నిరీక్షణ.. ఓ పరీక్ష!
ఆసుపత్రిని స్కాన్ చేయండి!
- ప్రహసనంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్
- రేడియాలజిస్టుల కొరతతో అవస్థలు
- అందుబాటులే ఒక్కరే వైద్యురాలు
- గర్భిణుల అవస్థలు వర్ణనాతీతం
- గంటల తరబడి వేచి చూడాల్సిందే..
మహారాజశ్రీ జిల్లా కలెక్టర్ గారికి..
అయ్యా, మేము నిరుపేదలం. ఖరీదైన వైద్యం చేయించుకునేందకు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లలేం. నెలలు నిండడంతో ప్రసవ వేదన పడుతున్నాం. కొన్ని రకాల స్కానింగ్‌లు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. స్కానింగ్ థియేటర్‌కు ఉదయం 9కి వస్తే 11 గంటలైనా పరీక్షలు చేయడం లేదు. సంబంధిత వైద్యులు రాకపోవడంతో మేమంతా వరుసలో నిల్చొని, అలసిపోతే కూర్చొని గంటల తరబడి నిరీక్షిస్తున్నాం. కూర్చోవడానికి బండ ఒక్కటే ఉండడంతో మా అవస్థలు వర్ణనాతీతం. మీరైనా మా బాధలు తీర్చండి.
ఇట్లు
సర్వజనాస్పత్రిలో చికిత్సకు వచ్చిన గర్భిణులు.
అనంతపురం మెడికల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి పనితీరు రోజురోజుకూ దిగజారుతోంది. నిరుపేదలకు పెద్దదిక్కుగా నిలిచే ఈ ఆసుపత్రిలో ఎక్కడికక్కడ నిర్లక్ష్యం వేళ్లూనుకుంది. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవాలంటే గర్భిణులు, మూత్రపిండాల వ్యాధులు, కడుపునొప్పి బాధితులు చుక్కలు చూడాల్సి వస్తోంది. వైద్య సేవలు బాగుంటాయనే ఆశతో వచ్చే రోగులకు ఇక్కడి పరిస్థితితో పై ప్రాణం పైనే పోతోంది. పేరుకు 500 పడకల ఆసుపత్రే అయినా.. ఇన్‌పేషెంట్స్ 800 మందికి పైమాటే. రేడియాలజీ విభాగం పరిధిలోని ఎక్స్‌రే, సీటీ స్కాన్‌ల విషయం పెద్దగా సమస్య లేనప్పటికీ.. అల్ట్రాసౌండ్ విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఈ విభాగం హెచ్‌ఓడీ కృష్ణవేణి ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు. ఆ తర్వాత రేడియాలజిస్టు శారద ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకోగా.. ఆమె కూడా బదిలీపై వెళ్లిపోయారు. మరో రేడియాలజిస్టు పద్మ అనధికారికంగా దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. ఇంకో రేడియాలజిస్టు వసుంధర సైతం గత 15 రోజులుగా విధులకు గైర్హాజరవుతున్నారు. దీంతో భారమంతా డాక్టర్ దీప మోస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు సీనియర్ రెసిడెంట్ మధుబాబు ఉన్నా.. కేటాయించిన గడువు పూర్తి కావడంతో వెళ్లిపోయారు. ఇటీవల డాక్టర్ దీప సెలవు పెట్టడంతో ఒక రోజు స్కానింగ్‌ను సైతం నిలిపేయాల్సిన దుస్థితి తలెత్తింది.
మధ్యాహ్నం దాటితే అంతే..
అల్ట్రాసౌండ్ స్కానింగ్ సేవలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అందిస్తున్నారు. ఆ తర్వాత కాల్ డ్యూటీ పేరుతో వచ్చి వెళ్తున్నారు. ఈ క్రమంలో అత్యవసర కేసులుంటే చాలా మంది బయట స్కానింగ్ సెంటర్లను ఆశ్రయించి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఓపీ సేవలకు ‘స్కానింగ్’ కట్
ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు నిత్యం 300 మంది వరకు గర్భిణులు, మహిళలు వస్తుంటారు. గర్భంలో శిశువు ఎదుగుదల, లోపాలు గుర్తించాలంటే స్కానింగ్ తప్పనిసరి. అయితే వైద్యుల కొరత కారణంగా ప్రస్తుతం ఓపీ సేవలు నిలిపేశారు. గైనిక్ ఓపీకి వచ్చే వాళ్లు స్కానింగ్ చేయించుకోవాలంటే బయటకు వెళ్లాల్సి వస్తోంది. ఇతర సమస్యలతో ఇక్కడికొచ్చే వారి పరిస్థితి కూడా దారుణంగా ఉంటోంది. జిల్లా కలెక్టర్ ఆసుపత్రిపై దృష్టి సారించి పరిపాలనను గాడిన పెట్టాలని రోగులు వేడుకుంటున్నారు.
డీఎంఈతో మాట్లాడుతున్నాం
రేడియాలజిస్టుల కొరత ఉన్న మాట వాస్తవమే. హెచ్‌ఓడీల మీటింగ్ పెట్టి ఔట్ పేషెంట్స్ కేసులకు స్కానింగ్ రాయొద్దని చెప్పాం. ఇక్కడి సమస్యపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)తో మాట్లాడుతున్నాం. కర్నూలు ఆస్పత్రి నుంచి ఎవరినైనా పంపాలని కోరాం. సీనియర్ రెసిడెంట్స్‌నైనా పర్వాలేదన్నాం.
– డాక్టర్ జగన్నాథ్, సూపరింటెండెంట్, సర్వజనాస్పత్రి
ఆ ఇద్దరికీ సెలవు ఇవ్వలేదు
రేడియాలజిస్టులు వసుంధర, పద్మలు సెలవు కావాలని కోరారు. ఇక్కడి పరిస్థితి దృష్ట్యా కుదరదని చెప్పాం. ఒకరు రిజిస్టర్ పోస్టులో పంపారు. మరొకరు నేరుగా ఇచ్చారు. ఇద్దరివీ తిరస్కరించాం. డ్యూటీలకు రాకపోవడంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
– డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్, మెడికల్ కళాశాల