ఉపాధా్యయుల సర్దుబాటుకు కసరత్తు
Published Mon, Dec 26 2016 12:40 AM | Last Updated on Mon, Sep 4 2017 11:35 PM
- త్వరలో బదిలీలు
– నేడు డీఈఓకు వివరాలు అందించనున్న డిప్యూటీఈఓలు
కర్నూలు సిటీ: ప్రభుత్వం పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటుకు విద్యాశాఖ కసరత్తు చేపట్టింది. కొరత ఉన్న స్కూళ్లకు అదనంగా ఉన్న పాఠశాలల నుంచి టీచర్లను తాత్కాలిక పద్ధతిలో బదిలీ చేయాలని రాష్ట్ర ప్రాథమిక విద్యా శాఖ కమిషనర్ గతేడాది ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు జిల్లాలో ఏఏ స్కూళ్లలో అదనంగా టీచర్లు ఉన్నారు..ఎక్కడ కొరత ఉందో వివరాలను సేకరించాలని డీఈఓ ఇటీవలే డిప్యూటీ ఈఓలను ఆదేశించారు. కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం ప్రాథమిక పాఠశాలలో 30 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 35 మంది, ఉన్నత పాఠశాలల్లో 40 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చేసి, మిగులు టీచర్లను సమీపంలోని స్కూళ్లకు ఈ విద్యా సంవత్సరం ముగిసేలోపే బదిలీ చేసేందుకు చర్యలు చేపట్టారు. 80 మందికిపైగా విద్యార్థులు ఉన్న ఆదర్శ పాఠశాలల్లో 5 మంది టీచర్లను ఉంచనున్నారు. 240 మంది విద్యార్థులు ఉన్న మాద్యమిక సక్సెస్ స్కూళ్లలో 7 మంది టీచర్లతో పాటు మరో 7 మంది ఉంటారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో అన్ని సబ్జెక్టుల టీచర్లు ఉండాలి. జీతాలు రెగ్యులర్ స్కూల్ నుంచే తీసుకోవాలి. గత నెల 30వ తేది యూడైస్ ప్రకారం విద్యార్థుల సంఖ్యను నిర్ధారించనున్నారు. డీఈఓ ఆదేశాల మేరకు ఇప్పటికే డిప్యూటీ ఈఓలు ఎంఈఓల ద్వారా ఉపాధ్యాయుల వివరాలను సేకరించారు. నేడు ఆ వివరాలను డీఈఓకు అందజేయనున్నారు. అయితే, విద్యా సంవత్సరం మొదట్లో చేపట్టాల్సిన ఉపాధ్యాయుల బదిలీలు మధ్యలో చేపట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలు ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Advertisement