కుక్కలకూ కు.ని.
♦ స్పెషల్ డ్రైవ్‌గా సంతాన నిరోధక ఆపరేషన్లు
♦ ఆరు నెలల్లో 70 శాతం లక్ష్యం
♦ పెంపుడు కుక్కల రిజిస్ట్రేషన్ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌లో వీధి కుక్కలకు అడ్డుకట్ట వేసేందుకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక చర్యలకు ఉపక్రమిస్తోంది. ఇందులో భాగంగా సంతాన నిరోధక ఆపరేషన్లతో వీధి కుక్కల పునరుత్పత్తి కట్టడి చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం నగరంలో ఆరు లక్షలకు పైగా వీధి కుక్కలు ఉండగా, స్పెషల్ డ్రైవ్ ద్వారా ఆరు నెల ల్లో వాటిలో 70 శాతం కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించాలని అధికారులు నిర్ణయించా రు. ఇందులో జీహెచ్‌ఎంసీ వెటర్నరి విభాగంతో పాటు రాష్ట్ర పశు సంవర్థక శాఖ సేవలను కూడా వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. నగరంలో ఎనిమల్ కేర్ సెంటర్లను ఐదు నుంచి తొమ్మిదికి పెంచాలని నిర్ణయించారు. మంగళవారం జీహెచ్‌ఎంసీలో కమిషనర్ జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర పశుసంవర్థక శాక డెరైక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, నారాయణగూడ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ సీనియర్ అధికారి డాక్టర్ సంపత్‌కుమార్, జీహెచ్‌ఎంసీ వెటర్నరీ అధికారులు తదితరులు పాల్గొని పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.
జంటకు నాలుగువేల ఉత్పత్తి
ఒక కుక్కల జంట ఏడేళ్లలో 4 వేల కుక్కలు ఉత్పత్తి సేస్తుంది. కుక్క జీవిత కాలం 8 నుంచి 11 సంవత్సరాలు కాగా, ప్రతి ఎనిమిది నెలలకు ఒకసారి నాలుగు నుంచి ఆరు పిల్లలకు జన్మనిస్తోంది. నగరంలో ఉన్న సుమారు ఐదున్నర లక్షల వీధి కుక్కల్లో పునరుత్పత్తి రేటు అధికంగా ఉన్నట్లు జీహెచ్‌ఎంసీ గుర్తించింది.
ప్రైవేటులో ఆపరేషన్లు
ప్రైవేటు సంస్థల ద్వారా కూడా కుక్కలకు సంతాన నిరోధక ఆపరేషన్ నిర్వహించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 11 మంది ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్లు, 24 మంది ప్రైవేటు డాక్టర్లు 102 డాగ్ క్యాచర్లు ఉన్నారు. ప్రస్తుతం ప్రైవేటు డాక్టర్లతో పాటు వెటర్నరీ ఆసుపత్రుల్లో కూడా వీధి కుక్కలకు ఆపరేషన్ నిర్వహించాలని నిర్ణయించారు.
వీధి కుక్కలకు వ్యాక్సినేషన్
నగరంలోని వంద శాతం వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేయనున్నటు కమిషనర్ డాక్టర్ బి. జనార్దన్ రెడ్డి తెలిపారు. జీహెచ్‌ఎంసీ ద్వారా ఏటా లక్ష కుక్కలకు ఆపరేషన్లు నిర్వహిస్తున్నామన్నారు.
రెబిస్ రహిత నగరంగా హైదరాబాద్
గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని రెబిస్ రహిత నగరంగా తీర్చిదిద్దడానికి జీహెచ్‌ఎంసీతో కలిసి పనిచేసేందుకు సిద్దమేనని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇందుకుగాను కనీసం 20 మంది డాక్టర్లను ఇతర జిల్లాల నుంచి డిప్యూటేషన్‌పై నియమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
రేబిస్ కేసులు తగ్గుముఖం
జీహెచ్‌ఎంసీ పరిధిలో గత రెండేళ్లలో రేబిస్ వ్యాధితో ఒక్కరు కూడా మరణించలేదని నారాయణగూడలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ సంస్థ నివేదికలో స్పష్టం చేసింది. గత రెండేళ్లలో 61,749 మంది కుక్క కాటుకు గురైనట్లు వారు పేర్కొన్నారు.
ఇంటి కుక్కలకు లెసైన్స్ తప్పని సరి
ఇంటి కుక్కలకు లెసైన్స్ తప్పనిసరి చేశారు. జీహెచ్‌ఎంసీలో రూ. 50 చొప్పున చెల్లించి ప్రత్యేక నంబర్ లెసైన్స్ పొందాల్సి ఉంటుందని, లెసైన్స్‌లేని కుక్కలను జీహెచ్‌ఎంసీ స్వాధీనం చేసుకుంటుందని అధికారులు పేర్కొన్నారు.