గుత్తి: మునిసిపాలిటీ పరిధిలోని చెట్నేపల్లికి చెందిన నకిలీ సర్టిఫికెట్ల ముఠా సభ్యుడు మనోజ్‌ను మంగళవారం కర్నూల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. చెట్నేపల్లికి చెందిన మనోజ్ కర్నూలుకు చెందిన నకిలీ సర్టిఫికెట్ల గ్యాంగ్‌తో జతకట్టాడు. గ్యాంగ్‌లో సుమారు పది మంది దాకా ఉన్నారు. సదరు గ్యాంగ్ సభ్యులు అనంతపురంలో ఉంటూ డిగ్రీ, పీజీ, బీఎడ్, డీఎడ్, బీపీడీ వంటి నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి విక్రయిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు.
ఇటీవల కర్నూలుకు చెందిన కొంతమంది వ్యక్తులు తమకు బీఎడ్, డిగ్రీ సర్టిఫికెట్లు కావాలని నకిలీ సర్టిఫికెట్ల గ్యాంగ్‌ను కలిసి వేలాది రూపాయలు సమర్పించుకున్నారు. అయితే సర్టిఫికెట్లు ఇవ్వకుండా రేపు మాపు అంటూ తిప్పుకోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కర్నూలు పోలీసులను వెంట బెట్టుకుని నకిలీ గ్యాంగ్ సభ్యుడు మనోజ్ నివాసముండే చెట్నేపల్లికి వచ్చారు. వీరిని గమనించి పారిపోవడానికి ప్రయత్నించిన మనోజ్‌ను పట్టుకుని కర్నూలుకు తీసుకెళ్లారు. నకిలీ సర్టిఫకెట్ల గ్యాంగ్‌లో ఎంత మంది ఉన్నారు? వారు ఏ ప్రాంతాలకు చెందిన వారు? ఇంత వరకు ఎన్ని నకిలీ సర్టిఫికెట్లను తయారు చేశారు? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
నకిలీ సర్టిఫికెట్ల ముఠా సభ్యుడు అరెస్ట్
Published Tue, Aug 22 2017 9:58 PM | Last Updated on Thu, Jul 26 2018 1:37 PM
Advertisement