నకిలీ ధ్రువపత్రాలతో కారుణ్యనియామకం ద్వారా ఉద్యోగం సంపాదించాలనుకున్న వ్యక్తి బాగోతాన్ని జిల్లా కలెక్టర్ బట్టబయలు చేశారు.
నకిలీతో పోస్టింగ్‌కు దరఖాస్తు
Aug 30 2016 11:11 PM | Updated on Jul 26 2018 1:37 PM
నకిలీ సర్టిఫికెట్ అని తెలిసినా రికార్డులు కదిపిన అధికారులు
గుర్తించిన కలెక్టరు... క్రిమినల్ కేసుకు సిఫార్సు చేయాలని ఆదేశం
విజయనగరం: నకిలీ ధ్రువపత్రాలతో కారుణ్యనియామకం ద్వారా ఉద్యోగం సంపాదించాలనుకున్న వ్యక్తి బాగోతాన్ని జిల్లా కలెక్టర్ బట్టబయలు చేశారు. క్రిమినల్ కేసుకు సిఫారసు చేశారు. వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాకు చెందిన టి.రామచంద్రరావు పోలీసు ఉద్యోగం చేస్తూ మతి చెందారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయన కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఇందులో భాగంగా కుమారుడు టి.కిరణ్‌కుమార్‌కు ఉద్యోగం ఇవ్వాలని కుటుంబసభ్యులు అధికారులను కోరారు.
కిరణ్‌కుమార్ విద్యాభ్యాసం ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విజయనగరం జిల్లాలో సాగడంతో ఇక్కడ పోస్టింగ్ ఇవ్వాలని విశాఖపట్నం పోలీసు అధికారుల నుంచి జిల్లా కలెక్టరుకు విజ్ఞాపన వచ్చింది. పరిశీలించిన కలెక్టరేట్ అధికారులు కారుణ్య నియామకాల కింద ఉద్యోగం కోసం రెండు నెలల క్రితం అప్పటి కలెక్టరు ఎం.ఎం.నాయక్‌కు పెట్టారు. ఆయన జూనియర్ సహాయకుల పోస్టింగ్‌తోపాటు ఐసీడీఎస్ శాఖకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు విద్యార్హత, ఇతర ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి విధుల్లో చేర్చుకోవాలని సూచిస్తూ ఐసీడీఎస్ పీడీకి కలెక్టర్ ఉత్తర్వులు పంపారు.
నకిలీ ధ్రువీకరణ పత్రం గుర్తించిన అధికారులు
ధ్రువపత్రాలు పరిశీలన సమయంలో ఆయన విద్యార్హత పత్రాలు పరిశీలించిన అధికారులు అందులో డిగ్రీ సర్టిఫికెట్ నకిలీదని గుర్తించారు. డిగ్రీ ఫుణే శ్రీధర్ యూనివర్సిటీ నుంచి ఉత్తీర్ణులైనట్లు ధ్రువీకరణ పత్రం ఉద్యోగం కోసం జత చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డీగ్రీ ఉత్తీర్ణత కాకుంటే అటెండరు పోస్టు ఇస్తారు. ఈ నేపధ్యంలో జూనియర్ సహాయకునిగా పోస్టు పొందాలన్న తపనతో కిరణ్‌కుమార్ అక్రమ మార్గం వెతికారు. ఐసీడీఎస్ అధికారుల పరిశీలనలో అది దొంగ ధ్రువీకరణ పత్రం అని తేలడంతో వారు కలెక్టరుకు వాస్తవాన్ని నివేదించారు. అప్పటి కలెక్టరు ఎం.ఎం.నాయక్ ఆయన ఉద్యోగ నియమకాన్ని నిలుపుదల చేశారు. వెంటనే విచారణ చేయాలని కోరారు.
సంబంధం లేదన్న యూనివర్శిటీ
కలెక్టరేట్ పరిపాలనాధికారి రమణమూర్తి దీనిపై విచారణ చేశారు. విశాఖపట్నం బ్రాంచిలో ఉత్తీర్ణులైనట్లు చూపడంతో ఆరా తీశారు. విశాఖపట్నంలో ఆ యూనివర్సటీ బ్రాంచి లేదని తేలింది. దీంతో పుణే శ్రీధర్ యూనివర్సటీ అధికారులను సంప్రదించారు. తమకు విశాఖపట్నంలో బ్రాంచి లేదని, తాము ఆ« వ్యక్తికి ధ్రువీకరణ పత్రం జారీ చేయలేదని అక్కడి అధికారులు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని కలెక్టరేట్ పరిపాలనా అధికారి రమణమూర్తి ‘సాక్షి’ వద్ద స్పష్టం చేశారు.
కొత్త కలెక్టరు రాకతో కదిలిన రికార్డులు
కలెక్టరు ఎం.ఎం.నాయక్‌కు బదిలీ జరగడంతో కొత్త కలెక్టర్‌గా వివేక్‌యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఈ రికార్డు మళ్లీ తెరపైకి వచ్చింది. డీగ్రీ ధ్రువీకరణ పత్రం నకలీదని తెలిసినప్పటికీ మానవతా దక్పథంతో ఇంటర్మీడియట్ వరకు సరైన ధ్రువపత్రాలు ఉన్నాయని అటెండరు పోస్టింగ్ ఇచ్చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇటీవల కొత్తగా చేపట్టిన కారుణ్య నియమకాల్లో కిరణ్‌కుమార్‌కు పోస్టింగ్ కోసం కలెక్టరేట్ అధికారులు కలెక్టర్‌కు ఫైలు పెట్టారు. అయితే ఆప్పట్లో ఇవ్వకుండా ఇప్పుడు మళ్లీ పెట్టడంపై కలెక్టర్ వివేక్ అనుమానం వ్యక్తం చేసి, వాస్తవాలు తెలుసుకుని అడ్డదార్లు తొక్కిన వ్యక్తికి పోస్టింగ్ ఇవ్వవద్దని, క్రిమినల్ కేసు పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయనపై క్రిమినల్ కేసు పెట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Advertisement
Advertisement