ఆందోళన చేస్తున్న రైతులు
-
వ్యాపారిపై దాడి
-
కాల్వొడ్డు, టీడీడీసీ, జేడీఏ కార్యాలయాల వద్ద ధర్నా
-
కలెక్టర్, జేడీఏ హామీతో ఆందోళన విరమణ
ఖమ్మం వ్యవసాయం : నకిలీ మిరప విత్తనాలపై రైతులు ఖమ్మం రోడ్లపై కదం తొక్కారు. ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన రైతులు నకిలీ మిరప విత్తనాలతో నష్టపోయామని తమకు తగిన న్యాయం చేయాలని సోమవారం రైతులు పెద్ద సంఖ్యలో ఆందోళన చేశారు. తిరుమలాయపాలెం, కూసుమంచి, ముదిగొండ, ఖమ్మం రూరల్, రఘునాథపాలెం, బోనకల్లు, చింతకాని, వైరా, వేంసూరు, తల్లాడ, వరంగల్ జిల్లా డోర్నకల్, కురవి, మరిపెడ మండలాలకు చెందిన రైతులు వందలాదిగా ఖమ్మం వచ్చి వివిధ ప్రాంతాల్లో ఆందోళన చేశారు. తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, కూసుమంచి, డోర్నకల్, కురవి మండలాలకు చెందిన రైతులు జీవా మిరప విత్తనాలు విక్రయించిన ఖమ్మం నగరంలోని పొట్టి శ్రీరాములు రోడ్‌లో ఉన్న శ్రీ లక్ష్మీ భార్గవిసీడ్స్ దుకాణం వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేసే వరకు ఇక్కడ నుంచి కదలమని రైతులు అక్కడే కూర్చున్నారు. అక్కడకు చేరిన వ్యాపారి మోహన్‌రావుపై దాడి చేశారు. పోలీసులు వ్యాపారిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో రైతులు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని తమకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. అక్కడ నుంచి రైతులు పెద్ద సంఖ్యలో కాల్వొడ్డుకు చేరుకొని రాస్తారోకో చేశారు. రైతుల ఆందోళనను తెలుసుకున్న జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు ఎ.ఝాన్సీకుమారి, ఉపసంచాలకలు విజయనిర్మల ఘటనా స్థలానికి చేరుకొని రైతులు వ్యవసాయ కార్యాలయానికి రావాలని, అక్కడ విషయాన్ని చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొనడంతో రైతులు జేడీఏ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు బోనకల్లు, చింతకాని, వైరా, తల్లాడ, రఘునాథపాలెం, వేంసూరు, ముదిగొండ మండలాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో నకిలీ మిరప విత్తనాలపై తమకు న్యాయం చేయాలని కోరుతూ ఖమ్మం చేరుకున్నారు. జిల్లా ఉన్నతాధికారులు టీడీడీసీ భవన్‌లో సమావేశంలో ఉన్నారని తెలిసి రైతులు అక్కడకు చేరుకున్నారు. అక్కడ జేడీఏ, డీడీఏలు ఉండటంతో ఆయా అధికారులను ఘెరావ్ చేశారు. ఈ అంశాన్ని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ లోకేషకుమార్ దృష్టికి తీసకు వెళ్లారు. కలెక్టర్ తమ వద్దకు వచ్చి తగిన హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ టీడీడీసీ భవన్‌కు వచ్చి రైతులు చెప్పిన అంశాలను విన్నారు. నకిలీ మిరప విత్తనాలకు సంబంధించి పూర్తి వివరాలను తీసుకోవాలని, విత్తనాలు విక్రయించిన ఏజెన్సీలను, కంపెనీల ప్రతినిధులను పిలిపించాలని వ్యవపసాయ శాఖ అధికారులకు ఆదేశించారు. అందుకు గడువు పెట్టాలని రైతులు డిమాండ్ చేయడటంతో 4 రోజుల గడువులో కంపెనీ ప్రతినిధులను పిలిపించి మాట్లాడుతామని చెప్పారు. అక్కడ నుంచి వ్యవసాయ అధికారులు జేడీఏ కార్యాలయం వద్దకు చేరుకొని అక్కడ ధర్నా చేస్తున్న రైతులకు కూడా అదే విషయాన్ని వివరించారు. జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ జిల్లా ఉన్నతాధికారులు హామీ ఇవ్వటంతో రైతులు ఆందోళనను విరమించారు. శ్రీలక్ష్మీభార్గవి సీడ్స్ దుకాణం వ్యాపారి మాత్రం పోలీసుల అదుపులో ఉన్నారు.