నకిలీ నక్సలైట్లు అరెస్టు
– ఫైనాన్స్ వ్యాపారిని బెదిరించి రూ.1.50 కోట్లు డిమాండ్
– ఒకరు స్వయాన బావమరిది, మరొకరు మహిళా కండక్టర్
– బెదిరించడానికి వినియోగించిన సెల్‌ఫోన్, సిమ్‌కార్డు, డ్రాఫ్ట్ లెటర్ స్వాధీనం
– నిందితులను ఎస్పీ ఎదుట హాజరుపరచిన ఆదోని పోలీసులు
కర్నూలు : నక్సలైట్ల పేరుతో ఫైనాన్స్ వ్యాపారిని బెదిరించి డబ్బు డిమాండ్ చేసిన ఇద్దరు వ్యక్తులు పోలీసులకు చిక్కారు. వీరిలో ఒకరు ఫైనాన్స్ వ్యాపారికి స్వయాన బావమరిది కాగా, మరొకరు మహిళా కండక్టర్ కావడం గమనార్హం. మంగళవారం సాయంత్రం వ్యాస్ ఆడిటోరియంలో ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నకిలీ నక్సలైట్ల వివరాలు వెల్లడించారు. ఆదోని పట్టణం పోస్టల్ కాలనీలో నివాసముంటున్న ఎనకొండ్ల గుర్రెడ్డి చిన్నమార్కెట్ వీధిలో మల్లికార్జున పేరుతో సుమారు 15 సంవత్సరాల నుంచి ఫైనాన్స్ వ్యాపారం నడుపుతున్నాడు. 2016 ఫిబ్రవరి 20వ తేదీన రామకృష్ణ అలియాస్ ఆర్కే మావోయిస్టు కేంద్ర కమిటీ పేరుతో శ్రీధర్‌రెడ్డి, ఆవుల శారదలు కలిసి గుర్రెడ్డికి ఉత్తరం రాశారు.
ఆదోనిలో అక్రమాలకు పాల్పడుతున్నందున తమకు రూ.1.50 కోట్లు 2017 మార్చి 6వ తేదీన ఇవ్వాలని ఉత్తరంలో పేర్కొన్నారు. ఇవ్వకపోతే అతడిని, అతడి కుమారుడిని చంపుతామని ఉత్తరంలో పేర్కొన్నారు. 2017 ఫిబ్రవరిలో 79937 74109, 78010 66823 నంబర్ల ద్వారా అరుణక్క పేరుతో గుర్రెడ్డికి ఫోన్ చేసి కోటిన్నర రూపాయలు తాము డిమాండ్ చేసినట్లు ఎవరికీ తెలియకుండా రహస్యంగా అందజేయాలని, లేకపోతే చంపుతామని బెదిరించారు. వెంటనే అతను అదే రోజు మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా శ్రీధర్‌రెడ్డి, ఆవుల శారదపై పక్కా నిఘా వేసి అరెస్టు చేశారు.
ఫిర్యాదుదారుడికి నిందితుడు శ్రీధర్‌రెడ్డి స్వయాన బావమరిది. ఫైనాన్స్ వ్యాపారం విషయంలో దెబ్బ కొట్టాలని శారదతో చేతులు కలిపి నక్సలైట్ల పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారు. శారద స్వదస్తూరితో లెటర్ రాసి ఆత్మకూరులో స్పీడ్ పోస్టు ద్వారా గుర్రెడ్డికి పంపినట్లు విచారణలో బయటపడింది. 78010 66823 సిమ్‌ను ఆదోనికి చెందిన సురేంద్ర భార్య సెల్ నుంచి ఆమెకు తెలియకుండా ఆవుల శారద దొంగలించి అరుణక్క పేరుతో మాట్లాడి గుర్రెడ్డిని బెదిరించినట్లు శ్రీధర్‌రెడ్డి పోలీసు విచారణలో అంగీకరించాడు. భావ గుర్రెడ్డి ఆర్థికంగా బాగా సంపాదించడమే కాక తన ఫైనాన్స్ వ్యాపారానికి అడ్డు తగులుతున్నాడనే ఉద్దేశంతో మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టేందుకు ఈ కుట్ర పన్నినట్లు వెల్లడించారు.
ఆవుల శారద ప్రస్తుతం ఆదోని ఏపీఎస్‌ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తోంది. ఈమె శ్రీధర్‌రెడ్డికి ఆరు నెలల క్రితం పరిచయమైంది. గుర్రెడ్డిని బెదిరించడానికి వాడిన సెల్‌ఫోన్, సిమ్‌కార్డు, డ్రాఫ్ట్ లెటర్‌ను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. కేసు దర్యాప్తు వేగవంతం చేసి ఛేదించిన డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు, ఆదోని మూడో పట్టణ సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ సునిల్‌ను ఎస్పీ అభినందించారు.