రైతు సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తాం
రైతు సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తాం
Published Wed, Jul 27 2016 11:34 PM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM
ఏపీ అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ రాధాకృష్ణ
అంబాజీపేట : రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తామని ఏపీ అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.రాధాకృష్ణ అన్నారు. వరి, కొబ్బరి, అరటి, ఆక్వా, ఉద్యాన రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ఏపీ అగ్రికల్చర్ కమిషన్ బృందం బుధవారం అంబాజీపేట వచ్చింది. మార్కెట్ యార్డులో సర్పంచ్ సుంకర సత్యవేణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాధాకృష్ణ మాట్లాడారు. తొలుత రైతులు తమ ఇబ్బందులను కమిషన్‌కు వివరించారు. కోనసీమలో ఇప్పటికే 5, 6 సార్లు కమిషన్ సభ్యులు పర్యటించినా రైతులకు లాభం చేకూరలేదని చెప్పారు. 2011 కోనసీమలో క్రాప్ హాలిడే ప్రకటించినప్పుడు మోహన్‌కందా కమిషన్ పర్యటించి రైతు సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీ నెరవేరలేదన్నారు. కోనసీమలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతులను ఆదుకునేందుకు కొబ్బరికాయను రూ.10కు రైతు వద్దే కొనుగోలు చేయాలన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయాలన్నారు. ఆక్వా రంగం కోసం 50 శాతం రాయితీతో కోల్డ్‌స్టోరేజీలను నిర్మించాలని చెప్పారు. ఏటా మే 15న కాలువలను మూసివేసి జూన్ 15న నీరందించాలని కోరారు. జీవన ఎరువుల తయారీ ల్యాబ్‌లను జిల్లాలో ఏర్పాటు చేయాలని సూచించారు. 2013 నుంచి నీలం, హెలెన్, హుదూద్ తుపానులకు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ రూ.1300 కోట్లు నేటికీ విడుదల కాలేదన్నారు. పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో కమిషన్ టాస్క్‌ఫోర్స్ ప్రొఫెసర్ ఎస్.గలాబ్, ఏపీ అగ్రికల్చర్ సభ్యులు ప్రొఫెసర్‌లు డి.ఎన్.రెడ్డి, పి.పి.రెడ్డి, కె.ఎస్.రెడ్డి, డాక్టర్ టి.సత్యనారాయణ, డాక్టర్ మిశ్రా, ప్రొఫెసర్ వెంకటరెడ్డి, అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ కె.వి.ఎస్.ప్రసాద్, ఏడీఏ జె.ఎలియాజర్, ఏఓ ఎం.విజయలక్ష్మి, ఎంపీపీ దాసరి వీరవెంకట సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ అరిగెల బలరామమూర్తి, రైతులు జున్నూరి బాబి, తిక్కిరెడ్డి గోపాలకృష్ణ, అడ్డాల గోపాలకృష్ణ, ముత్యాల జమ్మీలు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement