
సమావేశంలో మాట్లాడుతున్న మల్లికార్జున్‌గౌడ్
- జిల్లా ఏర్పాటుపై సర్వసభ్య సమావేశంలో సభ్యుల ఏకగ్రీవ తీర్మానం
- రియల్ వ్యాపారుల ఆక్రమాలకు చెక్ పెడతాం
- శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులు విఫలం
- మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్
మెదక్ మున్సిపాలిటీ: ప్రజల ఆకాంక్ష మేరకు మెదక్ జిల్లాను ఏర్పాటు చేయాలని మున్సిపల్‌చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్‌తోపాటు సభ్యులంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ ఆ«ధ్యక్షతన కౌన్సిల్ సర్వసభ్య సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కౌన్సిలర్ మధుసూదన్‌రావు మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసమే జిల్లాను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మెదక్ పట్టణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన జిల్లాను రాజకీయ కోణాల్లో కాకుండా భౌగోళికంగా, శాస్త్రీయ పరంగా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలని కౌన్సిల్ సభ్యులు కోరారు.
దీంతో సభ్యులంతా ఆమోదం పలికారు. అనంతరం చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ మాట్లాడుతూ బల్దియాలో ఆస్తిపన్నులు, నల్లా బకాయిలు కుప్పలు, తెప్పలుగా పేరుకు పోయాయని, అధికారులు బకాయిలు వసూలు చేసి పట్టణాభివృద్ధికి తోడ్పాడాలని అధికారులను ఆదేశించారు.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద పట్టణానికి ఎల్‌ఈడీలైట్లు మంజూరయ్యాయని, వాటిని మొదటి దశలో నర్స్‌ఖేడ్, ఫతేనగర్ వీధుల్లో ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం కౌన్సిలర్ రాధ మాట్లాడుతూ పట్టణంలో కుక్కలు, కోతుల బెడద తీవ్రంగా ఉందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన చైర్మన్ తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కౌన్సిలర్ మధుసూదన్‌రావు మాట్లాడుతూ పట్టణంలో రియల్ వ్యాపారులు ఇష్టారాజ్యంగా అక్రమ వెంచర్లు ఏర్పాటు చేస్తూ చెలరేగిపోతూ అడ్డగోలుగా రేట్లకు భూములను విక్రయిస్తున్నారని ఆరోపించారు. వాటిపై ప్రత్యేక దృష్టి సారించి, తగు చర్యలు తీసుకుంటామని, అలాంటివి తమ దృష్టికి తీసుకురావాలని మున్సిపల్‌చైర్మన్ తెలిపారు.
పట్టణంలో శానిటేషన్ వ్యవస్థ అస్తవ్యస్థంగా తయారైందని, ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో వ్యాధులు ప్రబలుతున్నాయని కౌన్సిలర్ రబ్బీన్ దీవాకర్ సమావేశంలో మండిపడ్డారు. 14వ వార్డులో మట్టి కుప్పలను, పిచ్చి మొక్కలను తొలగించాలని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
స్పందించిన చైర్మన్ 14వార్డులో నెలకొన్న పిచ్చి మొక్కలను, మట్టికుప్పలను తొలగించాలని శానిటేషన్ అధికారులను ఆదేశించారు. అనంతరం 1వ వార్డు కౌన్సిలర్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ కౌన్సిలర్లకు అధికారులు కనీస ప్రోటోకాల్ పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని మున్సిపల్‌చైర్మన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
శాంతి, భద్రతలు లోపిస్తున్నాయి
పట్టణంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపిస్తున్నాయని కౌన్సిలర్ బట్టి సులోచన ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది వ్యక్తులు వారి వ్యక్తిగత పోకడల కోసం యువకులను రెచ్చగోడుతూ దాడులు చేయిస్తున్నారన్నారు. వీరికి పోలీసులు సైతం మద్దతు పలుకుతున్నారన్నారు. గతంలో తన కుమారుడిపై కూడా హత్యాయత్నం జరిగిందని ఆమె గుర్తు చేశారు. శాంతి భద్రతల విషయంలో తగు చర్యలు చేపట్టకుంటే తానే నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు.
ఈ విషయంపై చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ మాట్లాడుతూ పట్టణంలోని శాంతిభద్రతల విషయాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు చేపడుతామని తెలిపారు. సమావేశంలో వైస్‌చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు ఆర్కెశ్రీనివాస్, చంద్రకళ, లక్ష్మి, గాయత్రి, కో అప్షన్ సబ్యులు గంగాధర్, కమిషనర్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.