ఆర్థిక ఇబ్బందులతో నలుగురి బలవన్మరణం
నంద్యాల:
ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా నంద్యాల పట్టణ శివారులోని ప్రథమ నంది క్షేత్రం వద్ద ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నంద్యాల రైల్వేస్టేషన్ ప్రాంతంలోని బర్మాషెల్ వద్ద నివాసం ఉంటున్న రాంప్రసాద్(40) ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు. కుటుంబం గడవకపోవడంతో అప్పుల పాలయ్యాడు. ఈ నేపథ్యంలో ఇంటిని అమ్మేసినా ఆర్థిక ఇక్కట్ల నుంచి బయట పడలేకపోయాడు. రుణదాతల నుంచి ఒత్తిళ్లు అధికం కావడంతో ఆదివారం ఉదయం 7.30 గంటలకు ప్రథమ నంది క్షేత్రంలోని పొలాల్లో భార్య సత్యవతి(38), కుమారుడు విజయ్(12), కుమార్తె శోభ(14)తో కలిసి రాంప్రసాద్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను ప్రకాశం జిల్లా దొణగొండకు తరలించేందుకు వైఎస్‌ఆర్‌సీపీ నంద్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి రాజగోపాల్‌రెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. త్రీటౌన్ సీఐ ప్రతాప్‌రెడ్డి, ఎస్‌ఐ సూర్యమౌళి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.