వైభవంగా పీరుల్లామాలిక్ గంధోత్సవం
కడప కల్చరల్:
కడప పెద్దదర్గాలో విశిష్ఠ ఖ్యాతి గాంచిన హజరత్ సయ్యద్‌షా పీరుల్లామాలిక్ సాహెబ్ గంథోత్సవం వైభవంగా నిర్వహించారు. గురువులు సజీవ సమాధి అయిన సందర్భంగా దర్గా ప్రాంగణాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. ముఖ్యంగా ప్రధాన మజార్ గల భవనాన్ని మొత్తం పలు రకాల, రంగుల పూలతో కనుల పండువగా అలంకరించారు. బుధవారం ఉదయం దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ ప్రత్యేక ప్రార్థనలు చేసి పవిత్ర జలాన్ని భక్తులకు అందజేశారు. రాత్రి ప్రధాన గురువుల మజార్ వద్ద ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దర్గా ప్రతినిధులు వారికి ప్రసాదాలను అందజేశారు.