నాగోలు: నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని పోలీసులమని బెదిరించి బ్యాగులో ఉన్న రూ.1.40 లక్షలు కాజేసిన ఘటన ఎల్బీనగర్ ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.... నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన డీ.శ్రీనివాస్ (44) అదే ప్రాంతానికి చెందిన కోళ్ల దాణా వ్యాపారి నరేందర్ వద్ద గుమాస్తా. మంగళవారం మధ్యాహ్నం నగరానికి వచ్చి వివిధ ప్రాంతాల్లోని వ్యాపారుల నుంచి దాదాపు రూ.3 లక్షలు వసూలు చేశాడు.
అనంతరం దేవరకొండ వెళ్లేందుకు సాగర్‌రింగ్‌రోడ్డుకు వచ్చి యజమాని నరేందర్‌కు ఫోన్ చేశాడు. ఆయన అష్టలక్ష్మీ ఆలయం వద్ద పని ఉంది, అక్కడికి వెళ్లాలని చెప్పాడు. దీంతో శ్రీనివాస్ తిరిగి సాగర్‌రింగురోడ్డు నుంచి ఎల్బీనగర్ వైపు వస్తుండగా గెలాక్సీ ఆసుపత్రి సమీపంలో ఇద్దరు వ్యక్తులు బైకుపై వచ్చి స్పెషల్ ఐడీ పార్టీ పోలీసులమని, నీ బ్యాగును తనిఖీ చేయాలని బెదిరించారు. వారిలో ఒకడు మీ యజమానికి ఫోన్ చెయ్యి మాట్లాడాలి అన్ని అన్నాడు.
ఫోన్ మాట్లాడుతుండగా మరొకడు బ్యాగులో ఉన్న రూ.1.40 లక్షలు తీసుకుని పారిపోయారు. శ్రీనివాస్ బ్యాగులో చూడగా రూ.1.40 లక్షలు కనిపించలేదు. వెంటనే అతను యజమానికి విషయం చెప్పాడు. ఆయన వచ్చాక మంగళవారం రాత్రి ఎల్బీనగర్ పోలీస్‌స్టేన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.