాన కాలువ (కాకర్ల డ్యామ్‌) అంచనాలు ఏకంగా రూ.690 కోట్లు పెంచడం గమనార్హం. ప్యాకేజీ–5 పరిధిలో టన్నెల్‌–2 పాత అంచనాలు రూ.296 కోట్లు, ప్యాకేజీ–6లోని తూర్పు ప్రధాన కాలువ అంచనాలను రూ.313 కోట్లు, ప్యాకేజీ–7లో పశ్చిమ ఉపకాలువ రూ.220 కోట్ల మేర అదనంగా పెరిగింది. మొత్తంమీద రూ.2,634 కోట్లు అదనంగా పెంచారు. పనులపైనా రూ.1159 కోట్లు పెంచగా భూసేకరణ పైనా రూ.970 కోట్లు పెంచారు. కేవలం రూ.58 కోట్లున్న ఆర్‌.ఆర్‌. పనులపైన రూ.489 కోట్లు పెంచారు. థర్డ్‌ పార్టీ క్వాలిటీ కంట్రోల్‌లో సైతం రూ.16 కోట్లు పెంచారు.

మొదలు కాని హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు..
వెలిగొండ ప్రాజెక్టు కోసం 41,408 ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉండగా 24,908 ఎకరాలు మాత్రమే సేకరించారు. వెలిగొండ పరిధిలో 11 ముంపు గ్రామాలుండగా 2006 నుంచి ఇప్పటి వరకు ఐదు గ్రామాలకు మాత్రమే ఆర్‌.ఆర్‌. సెంటర్లు గుర్తించారు. ఇంకా ఆరు గ్రామాలను గుర్తించాల్సి ఉంది. గిద్దలూరు, మార్కాపురం ప్రాంతాల్లో కోర్టు కేసులున్నా వాటిపై శ్రద్ధ పెట్టలేదు. వెలిగొండ ప్రాజెక్టుకు నీటిని చేర్చే హెyŠ æరెగ్యులేటర్‌ పనులను ఇంత వరకు మొదలు పెట్టకపోవడం గమనార్హం. తాజాగా రూ.95 కోట్లతో హెడ్‌రెగ్యూలేటర్‌ పనులు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అది కూడా నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీకి చెందిన కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడికి సింగిల్‌ టెండర్‌ ఆమోదించింది. వాస్తవానికి హెడ్‌ రెగ్యులేటర్‌ నిర్మించే ప్రాంతంలో ప్రస్తుతం పనులు చేసే పరిస్థితి లేదు.

అక్కడ వసతి లేదు. ఒక వైపు శ్రీశైలం రిజర్వాయర్‌ బ్యాక్‌ వాటర్, మరో వైపు ఫారెస్ట్‌. పట్టుమని రెండు ఎకరాల స్థలం కూడా పనులు జరిగే ప్రాంతంలో లేదు. హెడ్‌ రెగ్యులేటర్‌తో పాటు టన్నెల్‌ పనులను అటు వైపు నుంచి చేపడుతున్నట్లు అధికారులు ఆర్భాటంగా ప్రకటించారు. అదే జరిగితే పనులకు సంబంధించిన మట్టిని ఎక్కడికి తరలించాలో తెలియని పరిస్థితి. ఫారెస్ట్‌లో వేద్దామంటే ఇప్పటికీ అటవీశాఖ అనుమతి లేదు. అనధికారికంగా ఫారెస్ట్‌ అధికారులతో ప్రాజెక్టు అధికారులు ఒప్పందానికి వచ్చే ప్రయత్నానికి దిగినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్‌ ద్వారా వారికి అనధికారికంగా డబ్బులు ముట్టజెప్పే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ప్రచారం సాగుతోంది. పేరుకు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్‌ ఇప్పట్లో పని చేసే పరిస్థితి కానరావడం లేదు. మొబలైజేషన్‌ అడ్వాన్సుల పేరుతో అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్‌కు ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకు హెడ్‌రెగ్యూలేటర్‌ టెండర్లు పిలిచినట్లు ఇరిగేషన్‌ అధికార వర్గాల్లోనే చర్చ జరుగుతుండటం గమనార్హం. ఈ లెక్కన వెలిగొండ పనులు ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement