మితిమీరుతున్న పోకిరీలు
– కళాశాలల ఎదుట వెకిలిచేష్టలు
– తట్టుకోలేకపోతున్న విద్యార్థినులు
– పట్టించుకోని పోలీసులు
అనంతపురం సెంట్రల్ : అనంతపురంలో వారం రోజుల క్రితం కళాశాల ముగించుకొని ఇంటికి వెళుతున్న ఓ విద్యార్థిని (పేరు రాయలేదు) అంబేడ్కర్ విగ్రహం వద్ద కొంతమంది ఆకతాయిలు కామెంట్ చేశారు. ఆ అమ్మాయి పట్టించుకోకపోవడంతో ఆ రోజు నుంచి అమ్మాయికి వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ విషయం ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఏకంగా కళాశాలనే మాన్పించారు.
నగరంలో పోకిరీల ఆగడాలు మితిమీరుతున్నాయి. ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలల ఎదుట వారి చేష్టలు అంతా ఇంతా కాదు. విద్యార్థినులు వారి ముందు నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. విద్యార్థినులు బయటకు చెప్పుకోలేక తీవ్రంగా కలత చెందుతున్నారు. పోకిరీలకు కళ్లెం వేయాల్సిన కళాశాల యాజమాన్యాలు, పోలీసులు పెద్దగా దష్టి సారించకపోవడంతో వారి ఆగడాలకు అడ్డే లేకుండాపోతోంది. ముఖ్యంగా ఎస్పీ కార్యాలయం ఎదుట ఉన్న ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల, కేఎస్‌ఆర్ ప్రభుత్వ కళాశాల ఎదుట పోకీరీలు తిష్టవేస్తున్నారు. జీసస్‌నగర్, అరవిందనగర్, ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉన్న పలు ప్రైవేటు కళాశాలల వద్ద కూడా ఈ సమస్య తీవ్రంగా ఉంది.
సీసీ కెమెరాల ఏర్పాటుతో సమస్య పరిష్కారం
నగరంలో ట్రాఫిక్ సమస్యను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లలో వీటిని అమర్చారు. ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటి ఆధారంగా నిఘా కఠినతరం చేస్తే ఈవ్‌టీజింగ్ సమస్యకు చెక్ పడుతుందనే అభిప్రాయం విద్యార్థినుల నుంచి వినిపిస్తోంది. అయితే ఇంత వరకూ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. కనీసం కళాశాలల్లో ఫిర్యాదుల బాక్సును ఏర్పాటు చేస్తే అందులోనైనా విద్యార్థినులు వారి సమస్యలను చెప్పుకునేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ కళాశాలల యాజమాన్యాలు ఈ అంశంపై దష్టి సారించడం లేదు.
నిఘా పట్టిష్టం చేస్తాం
కళాశాలల వద్ద పోకిరీల ఆగడాలను అరికట్టేందుకు పోలీసులు ఏదో ఒక సమయంలో పరిశీలిస్తున్నారు. నిఘా ఇంకా పటిష్టపర్చేందుకు చర్యలు తీసుకుంటాం. విద్యార్థినులు వారి సమస్యలు చెప్పుకునేందుకు ప్రత్యేకంగా ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేయిస్తా. వారి ఫిర్యాదుల ఆధారంగా పోకిరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నాం.
– మల్లికార్జునవర్మ, డీఎస్పీ, అనంతపురం