తిరుపతి కార్పొరేషన్, న్యూస్‌లైన్: ఏపీ ఎన్జీవోల సంఘం సోమవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపు ఇవ్వడంతో ఏపీ ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులు కూడా సమ్మెకు దిగుతున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆటంకం కలగకుండా చూసేందుకు తిరుపతి ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయంలో ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులతో తిరుమల జేఈవో శ్రీనివాసరాజు చర్చలు జరిపారు. ఆయన మాట్లాడుతూ తాము సమ్మెకు వ్యతిరేకం కాదని, తిరుమలకు వచ్చే భక్తులు దాదాపు 70 శాతం మంది ఆర్టీసీ బస్సుల్లో వస్తుంటారని చెప్పారు.
ఎక్కడెక్కడి నుంచో వ్యయప్రయాసలకోర్చి వచ్చే భక్తులకు సమ్మె ద్వారా కష్టం కలిగించకుండా చూడాల్సిన బాధ్యత మనందరి కర్తవ్యమన్నారు. అలిపిరి నుంచి తిరుమలకు నడిచే ఆర్టీసీ బస్సులను సమ్మె నుంచి మినహాయించాలని కోరారు. దీనిపై స్పందించిన నాయకులు ఇది వరకు నిర్ణయించిన మేరకు సమ్మెకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలి పారు. తద్వారా జిల్లాలోని 8,300 మంది ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారని స్పష్టం చేశారు.
ప్రత్యామ్నాయం కష్టమే
ఆర్టీసీ కార్మికులు, టీటీడీ ఉద్యోగులు సమ్మెకు దిగనుండటంతో టీటీడీ ఆందోళన చెందుతున్నట్టు జేఈవో శ్రీనివాసరాజు మీడియాతో పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగితే తిరుమలకు వచ్చే 70 శాతం మంది భక్తులకు ప్రత్యామ్నాయం కల్పించలేమన్నారు. తమ వద్ద కేవలం 10 నుంచి 15 శాతం మందికి రవాణా కల్పించేందుకు మాత్రమే సౌకర్యం ఉందని, అది కూడా టీటీడీ ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా ఉంటేనే అని చెప్పారు. జేఏసీ నాయకులు సమ్మె నుంచి తిరుమలకు మినహాయింపు ఇచ్చేది లేదని మీడియాతో చెప్పారు.
సమ్మెను ఉధృతం చేస్తున్న నేపథ్యంలో తిరుమలను మినహాయిస్తే సమ్మె నీరు గారిపోతుందని స్పష్టం చేశారు. జేఈవోతోపాటు చర్చలు జరిపిన వారిలో టీటీడీ ట్రాన్స్‌పోర్టు జీఎం శేషారెడ్డి, ఆర్టీసీ ఆర్‌ఎం మహేశ్వర, జేఏసీ నాయకులు చంద్రయ్య, ప్రభాకర్, బీఎస్‌బాబు (ఎన్‌ఎంయు మజ్దూర్), పీసీబాబు, లతారెడ్డి, తాజుద్దీన్ (వైఎస్‌ఆర్‌టీసీ మజ్దూర్), ప్రకాష్, ఈఆర్ కుమార్, ఎన్‌వీ కుమార్ (ఎంప్లాయిస్ యూనియన్), సీఐటీయూ నేత చంద్ర పాల్గొన్నారు.
సమ్మె నుంచి తిరుమలను మినహాయించండి
Published Mon, Aug 12 2013 2:27 AM | Last Updated on Sat, Mar 23 2019 9:06 PM
Advertisement
Advertisement