హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో.... జిల్లాల పునర్ విభజనపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. అందులోభాగంగా వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్లలో బంద్ జరగుతుంది. ప్రత్యేక జిల్లా కోసం వికారాబాద్లో మాజీ మంత్రి చంద్రశేఖర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష బుధవారం రెండో రోజుకు చేరింది. ఆయన 19 మండలాలతో కూడిన వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ధారూర్ మండలంలో కెరెల్లిలో రాస్తారోకో కొనసాగుతుంది. వికారాబాద్, తాండూరు, పరిగిలోని ఆర్టీసీ డిపోలకు తాళాలు వేశారు. గత మూడు రోజులుగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. చేవెళ్లను జిల్లా కేంద్రంగా చేయాలంటూ స్థానిక ప్రజలు చేపట్టిన ఆందోళనలు బుధవారం నాలుగోరోజుకు చేరాయి. చేవెళ్లలో 144 సెక్షన్ అమలులో ఉంది.