
రికార్డులు తగులబెట్టిన దృశ్యం (ఫైల్)
► ‘రికార్డుల దహనం’పై విచారణకు ఆదేశం?
మల్కాజిగిరి: ఎలుక చనిపోయిందని రికార్డులను తగులబెట్టిన ఘటనపై మల్కాజిగిరి సర్కిల్ ఇన్‌చార్జి ఉప కమిషనర్ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. నల్లా కనెక్షన్లకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలతో పాటు ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన రికార్డులను మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయంలోని ఆవరణలో ఈనెల 16న కుప్పగా పోసి తగులబెట్టారు. ఎంతో ముఖ్యమైన ఈ రికార్డులను ఎలుక చనిపోయిందనే సాకుతో తగులబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ విషయాన్ని ‘సాక్షి’.. ‘ఎలుక చనిపోయిందని రికార్డులు తగులబెట్టారు’ అనే శీర్షికన కథనం ప్రచురించింది. దీనికి స్పందించిన ఇన్‌చార్జి ఉప కమిషనర్ రమేష్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు సమాచారం. ఇంజినీరింగ్ విభాగంలో భద్రంగా ఉండాల్సిన రికార్డులు ఎలా బయటకు వచ్చాయి? వీటిని తగులబెట్టేందుకు పారిశుద్ధకార్మికులను ఎవరు పిలిచారు అనే కోణాల్లో దర్యాప్తు చేయమని ఏఎంహెచ్‌ఓకు ఆదేశించినట్లు తెలిసింది.