ఆర్టీసీకి పండగే!
ఆర్టీసీకి పండగే!
Published Mon, Sep 18 2017 12:23 AM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM
దసరా ఎఫెక్ట్
22 నుంచి ప్రత్యేక సర్వీసులు
రిజర్వేషన్లు ప్రారంభం
టిక్కెట్‌పై 50 శాతం అధిక చార్జీ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) :
ఆర్టీసీకి పండగొచ్చింది. దసరా సెలవుల ఈనెల 22 నుంచి ప్రత్యేక సర్వీసులు నడపనుంది. దీనికోసం ఇప్పటి నుంచే రిజర్వేషన్లు ప్రారంభించింది. టికెట్‌పై 50శాతం అధిక చార్జీ వసూలుకు సిద్ధపడింది.
ఉమ్మడి రాజధాని నుంచి 60 బస్సులు..
దసరా సెలవుల సందర్భంగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి జిల్లాకు వచ్చే ప్రయాణికులు ఎక్కువగా ఉంటారనే అంచనాతో ఆర్టీసీ అధికారులు 60 బస్సులను సిద్ధం చేశారు. తొలుత ఆ బస్సులను ఇక్కడి నుంచి సర్వీసు చేసుకుంటూ హైదరాబాద్ తీసుకెళ్లి తిరుగు ప్రయాణంలో ముందుగా రిజర్వేషన్ చేసుకున్న అక్కడి ప్రయాణికులను ఇక్కడికి తీసుకువచ్చేలా ప్రణాళిక రూపొందించారు. నిత్యం హైదరాబాద్‌కు జిల్లాలోని ఏలూరు డిపో నుంచి 12, జంగారెడ్డిగూడెం డిపో నుంచి 4, తాడేపల్లిగూడెం డిపో నుంచి 3, భీమవరం డిపో నుంచి 4, నరసాపురం డిపో నుంచి 5 మొత్తం 28 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. పండగ సందర్భాల్లో అవిచాలకపోవడంతో ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేస్తున్నారు.
22 నుంచి ప్రారంభం..
ఈ నెల 21వ తేదీ నుంచి విద్యా సంస్థలకు దసరా సెలవులు ప్రకటించడంతో 22వ తేదీ నుంచి ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఈ నెల 22వ తేదీ నుంచి 30వ వరకూ ఏలూరు డిపో నుంచి 16, జంగారెడ్డిగూడెం డిపో నుంచి 13, తాడేపల్లిగూడెం డిపో నుంచి 4, భీమవరం డిపో నుంచి 18, నరసాపురం డిపో నుంచి 9 బస్సులను తిప్పనున్నారు.
గత ఏడాది రూ.26.76 లక్షల ఆదాయం..
గత ఏడాది దసరా సెలవుల సందర్భంగా ప్రత్యేక బస్సులు తిప్పడం వల్ల మొత్తం రూ.26.76 లక్షల ఆదాయం వచ్చింది. దీనిలో హైదరాబాద్ నుంచి జిల్లాకు తిప్పిన సర్వీసుల ద్వారా రూ.10.86 లక్షలు, జిల్లా నుంచి హైదరాబాద్‌కు తిప్పిన సర్వీసుల ద్వారా రూ. 15.90 లక్షల ఆదాయం వచ్చింది.
ఖాళీగా వెళ్ళడం వల్లే 50 శాతం అధికం..
హైదరాబాద్ వంటి దూర ప్రాంతాల నుండి జిల్లా ప్రయాణీకులను ఇక్కడికి తీసుకురావడానికి మన జిల్లా నుంచి ప్రత్యేకంగా బస్సులను పంపుతున్నాం. వెళ్ళే టప్పుడు అవి ఖాళీగా వెళతాయి. అందువల్లనే ఆ నష్టాన్ని కాస్తైనా భర్తీ చేసుకోవడానికి మరో 50 శాతం ప్రయాణికులపై భారం వేయాల్సి వస్తోంది. ప్రయాణీకులకు అసౌకర్యం కలుగకుండా వారి ప్రయాణానికి సర్వీసులను అందుబాటులో ఉంచుతాం. దీనిని ప్రయాణికులూ అర్థం చేసుకుంటున్నారు. ఇటీవల చాలామంది ప్రత్యామ్నాయ వాహనాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆర్టీసీకి అనుకున్నంతగా ఆదాయం రావడం లేదు.
టేకి వెంకట రామం, ఆర్టీసీ డెప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్
Advertisement