పుష్కరాలపై ఆబ్కారీశాఖ దృష్టి
Published Tue, Aug 9 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
పుష్కరాలపై ఆబ్కారీశాఖ దృష్టి
మహబూబ్‌నగర్ క్రైం: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాబోతున్న కృష్ణా పుష్కరాలలో ఎలాంటి ఇబ్బందికరమైన సంఘటనలకు తావివ్వకుండా జిల్లా అబ్కారీ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనిలో భాగంగానే జిల్లాలో అతి ప్రధానమైన ఘాట్లలలో ఎక్సైజ్ సిబ్బంది నిఘా ఉంచనున్నారు. జిల్లాలో బీచుపల్లి, రంగాపూర్, గొందిమళ్ల, సోమశిల, కృష్ణ, పసుపుల, అలంపూర్ ఇతర ప్రధాన ఘాట్లలలో ఈ శాఖ నుంచి ప్రత్యేక సిబ్బందిని కేటాయించారు. ఇప్పటికే ప్రధాన ఘాట్ల వద్ద ఇద్దరు ఎస్‌ఐలతో పాటు ముగ్గురు మగ, ఇద్దరు ఆడ కానిస్టేబుల్స్‌కు విధులు కేటాయించారు. జిల్లాలో పుష్కర ఘాట్ల వద్ద మద్యం, కల్లు, సారా అమ్మకాలు పూర్తిగా అరికట్టాడానికి అధికారులు భావిస్తున్నారు. దీంతో పాటు పుష్కర ఘాట్‌లకు దాదాపు 500నుంచి 600మీటర్ల సమీపంలో ఉండే మద్యం దుకాణాలు పుష్కర రోజుల సమయంలో పూర్తిగా మూసి వేయడానికి ప్రణాళిక చేస్తున్నారు. దాంతో పాటు ఘాట్ల దగ్గర, జాతీయ రహదారిపై ఎలాంటి మద్యం అమ్మకాలు లేకుండా చేయడానికి ఆ శాఖ చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా పుష్కర ఘాట్లకు వచ్చే భక్తులు ఎవరు కూడా మద్యం, కల్లు, సారా సేవించకుండా ఉండటానికి ఆ శాఖ నుంచి అవగాహన కార్యక్రమాలు చేయాలని చూస్తున్నారు.
కల్తీ ఆహారంపైనా...
జిల్లాలో ఉండే పుష్కర ఘాట్లలలో భక్తుల కోసం చిరు వ్యాపారులు ఏర్పాటు చేసే చిరుతిండ్లలో ఎలాంటి కల్తీ జరగకుండా చూసుకోవడానికి జిల్లా ఆహార కల్తీ నియంత్రణ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీనికోసం ఇప్పటికే వారు ఘాట్ల సందర్శించి కావాల్సిన ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో
కృష్ణా పుష్కరాల సందర్భంగా జిల్లాలో ఉన్న 59ఘాట్లలలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక శాఖ చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా ప్రతి ఘాట్‌లో భక్తులు చివర స్నానం చేసే వరకు ఘాట్‌లో ఉండి చివరగా ఘాట్‌ను మొత్తం వారు గాలిస్తారు. దీనికోసం ప్రత్యేక తాళ్లను ఉపయోగించనున్నారు. జిల్లాలో పని చేయడానికి 351మంది సిబ్బంది, 41ప్రత్యేక అధికారులు, 21వాహనాలు, 4అత్యధునిక బోట్లను ఏర్పాటు చేశారు.
Advertisement