అడ్డంగా దొరికిన నిందితుడు
తప్పుడు సర్టిఫికెట్లతో ఎక్స్‌గ్రేషియా కోసం దరఖాస్తు
ధ్రువీకరణ ఇచ్చిన సర్పంచ్, వీఆర్వోలతో సహా ఐదుగురిపై కేసు
కూసుమంచి : తప్పుడు సర్టిఫికెట్‌తో ఎక్సైజ్‌శాఖను బురిడీ కొట్టించాలని ప్రయత్నించిన ఓ గీత కార్మికునిపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఆయనకు ధ్రువీకరణ పత్రం ఇచ్చిన సర్పంచ్, వీఆర్వో, గీత కార్మికసంఘం అధ్యక్షుడు, తాటిచెట్టు యజమానిపైనా కేసు న మోదు చేశారు. కూసుమంచి ఎస్సై శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం..
ఈశ్వరమాధారం గ్రామానికి చెందిన జనుకుంట్ల అంజయ్య (45) అనే గీత కార్మికుడు జనవరి నెలలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి పడి గాయాలపాలైతే ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇస్తుండటంతో అంజయ్య దాని కోసం కక్కుర్తి పడ్డాడు. తాను చెట్టుపై నుంచే పడినట్లు సర్పంచ్, వీఆర్వో, గ్రామానికి చెందిన గీత కార్మికసంఘం అధ్యక్షుడితో పాటు తాటి చెట్టు యజమాని నుంచి సర్టిఫికెట్లు రాయించుకున్నాడు. ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందినట్లు ధ్రువీకరణ పత్రం తెచ్చుకున్నాడు. వీటన్నింటినీ జత చేసి ఫిబ్రవరిలో ఎక్సైజ్‌శాఖకు ఎక్స్‌గ్రేషియా కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
ఆ దరఖాస్తును పరిశీలించిన అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో అంజయ్య తాటిచెట్టు పైనుంచి పడిపోలేదని, మోటార్‌సైకిల్‌పై వెళ్తుంటే వాహనం ఢీకొట్టడంతో గాయాలయ్యాయని తేలింది. తప్పుడు ధ్రువీకరణపత్రాలతో తమశాఖను, ప్రభుత్వాన్ని మోసం చేయాలని యత్నించిన అంజయ్యతో పాటు ఇందుకు పరోక్ష కారకులైన సర్పంచ్ ఎరబోలు సైదమ్మ, వీఆర్వో ఎండీ ఇస్మాయిల్, గీత కార్మిక సంఘం అధ్యక్షుడు కాసాని ఉపేందర్, తాటిచెట్టు యజమాని రుక్కయ్యలపై ఎక్సైజ్ సూపరింటెండెంట్ గణేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.